About Chandrayan-2
- కీలక ఘట్టంలో చంద్రయాన్
- ఆర్బిటర్ నుంచి విడిపోనున్న ల్యాండర్
- ఐదోసారి విజయవంతంగా కక్ష్యను తగ్గించిన ఇస్రో
ఈనాడు డిజిటల్, బెంగళూరు: జాబిల్లిపై కాలుమోపేందుకు భారత్ ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన ‘చంద్రయాన్-2’ సోమవారం అత్యంత కీలక దశకు చేరుకోనుంది. ఈ వ్యోమనౌకలోని ఆర్బిటర్ నుంచి ‘విక్రమ్’ ల్యాండర్ నేడు విడిపోనుంది. సోమవారం మధ్యాహ్నం 12.45 గంటల నుంచి 1:45 గంటల మధ్య ఈ కార్యక్రమం జరుగుతుంది. ఫలితంగా చందమామ ఉపరితలంపై ల్యాండింగ్ ప్రక్రియకు అది మరింత చేరువవుతుంది.
జులై 22న శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-2 కొద్దిరోజుల పాటు భూ కక్ష్యలో పరిభ్రమించి, ఆగస్టు 20న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నాలుగుసార్లు దాని కక్ష్యను ఇస్రో తగ్గించింది. ఆదివారం సాయంత్రం 6.21 గంటలకు ఐదోసారి ఆ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించింది. చంద్రయాన్-2ను జాబిల్లి చుట్టూ ఉన్న 119 కిలోమీటర్లు× 127 కిలోమీటర్ల కక్ష్యలోకి చేర్చింది. ఈ కక్ష్య దాదాపుగా వృత్తాకారంలో ఉంది.
విడిపోయేది ఇలా..
చంద్రయాన్-2 వ్యోమనౌక పైభాగంలో ల్యాండర్ ఉంటుంది. దీన్ని క్లాంపులు, ప్రత్యేక బోల్టులతో ఆర్బిటర్‌కు అనుసంధానించారు. సోమవారం నిర్దేశిత కక్ష్య పరిధిలోకి చేరగానే ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయేలా ఇస్రో సంకేతాలు పంపుతుంది. విడిపోయే ప్రక్రియ 50 మిల్లీసెకన్లలోనే పూర్తవుతుంది. తొలుత ఆర్బిటర్, ల్యాండర్‌ను సంధానించే రెండు బోల్టులు తెగిపోతాయి. ఫలితంగా ల్యాండర్ విడిపోతుంది.
ఈ నెల 3, 4 తేదీల్లో మరోసారి ల్యాండర్ కక్ష్యను తగ్గిస్తారు. ఫలితంగా అది 35 కిలోమీటర్లు× 97కిలోమీటర్ల కక్ష్యలోకి చేరుతుంది. ఈ నెల 7న అంతిమ ఘట్టం చోటుచేసుకుంటుంది. ఆ రోజున ల్యాండర్‌లోని ‘పవర్ డిసెంట్’ దశ ఆరంభమవుతుంది. ఆ వ్యోమనౌకలోని రాకెట్లను మండించడం ద్వారా దాన్ని కిందకు దించుతారు. ఆ తర్వాత 15 నిమిషాల్లో ల్యాండర్.. చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలోని ప్రాంతంలో దిగుతుంది. నాలుగు గంటల తర్వాత అందులోని రోవర్ బయటకు వస్తుంది.
0 Response to "About Chandrayan-2"
Post a Comment