The distress of fees to private schools through the Amma Ammo scheme
అమ్మ ఒడి’తో కొత్త తంటా..తలలు పట్టుకుంటున్న ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు.
- అమ్మ ఒడి రానీయండి..!
- ఫీజులు కట్టాలంటూ ప్రైవేటు స్కూళ్ళ నుంచి నోటీసులు
- జనవరిలో కడతామంటున్న తల్లిదండ్రులు
- ఫస్ట్ టర్మ్ 30 శాతం కూడా వసూలు కాలేదు
- తలలు పట్టుకుంటున్న యాజమాన్యాలు
- జిల్లాలో చేతులెత్తేస్తున్న కొన్ని పాఠశాలలు
‘‘ ఫీజుకు ఎందుకు తొందర పెడతారు... మేమేమైనా పారిపోతామా ? అమ్మ ఒడి పథకంలో వచ్చే జనవరి 26న ప్రభుత్వం రూ.15 వేలు ఇస్తుంది. ఆ సొమ్ములు తెచ్చి మీ ఫీజులు చెల్లిస్తాం.. మూడు నెలలుగా పనులు లేక ఇల్లు గడవడమే కష్టంగా ఉంటోంది. కాస్తంత ఓపిక పట్టండి. ఫీజు తెమ్మని మాకు ఫోన్లు చెయ్యకండి. పిల్లల డైరీలలోనూ రాయద్దు.. ’’ అంటూ పలువురు పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలు చదివే పాఠశాలల యాజమాన్యాలకు సూచనలు చేస్తున్నారు. దీంతో ఆయా యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నాయి. ఫస్ట్ టర్మ్ ఫీజు ఇప్పటి వరకూ 30 శాతం వసూలు కాలేదని అధికశాతం పాఠశాలల యాజమాన్యాలు తెలుపుతున్నాయి.
ప్రతి జిల్లాలో సుమారు 400 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఇందులో సుమారు 150 వివిధ కార్పొరేట్ పాఠశాలలకు సంబంధించిన బ్రాంచిలు కాగా, 250 మధ్యతరహా, చిన్నతరహా ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఇందులో సుమారు 150 పాఠశాలల్లో విద్యార్థులు సంఖ్య 100 లోపే. చిన్నతరహా పాఠశాలల్లో భార్య భర్త పనిచేస్తుంటారు. యాజమాన్యానికి చెందిన బార్య భర్తలు రోజంతా విద్యార్థులకు పాఠాలు చెప్పడానికే వెచ్చించినప్పటికీ నెలకు చెరో రూ.10 వేలు జీతం తీసుకోవడం గగనమవుతోందని కొన్ని పాఠశాలల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. చిన్నతరహా ప్రైవేటు పాఠశాలల్లో సాధారణంగా మధ్యతరగతి, దిగువ మధ్య తరగతికి చెందిన విద్యార్థులే అధికంగా ఉంటారు. ఫీజులు ఆలస్యంగానే చెల్లిస్తుంటారు. యాజమాన్యాలు సానుభూతితోనే వ్యవహరిస్తూ అభ్యర్థపూర్వకంగానే ఫీజులు వసూలు చేస్తారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు అమ్మఒడి పెద్ద తంటా తెచ్చిపెట్టింది. జనవరి నెలవరకూ ఆగండి.. అమ్మఒడి సొమ్ము మా బ్యాంక్ ఖాతాలో పడిన వెంటనే తెచ్చి ఇస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతుంటే, ఏం చేయాలో పాలుపోక ఆయా యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నాయి. రాష్ట్రంలో కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో సుమారు 35 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. జిల్లాలో ఈసంఖ్య 2 లక్షలు పైబడి ఉంది. ఒకొక్క విద్యార్థికీ వార్సిక ఫీజు రూ. 15వేలు అనుకుంటే సుమారు రూ. 300 కోట్లు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
కార్పోరేట్ పాఠశాలలు, విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న ప్రైవేటు పాఠశాలలు ఆర్థికంగా ముందుకు వెళ్ళగలుగుతున్నప్పటికీ, చిన్న ప్రైవేటు పాఠశాలల పరిస్థితి దయనీయంగా మారింది. ఆర్థిక ఇబ్బందులతో చేతులు ఎత్తివేస్తున్నాయి. అమ్మఒడి నిధులు వస్తేనే తమకు ఫీజులు వస్తాయనే స్థితికి ప్రైవేటు పాఠశాలలు వచ్చాయి. అమ్మఒడి పధకం ద్వారా లక్షలాదిమంది విద్యార్థులకు మేలు జరుగుతుందని, తల్లిదండ్రులు పిల్లల చదువులకు వెచ్చించే ఆర్ధిక భారం తగ్గుతుందని అయితే సొమ్ములు అకడమిక్ ఇయర్ ఆరంభంలోనే ఇస్తే మేలు చేకూరుతుందని పలువురు భావిస్తున్నారు.
0 Response to "The distress of fees to private schools through the Amma Ammo scheme"
Post a Comment