Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Revolutionary Cuban humanity

విప్లవ క్యూబా మానవత్వం
Revolutionary Cuban humanity

✳️ప్రపంచంలో అన్ని దేశాలూ తమ ఆరోగ్య వ్యవస్థలను ఏవిధంగా చక్కదిద్దుకుంటే కోవిడ్‌-19 సవాలును ఎదుర్కోగలుగుతాం అన్న అంశంపై దృష్టి సారిస్తున్నాయి. ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న మహమ్మారి ప్రతాపం అలాంటిది. కాని ఒక్క దేశం మాత్రం ఈ కోవిడ్‌-19 మీద ఎదురు దాడి చేస్తోంది. అదే సోషలిస్టు క్యూబా.

✳️ గత 56 సంవత్సరాలుగా అమెరికా, దాని తైనాతీ దేశాలు క్యూబాను వెలివేశాయి. అమానవీయమైన ఆంక్షలు విధించాయి. ప్రపంచంలో పలు దేశాలు ఈ ఆంక్షలను ఖండించినా అమెరికా ఖాతరు చేయలేదు. ఐరాస తీర్మానాలనన్నింటినీ బుట్ట దాఖలు చేసింది. ఈ రోజు పరిస్థితి తిరగబడింది. కోవిడ్‌-19 ధాటికి అమెరికా విలవిలలాడుతోంది.

✳️ కాని క్యూబా మాత్రం ఈ మహమ్మారిని నిరోధించే యుద్ధాన్ని అంతర్జాతీయం చేసింది. కోవిడ్‌-19ని అరికట్టడానికి 'క్యూబా సాల్వా' అనే హ్యాష్‌టాగ్‌తో ఒక కార్యక్రమం చేపట్టింది. 'సాల్వా' అంటే స్పానిష్‌ భాషలో విముక్తి అని అర్థం. కోవిడ్‌-19 నుంచి విముక్తి కలిగించడానికి క్యూబా చేపట్టిన ఆపరేషన్‌ పేరు 'క్యూబా సాల్వా'. ఈ 'క్యూబా సాల్వా' ఏ దేశంలో ఏవిధంగా తోడ్పాటు అందిస్తోందో చూద్దాం.

✳️ వెనిజులా : మార్చి 16న వెనిజులా ప్రభుత్వపు అభ్యర్థన మేరకు ఒక వైద్యుల బృందం వెనిజులా చేరుకుంది. ఈ వ్యాధిని వ్యాపించకుండా అరికట్టే చర్యలపై క్యూబన్‌ నిపుణులు సలహాలు అందించారు. 136 మందితో కూడిన మెడికల్‌ బ్రిగేడ్‌ క్యూబా నుంచి వచ్చి... నివాస ప్రాంతాల్లో ఈ వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలను చేపట్టింది.

✳️ నికరాగ్వా : ఆ దేశ ఉపాధ్యక్షుడు రొజారియో మరిల్లో నికరాగ్వా ప్రభుత్వంతో సహకరించడానికి క్యూబన్‌ ప్రభుత్వం సంసిద్ధతను వ్యక్తం చేసిందని ప్రకటించారు. ఆ మేరకు మార్చి 18న క్యూబా నుండి అయిదుగురు నిపుణుల బృందం నికరాగ్వా చేరుకుని పని ప్రారంభించింది.

✳️ సురినాం : డిసెంబరు 2019లో క్యూబా, సురినాం దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడి 40 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా వేడుకలు జరుపుకున్నారు. ఆ వేడుకల మధ్యనే కోవిడ్‌-19ని ఎదుర్కొనేందుకు అంగీకారం కూడా కుదుర్చుకున్నారు. ఆ అంగీకారం మేరకు మార్చి 20న 51 మంది క్యూబన్‌ బృందం సురినాం దేశానికి చేరుకుని అక్కడ తమ పోరును ఆరంభించాయి. 'హెన్రీ రీవ్‌ ఇంటర్నేషనల్‌ కంటింజెంట్‌' అన్నది ఆ బృందం పేరు.

✳️ గ్రెనడా : క్యూబన్‌ మహిళల ధైర్యానికి, సాహసానికి ప్రతీకలుగా నిలిచిన ఇంటెన్సివ్‌ కేర్‌ నర్సుల బృందం మార్చి 20న గ్రెనడా చేరింది. వ్యాధిగ్రస్తులకు ధైర్యం చెప్పి వారు కోలుకునేందుకు ఈ బృందం తన సేవలు ప్రారంభించింది.

✳️ జమైకా : 'హెన్రీ రీవ్‌ కంటింజెంట్‌' బృంద సభ్యులు సుమారు 140 మంది మార్చి 21న జమైకాకు పయనమయ్యారు. జమైకన్‌ ప్రజలు వారిని స్వాగతించి ధన్యవాదాలు తెలిపారు.

✳️ ఇటలీ : యూరప్‌ ఖండం యావత్తు కోవిడ్‌-19 ప్రభావంలో చిక్కుకుపోయింది. అయితే ప్రత్యేకించి ఇటలీలో పరిస్థితులు అల్లకల్లోలంగా వున్నాయి. ఈ అంటువ్యాధి ప్రధానంగా ఎక్కువ దెబ్బతీసిన ప్రాంతం లొంబార్డీ. ఇక్కడే ప్రతిరోజూ అత్యధిక సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఇక్కడ ప్రజారోగ్య వ్యవస్థ మొత్తం కుప్పకూలింది. వైద్య రంగంలోని ఉద్యోగులు ఇక పని చేయలేక అశక్తులై చేతులెత్తేశారు. ఇక్కడికి 'హెన్రీ రీవ్‌ ఇంటర్నేషనల్‌ కంటింజెంట్‌' నుంచి 52 మంది డాక్టర్లు, నర్సులు మార్చి 22న చేరుకుని క్యూబన్‌ అసాధారణ మానవత్వ స్పందనను చాటారు.

✳️ప్రస్తుతం క్యూబా వైద్య సేవల రంగంలో 59 దేశాలతో ఒడంబడికలు చేసుకుని సహకారం అందిస్తోంది. వీటిలో 30 దేశాలు ఇప్పుడు కోవిడ్‌-19 ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ అన్ని దేశాల్లోనూ క్యూబన్‌ వైద్య బృందాలు ఆ మహమ్మారిని అరికట్టే పోరాటంలో నిమగమై ఉన్నాయి. వైద్య వృత్తిలో నైపుణ్యం, తమ గురుతర బాధ్యతల పట్ల సంపూర్ణమైన అంకిత భావం-ఈ రెండే ఈ వైద్య బృందాలకున్న ఆయుధాలు.

✳️మరికొన్ని దేశాలు సైతం క్యూబా నుండి సహకారాన్ని అర్థిస్తున్నాయి. అయితే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా క్యూబాలో ఉన్న సోషలిస్టు వ్యవస్థ పట్ల గుడ్డి ద్వేషంతో వ్యవహరిస్తున్న దేశాలు కూడా ఉన్నాయి. సహాయం అందించేందుకు క్యూబా సంసిద్ధతను వ్యక్తం చేసినా, దానిని తిరస్కరిస్తున్నాయి. నయా ఉదారవాద సిద్ధాంతం ఆ దేశాల ప్రభుత్వాల కళ్లను కమ్మేసింది.

✳️అమెరికా నుండి ఒక క్రూయిజ్‌ నౌక 'ఎం.ఎస్‌.బ్రేమర్‌'ను క్యూబా రేవులోకి అనుమతించేందుకు క్యూబన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని తెలియజేస్తూ చేసిన ప్రకటనలో 'ప్రస్తుత పరిస్థితులలో అంతర్జాతీయ సౌహార్ద్రత అత్యవసరం. ఆరోగ్యం ఒక మానవ హక్కుగా మనం గుర్తించాలి. దీనిని పరిరక్షించేందుకు అంతర్జాతీయ సహకారాన్ని మరింతగా పెంచుకోవాలి. క్యూబా విప్లవం ఈ మానవ విలువల పరిరక్షణను ప్రాణపదంగా కాపాడుతుంది' అని పేర్కొన్నారు.

✳️క్యూబా ప్రభుత్వపు ఆరోగ్య శాఖ అధికారులు ప్రస్తుత విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి అదనంగా వైద్య బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. బెలిజ్‌, ఆంటిగ్వా, బార్బుడా, సెయింట్‌ విన్సెంట్‌, డొమినికా, గ్రెన్‌డైన్స్‌ దేశాలకు కూడా వైద్య బృందాలను పంపుతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే 25 మందితో ఒక వైద్య బృందం బ్రెజిల్ కు బయలుదేరింది.

✳️సియొర్రాలియోనేలో ఎబోలా వైరస్‌ తాకిడిని ఎదుర్కొన్న బృందంలో సభ్యుడైన ఓర్లాండో బొరెరో అనే నర్సు 'ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని మాకు తెలుసు. అయినా మేం శాయశక్తులా ప్రాణాలు కాపాడేందుకు కృషి చేస్తాం' అని చెప్పారు. మరో 33 మందితో కూడిన అదనపు దళం త్వరలో బెలిజ్‌కు చేరబోతోంది.

✳️అయితే అమెరికన్‌ ప్రభుత్వానికి మాత్రం ఇదంతా కంటగింపుగా ఉంది. క్యూబా ప్రదర్శిస్తున్న అంతర్జాతీయ సౌహార్ద్రతను వాళ్లు జీర్ణించుకోలేక పోతున్నారు. 'ఈ విధంగా క్యూబా చేస్తున్న సాయం వెనక ఆర్థిక ప్రయోజనాలే ముఖ్య కారణం. వాళ్లు పోగొట్టుకున్నదంతా ఈ సేవల పేరుతో తిరిగి రాబట్టుకుందామని క్యూబన్లు ప్రయత్నిస్తున్నారు. ఈ సహాయాన్ని పొందుతున్న దేశాలు తాము క్యూబాతో చేసుకున్న ఒప్పందాలను క్షుణ్ణంగా పరిశీలించి కార్మిక హక్కులు ఏమైనా ఉల్లంఘించబడుతున్నాయోమో చూడాలి' అని అమెరికన్‌ మానవ హక్కుల, కార్మిక సంక్షేమ వ్యవహారాల బ్యూరో ట్వీట్‌ చేసింది!

✳️ఇలాంటి కారుకూతల్ని లెక్క చేయకుండా క్యూబా ముందుకు సాగుతోంది. అర్జెంటీనాలోని బ్యూనస్‌ ఎయిర్స్‌ రాష్ట్రానికి 500 మందితో కూడిన క్యూబన్‌ వైద్య బృందం బయలుదేరింది. వీరిలో ఎక్కువమంది ఎమర్జెన్సీ వైద్య సేవలను అందించడంలో సిద్ధ హస్తులు. కతార్‌, అల్జీరియా, చైనా, దక్షిణ ఆఫ్రికా, కువాయిల్‌ దేశాల్లో కూడా క్యూబన్‌ మెడికల్‌ బ్రిగేడ్లు పని చేస్తున్నాయి. ఈ దేశాల్లో ప్రజల మధ్య వైరస్‌ వ్యాప్తి ఎక్కువగానే వుంది.

✳️కతార్‌లో 499 మంది క్యూబన్‌ బృందం డా||ఎర్నెస్టా లోపెజ్‌క్రుజ్‌ నాయకత్వంలో ఏకంగా ఒక పూర్తి ఆసుపత్రినే నిర్వహిస్తున్నారు. గ్వాటిమాలాలో వైద్య సేవలు అందించేందుకు వెళ్లిన బృందం తమ వెంట మెడికల్‌ కిట్లు, మాస్క్‌లతో సహా రక్షణ పరికరాలు సైతం వెంట తీసుకుపోయింది.

✳️మొత్తంగా 61 మెడికల్‌ బ్రిగేడ్లు 28,268 మంది వైద్య బృంద సభ్యులతో ఇతర దేశాలలో వైద్య సేవలందిస్తూ అపూర్వమైన రీతిలో కోవిడ్‌-19పై పోరాటాన్ని సాగిస్తున్నాయి. కేవలం ఒక కోటి మంది జనాభా మాత్రమే ఉన్న దేశం ఇంత గొప్ప సహాయం ఎలా చేయగలుగుతోందని ప్రశ్నించుకుంటే సోషలిజం విశిష్టత ఏమిటో బోధపడుతుంది.

✳️సోషలిజం పని అయిపోయిందనుకునే ఉష్ట్ర పక్షులు ఈ మహోన్నతమైన ఆదర్శాన్ని అర్థం చేసుకోగలరా?
( 'గ్రాన్మా' ఆధారంగా)

- లైడిస్‌ మారియా

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Revolutionary Cuban humanity"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0