An all-party meeting that ended
ముగిసిన అఖిలపక్షం సమావేశం
న్యూఢిల్లీ : గాల్వాన్ సరిహద్దులో భారత, చైనా జవాన్ల మధ్య ఘర్షణ జరిగి నేపథ్యంలో మోదీ శుక్రవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ రాజకీయ పక్షాల నేతలు హాజరయ్యారు. దాదాపు అందరూ కూడా తాము ప్రధాని మోదీ వెంటే ఉంటామని, మేమంతా ఐక్యంగానే ఉన్నామన్న సందేశాన్ని పంపించారు. వివిధ రాజకీయ పక్షాల అభిప్రాయాలు.....
రాజ్‌నాథ్ సింగ్ (రక్షణ మంత్రి)
భారత్, చైనా సరిహద్దులో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా... ఎదుర్కొనేందుకు భారత సైన్యం సర్వసన్నద్ధంగానే ఉందని రక్షణ మంత్రి అఖిల పక్షానికి హామీ ఇచ్చారు. ఘర్షణాత్మక వాతావరణానికి ముందు, తర్వాత ఏం చర్యలు తీసుకున్నామో ఆయన అఖిలపక్ష నేతలకు వివరించారు.
సోనియా గాంధీ (కాంగ్రెస్)
చైనా బలగాలు వాస్తవాధీన రేఖను దాటి భారత్‌లోకి చొరబడిన రోజే అఖిలపక్ష సమావేశం పెట్టి ఉండాల్సిందని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ అన్నారు. అసలు చైనా బలగాలు ఏ రోజు ఎల్‌ఏసీ దాటాయో కేంద్రం చెప్పాలన్నారు. చైనా చొరబాట్లపై నిఘావర్గాల ద్వారా సమాచారం అందలేదా అని ఆమె కేంద్రాన్ని ప్రశ్నించారు. జూన్ ఆరునే చైనా నాయకత్వంతో చర్చలు జరిపి ఉండాల్సిందని సోనియా అభిప్రాయపడ్డారు. సైనికుల వీరమరణంపై ఆమె విచారం వ్యక్తం చేశారు. వాస్తవాధీన రేఖ పరిణామాలపై కేంద్రం దేశానికి విశ్వాసం కల్పించాలని సోనియా సూచించారు.
మమతా బెనర్జీ (టీఎంసీ)
జింగ్‌పింగ్ నేతృత్వంలోని చైనాపై బెంగాల్ ముఖ్యమంత్రి తీవ్రంగా మండిపడ్డారు. చైనా ప్రజాస్వామ్య దేశం కాదని, అక్కడ పూర్తి నియంతృత్వమే రాజ్యమేలుతోందని తీవ్రంగా ధ్వజమెత్తారు. భారత్, చైనా మధ్య తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులను నేపథ్యంలో ప్రధాని మోదీ అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ''చైనా ప్రజాస్వామ్య దేశం కాదు. పూర్తి నియంతృత్వ దేశం. వారి మనసులో ఏదుంటే అదే చేస్తారు. మరోవైపు మనం కలిసి పనిచేయాలి. భారత్ గెలుస్తుంది. చైనా ఓడిపోతుంది. ఐకమత్యంగానే మాట్లాడదాం. ఐకమత్యంగా ఉందా. ఐకమత్యంగా పనిచేద్దాం. మేము ప్రభుత్వం వెంటే ఉంటాం'' అని మమత బెనర్జీ స్పష్టం చేసినట్లు సమాచారం.
సుఖ్‌బీర్ సింగ్ బాదల్ (అకాలీదళ్)
ఇంతటి క్లిష్ట సమయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం సరైన విధానం కాదు.దేశం మొత్తం మోదీతోనే ఉంది. దేశం మొత్తం మోదీతోనే ఉందన్న సందేశాన్ని చైనాకు పంపాలి'' అని పేర్కొన్నారు.
ఉద్ధవ్ థాకరే (శివసేన)
'మనమంతా ఒక్కటే... ఇదే మా భావన. మేం మీ వెంటే... మనమంతా ఆర్మీవెంటే. వారి కుటుంబ సభ్యులతోనే ఉన్నాం. భారత్ శాంతినే కోరుకుంటోంది. అలా అని చేతకాని తనం అని అనుకోవద్దు. చైనా స్వభావమే ద్రోహ స్వభావం. ఇండియా అంటే 'మజ్‌బూత్'. 'మజ్‌బూర్' ఎంత మాత్రమూ కాదు. మన ప్రభుత్వం అత్యంత సమర్థవంతమైంది''.
రాం గోపాల్ యాదవ్ (సమాజ్‌వాదీ)
దేశమంతా ఒక్కటే. పాక్, చైనా ప్రవర్తన బాగోలేదు. భారత్ చైనా డంపింగ్ యార్డ్ కాదు. చైనీస్ వస్తువులపై 300 శాతం సుంకం విధించండి.''
నితీశ్ కుమార్ (జేడీయూ)
ఇతర దేశాల విషయంలో మాత్రం మనం అనైక్యంగా ఉండొద్దు. భారత్‌పై చైనా వైఖరేంటో అందరికీ తెలిసిందే. చైనాకు గౌరవమివ్వాలనే అనుకున్నాం. కానీ 1962 లో ఏం చేసింది? చైనా వస్తువులు భారత్ మార్కెట్‌లో పేరుకుపుపోయాయి. ఇదే పెద్ద సమస్య. అన్నీ ప్లాస్టిక్‌వే. పర్యావరణ హితంగా ఉండవు. వాటితో సంబంధం ఉన్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలూ అధికమే. అవి ఎక్కువ కాలం పాటూ ఉండవు. మనమందరమూ కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉండాల్సిందే''.
0 Response to "An all-party meeting that ended"
Post a Comment