An Expanding Virus for Government Teachers
బడులు ఎంత భద్రం..?
ప్రభుత్వ టీచర్లకు విస్తరిస్తున్న వైరస్
రామకుప్పంలో తొలికేసు నమోదు
ఉపాధ్యాయులలో ఆందోళన
ప్రభుత్వ టీచర్లకు విస్తరిస్తున్న వైరస్
రామకుప్పంలో తొలికేసు నమోదు
ఉపాధ్యాయులలో ఆందోళన
కుప్పం: ‘ఇంటికంటే గుడి పదిలం.. గుడికంటే బడి పదిలం’ అన్నది ఆర్యోక్తి. అటువంటి బడులిప్పుడు కరోనా వైరస్ వ్యాప్తికి కేంద్రాలుగా మారుతున్నాయి. జిల్లాలోనే తొలిసారిగా రామకుప్పం మండలంలో ఒక ప్రభుత్వ టీచర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో బడులకు వెళ్లాలంటేనే ఉపాధ్యాయ వర్గం వొణికిపోతోంది. ప్రాణ భయంతో ఆయా గ్రామాలు సైతం వారిని అంటరాని వారిగా చూసే దురదృష్టకర పరిస్థితులు దాపురించాయి. ఇటువంటి విషమ పరిస్థితుల్లో ప్రతి టీచరూ పది మంది విద్యార్థులను పాఠశాలలో చేర్పించాలని, అది కూడా వచ్చే నెల 15 లోగా జరిగిపోవాలని జిల్లా విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వులపట్ల ఉపాధ్యాయ యూనియన్లు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి.
రామకుప్పం మండలం వీర్నమల తాండా పంచాయతీ నీళ్లచేనులో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీనికి సమీపంలోని ఓ గ్రామంలో ప్రాథమిక పాఠశాల మహిళా టీచరుకు శుక్రవారమే కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు ధ్రువీకరించారు.తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు లోని అత్తవారింటికి లాక్‌డౌన్ కాలంలో వెళ్లిన ఆ టీచర్, ఈనెల 25న భర్తతో పాఠశాలకు విధులకు హాజరయ్యేందుకు వచ్చారు. కరోనా భయంతో గ్రామస్థులు ప్రతిఘటించడంతో కుప్పం ఏరియా ప్రభుత్వాస్పత్రిలో శ్వాబ్ ఇచ్చి తిరవళ్లూరు వెళ్లిపోయారు. కరోనా పరీక్షలో ఆమెకు పాజిటివ్ అని తేలింది. అదే పాఠశాలలోనే కార్వేటినగరానికి చెందిన ఓ టీచర్ పనిచేస్తున్నా, అక్కడ రెడ్‌జోన్ కావడంతో పాఠశాలకు రాకుండా ముందస్తు అనుమతి తీసుకు న్నారు. అదే గ్రామంలో ఉంటున్న మరో టీచర్, కరోనా నిర్ధారణ అయిన టీచర్ వచ్చే సమయానికి రాలేదు. ఒకవేళ వారిద్దరూ అదే సమయంలో పాఠశాలకు హాజరై, ప్రభుత్వం అనివార్యం చేసిన బయోమెట్రిక్ హాజరు వేసి ఉంటే పరిస్థితి ఏమిటి? అన్న ప్రశ్న ఇప్పుడు ఉపాధ్యాయ వర్గాల్లో భయం పుట్టిస్తోంది.
ఉపాధ్యాయ వర్గాల వ్యతిరేకత
కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో జిల్లాలోని ఇతర ప్రాంతాలు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చే టీచర్ల సంఖ్య అధికం. వీరిని గ్రామాల్లోకే స్థానికులు రానీయడంలేదు. వారి కోణంలో చూస్తే, ఒకరకంగా అది కరెక్టేనని, రామకుప్పంలో కరోనా నిర్ధారణ అయిన మహిళా టీచర్ ఉదంతం నిరూపించింది కూడా. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి ప్రభుత్వ టీచరూ పది మంది విద్యార్థులను బడిలో చేర్పించాలని, అదీ జూలై 15వ తేదీలోగా పూర్తి చేయాలని జిల్లా విద్యాశాఖ ఈనెల 27న జారీ చేసిన ఆదేశాలపట్ల ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కరోనా భయంతో తమను బడుల్లోకే అనుమతించనపుడు, ఇక, గ్రామాల్లోకి, ఇళ్లల్లోకి ఎవరు రానిస్తారని టీచర్లు వాపోతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు, పథకాల గురించి ఎలా అవగాహన కల్పించగలమన్నది వారి ప్రశ్న.
ఇప్పుడు ఇదేంటి సారూ..
యూడైస్, ఎస్సార్ వంటి వివరాలను, సెమిస్టర్ మార్కులు, విద్యార్థుల ప్రమోషన్ జాబితా వంటివి ఆయా వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేసేశాక, పాఠశాలలకు హాజరునుంచి మినహాయిస్తామని తొలుత యూనియన్ల ద్వారా విద్యాశాఖ ఉన్నతాధికారులు హామీ ఇచ్చారని అంటున్నారు. ఇప్పుడేమో విద్యార్థుల నమోదు పేరుతో సరికొత్త బాధ్యత తలకెత్తారని, ఇది దారుణమని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో తమకు కరోనా వ్యాపిస్తే, బాధ్యత ఎవరు వహించాలని ఉపాధ్యాయ యూనియన్లు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి.®️
0 Response to "An Expanding Virus for Government Teachers"
Post a Comment