Inspection
భర్త వదిలేసాడు..కన్నవాళ్ళు కాదుపొమ్మన్నారు, ఒళ్ళొ చంటి బిడ్డను పెట్టుకుని కాలంతో పొటిగా నిలిచిన ఆమె త్వరలో ఎస్సైగా భాధ్యతలు స్వీకరించబోతోంది. ఎంతోమందిలొ స్పూర్తి నింపే స్టోరి
మహాలక్ష్మి! త్వరలో ఎస్సైగా బాధ్యతలు చేపట్టబోతోంది. మహిళలకు న్యాయం చేయడమే తన లక్ష్యం అంటోంది. దానికి కారణం ఉంది. కొన్నాళ్లక్రితం ఆమెను... భర్త వదిలేశాడు. ఒళ్లో చంటిపిల్లాడు. పుట్టింటికెళ్తే... వాళ్లూ పట్టించుకోలేదు. ఖాళీ కడుపుతో... మనసునిండా బాధతో ఏడుపు తప్ప ఏమీ మిగల్లేదు. ఆ పరిస్థితుల్లో ఆమె చావును కాకుండా ఓ లక్ష్యాన్ని ఆశ్రయించింది. అలా ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సై శిక్షణను విజయవంతంగా పూర్తిచేసి... ఆత్మవిశ్వాసంతో తన జీవితాన్ని మళ్లీ మొదలు పెట్టబోతోంది.
‘యుద్ధం తప్పదనుకున్నప్పుడు అరచేయి కూడా ఆయుధమే అవుతుంది’ అని నమ్ముతా. ఒకప్పుడు నా చదువెందుకూ పనికిరాదన్నవారే ఇప్పుడు నువ్వు గ్రేట్ అంటున్నారు. నేను ఇప్పుడు అందుకుంటోన్న ప్రశంసల కన్నా అప్పుడు విన్న విమర్శల్నే గుర్తుపెట్టుకున్నా. ప్రతి విమర్శను నా లక్ష్యానికి జతచేసుకున్నా. అందుకే ఎస్సై కాగలిగానేమో. నా బతుకు పోరాటంలో ఎన్నో మలుపులు. ప్రతి సంఘటనా నాలో నిబ్బరాన్ని పెంచింది. జీవితంలో కొత్త లక్ష్యాలు ఏర్పరుచుకునేలా చేసింది. గెలుపు రుచి చూపించింది. అలాగని నేను చిన్నప్పుడు ఎస్సై కావాలనుకోలేదు. మా ఇంట్లో ఆడపిల్లలు ఎవరూ పోలీసు రంగంలోనే లేరు. కేవలం నాకు ఎదురైన పరిస్థితులే నన్ను పోలీసును చేశాయి.
మాది తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలంలోని చిన్నగూళ్లపాలెం. పదోతరగతి వరకూ సాంఘిక సంక్షేమ వసతి గృహంలో చదువుకున్నా.డిగ్రీ రాజమండ్రిలో, మైక్రోబయాలజీలో పీజీ వైజాగ్‌లో పూర్తి చేశా. ఉద్యోగం చేయాలనుకున్నా. ఆ ప్రయత్నాల్లో ఉన్నప్పుడే ‘ఇక అవన్నీ వద్దు. మంచి సంబంధం’ అంటూ పెళ్లి చేశారు. అందరు అమ్మాయిల్లానే నేనూ కోటి కలలతో అత్తారింట్లో అడుగుపెట్టా. మా వారు పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగి. డిప్యుటేషన్ మీద దిల్లీ, అసోం వంటి ప్రాంతాలకు తిరిగే వాళ్లం. ఉద్యోగం చేస్తానంటే... ‘నీదీ ఓ చదువేనా. మా వాడు చేస్తున్న ఉద్యోగానికి ఇంతకంటే మంచి కట్నం వచ్చేది’ అంటూ వెక్కిరించేవారు అత్తింటివారు.అన్నింటినీ భరిస్తోన్న సమయంలోనే పిల్లాడు కడుపులో పడ్డాడు. చివరకు పెళ్లయిన నాలుగేళ్లకే విడిపోవాల్సి వచ్చింది. బాబుని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయా.
భవిష్యత్తు అర్థంకాలేదు. ఎన్ని రాత్రులు ఏడ్చానో కూడా గుర్తులేదు. అన్నయ్యలూ, అమ్మానాన్నలే ప్రపంచం అనుకున్నా. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ వారి బాధ్యతల్ని నెత్తిన వేసుకున్నా.ఆర్థిక విషయాల్లో గొడవలు వచ్చాయి. పిల్లాడి భవిష్యత్తు అర్థంకాలేదు. ఇంట్లోవాళ్లు సాయం చేయకపోగా నానామాటలన్నారు. సొంతవాళ్లే ఇలా చేసేసరికి కుంగిపోయా.సాయంకోసం చాలా మందినే అర్ధించా. అంతా ‘నీ సొంతవాళ్లే కదా!’ అన్నారే తప్ప ఎవరూ మా విషయాల్లో కల్పించుకోలేదు.
చివరకు కట్టుబట్టలతో ఇంటి నుంచి బయటికి వచ్చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. న్యాయం చేయాల్సిన పెద్దలూ, పోలీసులూ... చూస్తూ ఉండిపోయారు. నాకేమో ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు. మా మేనత్త పెద్ద కొడుకు, కోడలు అంటే బావసాయి ప్రసాద్, అక్క శ్రీదేవి ఆశ్రయమిచ్చారు. కోర్టులో కేసు వేద్దాం అనిపించింది కానీ పోరాటాలు చేస్తూ పోతే... పిల్లాడి పరిస్థితి ఏమవుతుందని అనిపించింది. సరిగ్గా నిద్ర ఉండేది కాదు. ఆ సమయంలో అక్కా, బావా ‘ఇప్పుడు ఆస్తికోసం నువ్వు పోరాటం చేయడం కన్నా... నీ కాళ్లమీద నువ్వు నిలబడటం ముఖ్యం..’ అని పదేపదే చెప్పేవారు. నాకూ నిజమేనని అనిపించింది. నా అదృష్టమో ఏమో తెలియదు కానీ ఆ సమయంలో కానిస్టేబుల్, ఎస్సై నోటిఫికేషన్ పడింది. నా వయసుపరంగా చూస్తే నాకు అదే చివరి అవకాశం. పోలీసు ఉద్యోగానికి ప్రయత్నించాలనుకుంటున్నా అని అక్కా, బావలకి చెప్పా. మొదట షాక్ అయ్యారు. ‘ఆడపిల్లవు. కష్టపడలేవేమో. నీకు నమ్మకం ఉంటే ప్రయత్నించు...’ అని చెప్పారు. నిజానికి నేను కూడా మొదట బ్యాంకు ఉద్యోగాలకు వెళ్లాలనుకున్నా. కానీ ఆలోచిస్తే చదువుకున్న అమ్మాయినైన నాకే ఎక్కడా న్యాయం జరగలేదు. మరి ఏ చదువూలేని ఆడపిల్లల పరిస్థితి ఏంటీ అని అనిపించింది. అందుకే దీన్నే ఎంచుకోవాలనకున్నా. నా కాళ్లమీద నేను నిలబడటమే కాదు నలుగురికీ న్యాయం చేయగలను అనే ఆలోచనతోనే ముందడుగు వేశా.
ఆలోచించిందే తడవుగా కర్నూలు వెళ్లి కోచింగ్‌లో చేరిపోయా. రోజూ నా స్థాయికి మించి కష్టపడేదాన్ని. రాత పరీక్షల్లో నాకు పెద్దగా సమస్యలు లేకపోయినా ఓ బిడ్డ తల్లిగా నా శారీరక సామర్థ్యం తగ్గుతుంది కదా. దాంతో అందరికంటే కాస్త ఎక్కువే కష్టపడాల్సి వచ్చింది. ఈలోగా కానిస్టేబుల్ పరీక్ష పూర్తయ్యింది. కానీ నేను ఎంపిక కాలేకపోయా. అది తెలిసి అంతా ‘ఆడపిల్లకు ఇవన్నీ ఎందుకు...’, ‘ నీ వల్ల కాదు...’ అని నేరుగా నాతోనే అన్నారు. ఆ క్షణంలో వాళ్ల మాటలు బాధ అనిపించినా సరే! ఎక్కడా నిరుత్సాహం, నిరాశను దరిచేరనివ్వలేదు. కర్నూల్‌లో కానిస్టేబుల్ సుంకయ్యగారనీ ఉండేవారు. ఆయనా, నా కోచ్ బ్రహ్మం గారు నా పట్టుదల చూసి నాకెంతో సాయం చేశారు. రోజూ ఉదయాన్నే ఆరుకిలోమీటర్లు ఆపకుండా పరుగెత్తించేవారు. అలా ఎనిమిది రౌండ్లు పూర్తిచేసేదాన్ని. నా కష్టం చూసి అక్క బాధపడి ఓ తల్లిలా నా దగ్గరకు వచ్చింది. పరుగెత్తడం అలవాటు లేదు కదా... అందుకే మొదట్లో తరచూ జ్వరం వచ్చేసేది. ఓ అథ్లెట్ ప్రాక్టీస్ చేస్తుంటే ఆమెతో పాటు నేనూ పరుగెత్తేదాన్ని. ఎన్నో మెలకువలూ తెలుసుకునేదాన్ని. అలా రోజులో కనీసం పద్నాలుగు గంటల పాటు కష్టపడేదాన్ని. రోజు రోజుకీ పరుగులో మెరుగు అయ్యాను. శారీరక సామర్థ్యం అందుకున్నా. చివరికి తొమ్మిది నిమిషాల పది సెకన్లలో పూర్తి చేయగలిగాను. ఆ సమయంలో పిల్లాడిని అక్కే చూసుకుంది. అలా పన్నెండు నెలలపాటు అనంతపురంలో ఎస్సై శిక్షణను పూర్తిచేయగలిగా. త్వరలో ఉద్యోగంలో చేరబోతున్నా. ఇప్పుడు నా ముందున్న లక్ష్యం ఒకటే. మా వాడికి ఇప్పుడు పదేళ్లు. వాడిని బాగా చదివించి సివిల్ సర్వీసెస్ సాధించేలా చేయాలి* నేను ఎస్సై శిక్షణకు ఎంపికయ్యాక ఓ రోజు బండిపై వెళ్తుంటే కుక్క అడ్డం వచ్చింది. దాంతో నేను కిందపడిపోయా. కాలికి దెబ్బ తగిలింది. ఈలోగానే శిక్షణ మొదలవ్వడంతో వెళ్లక తప్పలేదు. మొదట్లో ఇరవై నిమిషాల్లోగా 3.2 కిలోమీటర్లు పరుగెత్తాల్సి ఉండేది. కానీ కాలు ఏ మాత్రం కదిపినా నొప్పి వచ్చేది. ఈ వంకతో నేను ఏ మినహాయింపునీ కోరుకోలేదు. ఓ సారి పరుగు పెట్టాక ఆగేదాన్ని కాదు. నా పరిస్థితి చూసి పరుగు అయిపోయిన వెంటనే ఫిజియోథెరపీకి పంపించేవారు. అలా నెమ్మదిగా నా మీద నేను నమ్మకం పెంచుకుంటూ వచ్చా.
అమ్మాయిలకూ, అబ్బాయిలకూ శిక్షణలో ఏ తేడా ఉండదు. పరుగూ, ఈత, డ్రైవింగ్, బీవోఏసీ శిక్షణలతో పాటు కంప్యూటర్ కూడా నేర్పుతారు. మొదట్లో కొన్నిసార్లు ఇబ్బందిపడినా ఎక్కడా ఆగలేదు. అన్నింటినీ అధిగమిస్తూనే వచ్చా.
* నా ఆశలన్నీ పిల్లాడి మీదే. మూడేళ్ల వరకూ వాడిని ఏ రోజూ వదిలిపెట్టింది లేదు. శిక్షణ కారణంగా వాడిని అక్క దగ్గరే వదిలిపెట్టా. ఏడాదిలో వాడిని చూసిన సందర్భాలు వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. ఇప్పుడు ఫోన్‌లు మాట్లాడే అవకాశం ఉండటంతో వాడితో మాట్లాడితే కానీ నా రోజు మొదలయ్యేది కాదు. ఎప్పుడైనా నేను బేలగా మారిపోయానని వాడికి అనిపిస్తే... వాడు నాకు ఓ నాన్నలా భరోసా ఇచ్చేవాడు..
0 Response to "Inspection"
Post a Comment