Arrangements in accordance with government guidelines
ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాట్లు
కరోనా కారణంగా ఈ విద్యాసంవత్సరం పాఠశాలల పునఃప్రారంభం ఇప్పటికే చాలా ఆలస్యమయ్యింది. విద్యార్థులకు ప్రత్యామ్నాయ విధానాల ద్వారా బోధన సాగిస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబరు 5 నుంచి పాఠశాలలను ప్రారంభిండానికి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రవేశాలు ప్రారంభించాలని విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసింది. విడుదల చేసిన ప్రత్యామ్నాయ క్యాలెండర్‌ను అనుసరించి ఈనెల 27 నుంచి సెప్టెంబరు 4వరకు ప్రవేశాలు చేపట్టడంతోపాటు ఉపాధ్యాయుల కార్యక్రమాలు, బోధన పద్ధతులు తదితర అంశాలపై మార్గదర్శకాలు విడుదల చేసింది. జిల్లా వ్యాప్తంగా ప్రవేశాల ప్రక్రియ ప్రారంభించారు.
విద్యార్థుల వారీగా ప్రణాళిక
ఎస్‌ఈఆర్టీ రూపొందించిన ప్రత్యామ్నాయ అకడమిక్ క్యాలెండర్ అమల్లో భాగంగా విద్యార్థులను మూడు విధాలుగా విభజించాలి. హైటెక్(ఆన్‌లైన్ సౌకర్యాలు ఉన్నవారు), లోటెక్(రేడియో, దూరదర్శన్ అందుబాటులో ఉన్నవారు), నోటెక్ (కంప్యూటర్, చరవాణి, రేడియో, దూరదర్శన్ లేనివారు) ఇలా మూడు విభాగాలుగా ఉపాధ్యాయులు ప్రణాళిక రూపొందించుకోవాలి. గ్రామ, పట్టణాల్లో వెనుకబడ్డ ప్రాంతాల్లో నివసిస్తున్న విద్యార్థుల్లో ఎక్కువమంది ఎలాంటి సమాచార, ప్రసార, కంప్యూటర్ సాధనాలు అందుబాటులో లేవన్న విషయాన్ని అధికారులు గుర్తించారు. అలాంటి వారిపైన ప్రత్యేకదృష్టి పెట్టేవిధంగా ఉపాధ్యాయులు ప్రణాళిక తయారు చేసుకోవాలి.
పాఠ్యప్రణాళిక ఇలా ఉండాలి
1 నుంచి 5తరగతుల వరకు విద్యార్థులు కనీస అభ్యసన సామర్థ్యాలు సాధించే విధంగా 12 వారాల పాటు కృత్యాలు చేయించాలి. దీనికి ఉపాధ్యాయులు కృత్యపత్రాలు తయారు చేసుకొని ఆ పత్రాలను విద్యార్థుల తల్లిదండ్రులకు అందించి వారిద్వారా విద్యార్థులు కృత్యాలు చేసే విధంగా పర్యవేక్షించాలి. 6 నుంచి 8 తరగతుల విద్యార్థులు కనీస అభ్యసన సామర్థ్యాలు సాధించే విధంగా క్యాలెండర్‌లో పేర్కొన్న మేరకు ప్రాజెక్టుల పనులను పిల్లలతో నిర్వహింపచేయాలి. వారు ఎలాంటి కృత్యాలు ఏవిధంగా చేపట్టాలో తల్లిదండ్రులకు వివరించాలి. 9, 10 తరగతుల వారికి పాఠ్యాంశాల వారీగా బోధించాలి. ఇందుకు నాలుగు వారాల ప్రత్యామ్నాయ క్యాలెండర్‌ను ఉపయోగించుకోవాలి. విద్యార్థులను ఆన్‌లైన్ రేడియో ద్వారా శిక్షణ అందించేలా చర్యలు తీసుకోవాలి.
పరీక్షలు నిర్వహించకూడదు
1 నుంచి 8 తరగతుల విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు నిర్వహించకూడదు. వారి అభ్యసన సామర్థ్యాలను సాధించారా లేదా అన్నది మాత్రం ఎప్పటికప్పుడు పరిశీలిస్తూమ ఉండాలి. 9,10 తరగతుల అరతర్గత మూల్యాంకనాన్ని నిర్వహించవచ్ఛు అవి పాఠశాల ప్రత్యామ్నాయ అకడమిక్ క్యాలెండర్‌కు సంబంధించినవి అయి ఉండాలి. విద్యాసంవత్సరం ఇంకా ప్రారంభం కాలేదు. సిలబస్ ప్రకారం పరీక్షలు నిర్వహించ కూడదు. అధికారిక ఉత్తర్వులు వచ్చేవరకు ఎక్కడైనా విద్యార్థులను పాఠశాలకు రప్పించడం, బోధన చేస్తున్నట్లు గానీ గుర్తిస్తే చట్టపర చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ఆన్‌లైన్ తరగతులకూ నిబంధనలు
ప్రస్తుతం దూరదర్శన్‌తో వివిధ మాధ్యమాల ద్వారా బోధన సాగిస్తున్నారు. దీనిపై కూడా ప్రభుత్వం రోజుకు ఎంత సమయం కేటాయించాలన్నది కూడా మార్గదర్శకాలు విడుదల చేసింది. పూర్వ ప్రాథమిక విద్యకు సంబంధించి కేవలం తల్లిదండ్రులకు మాత్రమే సూచనలు ఇవ్వడానికి ఆన్‌లైన్ వినియోగించాలి. అది కూడా రోజుకు 30 నిమిషాలు మాత్రమే ఉండాలి. 1 నుంచి 8 తరగతుల వరకు రోజుకు ప్రతిసెషన్‌కు 30 నుంచి 45 నిమిషాలు మాత్రమే వినియోగించాలి. రోజుకు రెండు సెషన్‌లు కన్నా ఎక్కువ ఉండకూడదు. 9,10 తరగతుల విద్యార్థులకు ప్రతి రోజూ సెషన్‌కు 30 నుంచి 45 నిమిషాలు మాత్రమే వినియోగించాలి. రోజుకు నాలుగు సెషన్‌ల కన్నా ఎక్కువ వినియోగించ కూడదు.
వలసకూలీల పిల్లలకు టీసీలు అవసరం లేదు
పాఠశాల ప్రవేశాలకు కూడా ప్రభుత్వం నిబంధనలు విధించింది. విద్యార్థులను పాఠశాలకు రప్పించకుండా కేవలం తల్లిదండ్రుల అంగీకారంతో ప్రవేశాల ప్రక్రియ నిర్వహించాలి. విద్యార్థులు ఇతర పాఠశాలల్లో చేరాలనుకుంటే వారి తల్లిదండ్రులను అడిగి ఆ మేరకు పిల్లలకు టీసీలతోపాటు తల్లిదండ్రుల అంగీకార పత్రాలను జతపర్చి ఆయా పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించాలి. వివిధ ప్రాంతాల నుంచి వలసకూలీలు తమ స్వస్థలాలకు చేరుకున్నారు. వారికి టీసీలతో పనిలేకుండా నేరుగా ప్రవేశాలు కల్పించాలని మార్గదర్శకాల్లో పొందుపరిచారు. ఇలా పాఠశాలల ప్రవేశానికి ప్రత్యేక చర్యలుతీసుకుంటున్నారు.
మార్గదర్శకాలకు అనుగుణంగా
ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పాఠశాల ప్రవేశాల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమయ్యింది. మార్గదర్శకాలను అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు అందజేశాం. ప్రత్యామ్నాయ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఉపాధ్యాయుడు ప్రతి రోజూ తల్లిదండ్రులకు ఫోన్‌చేసి వారి పిల్లలు చేపట్టాల్సిన విద్యాకార్యక్రమాల గురించి వివరించాలి. ఆ దిశగా కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. తల్లిదండ్రులు భాగస్వామ్యమై ప్రస్తుతం అమలవుతున్న అంశాలపై అవగాహన పెంచుకుని పిల్లలు పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
0 Response to "Arrangements in accordance with government guidelines"
Post a Comment