Gurram Jhashuvaa
మహాకవి గుర్రం జాషువా గారి జయంతి
"రాజు మరణించే నొక తార రాలిపోయే సుకవి మరణించే నొక తార గగన మెక్కె.
రాజు జీవించె రాతి విగ్రహములందు
సుకవి జీవించె ప్రజల నాలుకల యందు''అని ఫిరదౌసి కావ్యంలో కవి గురించి అధ్బుతంగా వ్రాసిన కవి జాషువ.జులై 24 మహాకవి జాషువా వర్థంతి.
19 వశతాబ్ధం చివరి దశలో సామాజిక ప్రయోజనం కోసం భావకవిత్వ రీతినుంచి పక్కకు జరిగి మూఢాచారాలతో తులతూగుతున్న ఆనాటి పెత్తందార్ల అధర్మాలకు అడ్డుకట్టగా నూతన ఒరవడితో తన రచనలు కొనసాగించారు గుర్రం జాషువా. ప్రజల్లో తన రచనల ద్వారా సామాజిక చైతన్యాన్ని రగిల్చారు.
కవి సామ్రాట్ జాషువా 1895 సెప్టెంబర్ 28న వీరయ్య, లింగమ్మ దంపతులకు జన్మించారు. తన తల్లిదండ్రులు వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో తన విద్యాబ్యాసంలో అనేక కష్టాలు, అవమానాలు, చీత్కారాలు ఎదుర్కొన్నారు.
జాషువా అనేక రచనలు రాశారు. కోకొల్లలుగా ఖండకావ్యాలు రాశారు. వాటిలో గబ్బిలం(1941), ఫిరదౌసి(1932), క్రీస్తు చరిత్ర అతి ముఖ్యమైనది. ఇదే కోవలో లఘుకావ్యాలు కూడా ఉన్నాయి.
ఫిరదౌసి కావ్య వృత్తాంతంలో వేదన పూరితం కనిపిస్తుంది. పర్షియ చక్రవర్తి గజిని మహ్మద్ ఆస్థానంలో కవి ఫిరదౌసి, అతని రాజు మాటకొక బహుమానం ఇస్తానని చెప్పగా, కవి పదేళ్లు శ్రమించి మహాకావ్యం రాస్తారు. చివరికి అసూయపరుల మాటలు విని రాజు ఇచ్చిన మాటను తప్పుతాడు. ఆవేదనతో ఆ కవి ఆత్మహత్య చేసుకుంటాడు. అక్కడ కవి హృదయాన్ని జాషువా స్వయంగా అనుభవించినట్లు రాశారు. కవి తనలోని ఆవేదనలు సమాజానికి తెలియపరచడమే జాషువా రచనల సారాంశంగా ఉంటాయనడానికి ఇది నిదర్శనం.
జాషువా సమాజంలోని హెచ్చుతగ్గులను వెతికి దానికి గల కారణాలను పరిశీలించి, అనేక కోణాల నుంచి ఆలోచించి తన కంఠంలోని ఆవేదనను కవిత్వ మార్గంగా ఎంచుకున్నారు. అదే జాషువా ''గబ్బిలం'' కావ్యానికి శ్రీకారం. దళితులకు జరుగుతున్న అన్యాయాలను ఎలుగెత్తి చాటడం కోసం జాషువా గబ్బిలం రాశారు.గబ్బిలం కావ్యం 'కాళిదాసు' మేఘసందేశం తరహాలో సాగుతుంది. అయితే గబ్బిలం కావ్యంలో సందేశాన్ని పంపేది యక్షుడు కాదు.. ఒక అంటరాని కులానికి చెందిన కథానాయకుడు తన గోడును సమాజానికి వినిపించడమే కథాంశం.
"నాదు కన్నిటి కథ సమన్వయము సేయనార్థ్ర హృదయంబు గూడ కొంతవసరంబు'' అని గబ్బిలం గురించి జాషువా వాపోయాడు.
ఉత్తమ జాతి పక్షులుగా పిలువబడే హంసలు, చిలుకలను పక్కకు తీసి సమాజంలోకి అతి వేగంగా దూసుకుపోయేలా 'గబ్బిలం' కవి కళ్లకు దళితంగానే కనిపించింది.
జాషువా రచనలు
అగ్రరాజ్యాధికారం తుదముట్టించే దిశలో కొనసాగాయి. దళితులకు తిండి బట్టలతో పాటు స్వేచ్ఛ జీవనం కూడా దుర్భేద్యంగా ఉండేది ఆనాటి కాలంలో
"కఠిన చిత్తుల దురాగములు ఖండించి
కనికార మొలకించు కులమునాది'' అందుకే
"నిమ్న జాతుల కన్నీటి నీరదములుపిడుగులై దేశమును కాల్చివేయు నని'' అని హెచ్చరించాడు.
గర్జించాడు.
శాసించాడు.
చతుర్వర్ణ వ్యవస్థను నిలదీస్తూ జాషువా విప్లవ మూర్తిగా సాక్షాత్కరించాడు. పంచమ కులం ఎక్కడుందని ఆవేదనకు గురయ్యాడు. ''ముసలి వాడైన
బ్రహ్మకు పుట్టినారు నలుగురు కుమారులనుట విన్నాను గాని
వసరమునకన్న హీనుడు భాగ్యుడు.. యైదవ కులస్థు డెవరమ్మా, సవిత్రి.?'' అంటూ తన పద్యాలను తెలుగు సాహిత్య చరిత్రలో దళిత సాహిత్యానికి మార్గదర్శకంగా రాశారు. బాబాలు, స్వాములపై హేతువాద రీతిలో రాసిన పద్యాలు చైతన్యవంతంగా కనిపిస్తాయి. అయితే కులం ద్వారా కలిగిన అవమానం, దారిద్య్రంతో జాషువా హృదయం ద్రవించింది.
"ఆ యభాగ్యుని రక్తంబు నాహరించి యినుప గజ్జెల తల్లి జీవనము సేయు గసరి బుసగొట్టు నాతని గాలిసోక నాల్గు పడగల హైందవ నాగరాజు''
అని హిందుత్వాన్ని తీవ్ర ధ్వనితో నిరసించాడు కవి.
"విశ్వనరుడను నేను నాగు తిరుగులేదు'' అని తన వీర కవిత్వాన్ని యావత్ ప్రపంచానికి ఒక చక్కని అక్షర పూలమాలలుగా అందించారు.
శ్మశానం గురించి అద్భుతమైన ఆయన వర్ణన చదవండి
"ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మనికలము,నిప్పులలోన గరిగిపోయే..యిచ్చోటనే భూములేలు రాజన్యుని యధికార ముద్రికలంతరించె!యిచ్చోటనే లేత ఇల్లాల నల్లసౌరు గంగలోన గలిసిపోయే."యిచ్చోటనే వెట్టి పేరెన్నికం గనుగొన్నచిత్రలేఖుని కుంచియ నశించిపోయే!"ఈ పద్యం తీవ్రమైన అనుభూతిని కలిగిస్తుంది. అందరూ సమానమనే తత్వాన్ని ఆయన ఇందులో భోదించారు
జాషువా గారు 36 గ్రంధాలు రాశారు. చాలా కవితా ఖండికలు రాశారు.పిల్లల గురించి గేయాలు రాసారు.
క్రీస్తుచరిత్ర రాసినందుకు కేంద్రసాహిత్యఅకాడమీ బహుమతి వచ్చింది. విద్మవిభూషణ్ బిరుదు ఇచ్చారు. తిరుపతి వెంకట కవులలో ఒకరైన చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి కి గండపెండేరం తొడిగి,కాళ్ళు కడిగి ఆ నీటిని తలపై జల్లుకొంటూ ..కంటి నిండా కన్నీరు ఒలుకుతుండగా "నా జన్మధన్యమైయ్యింది" అని గద్గత స్వరంతో అన్నారాయన. ఈమహాకవికి 1970 ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ, భారత ప్రభుత్వం పద్మభూషణ పురస్కారాలు అందించింది. అంతే కాక కవి కోకిల, కవి విశారద, కవి దిగ్గజ, నవయుగ కవిచక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్ బిరుదులు అందుకొన్నారు.
"మత పిచ్చిగాని, వర్ణోన్నతిగాని, స్వార్థ చింతనము గానీ నాకృతులందుండదు''అని జాషువా స్పష్ట పరిచారు.
ఎవరూ చూడని చీకటి కోణాలను చూడగల క్రాంతదర్శి కవి కోకిల జాషువా గారు. జాషువా కవిత్వంలో జాలి, దయ, కరుణలు కనిపిస్తాయి. నిజానికి జాషువా జీవితం నుండి అతని కవిత్వం వికసించింది. తన రచన ద్వారా అణగారిపోతున్న పేద సమాజాన్ని మార్చాలి అనుకున్నారు. ఆ కోవలోనే ప్రయత్నించారు. జాషువాలో, అతని రచనలలో కసి గానీ, ద్వేషం గానీ లేదు. కేవలం ప్రతిఘటన మాత్రమే.
"రేయి బవలు భారతీయ సంస్కృతి పేర..'' మరో పద్యంలో జాషువ స్పందన ఆలోచింప చేస్తుంది. ఆకాశవాణి లో వారి రచనలు ప్రసారమయ్యాయి. జాషువా గారి ఆలోచనలు, ఆరాటం, తపన అంతా సమాజ మార్పు కోసమే..
జాషువ కలాన్ని గళంగా మార్చి విశేష సాహిత్య సంపదను సృష్టించారు. ప్రజల్లో తన రచనల ద్వారా చైతన్యాన్ని రగిలించారు. సమాజంలో చెరగని ముద్ర జాషువా. వారి ఆశలు అకాంక్షలు, లక్ష్యాలు నేరవేర్చడమే మనం వారికిచ్చే నిజమైన నివాళి......
0 Response to "Gurram Jhashuvaa"
Post a Comment