Teachers Transfers
- ఇక టీచర్ల బదిలీలు
- ముందుగానేక్రమబద్ధీకరణ ప్రక్రియ
- వారంలోగా మార్గదర్శకాల విడుదల
- ఆర్థికశాఖ గ్రీన్‌సిగల్
- పరిశీలనలో ఉపాధ్యాయ సంఘాల సిఫార్సులు
రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలకు రంగం సిద్ధమైంది. బదిలీల నిర్వహణకు ముందుగానే టీచర్స్ క్రమబద్ధీకరణ ప్రక్రియను చేపట్టాలని సర్కార్ నిర్ణయించింది. విద్యా సంవత్సరం ఆరంభానికి ముందుగానే బదిలీలు, రేషనలైజేషన్ ప్రక్రియ చేపట్టాలన్న సీఎం వైఎస్ జగన్ నిర్ణయానికి ఆర్థికశాఖ గ్రీన్ సిగల్ ఇచ్చింది. రేషనలైజేషన్, బదిలీలపై గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్య కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు ప్రత్యేకంగా సమావేశమై సూచనలు, సలహాలు స్వీకరించారు. ఉపాధ్యాయ సంఘాల సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఇప్పటికే పరిశీలనను ప్రారంభించింది. సంఘాలు సూచించిన విధంగా రేషనలైజేషన్, బదిలీలు చేపట్టేందుకు వీలుగా రెండోసారి ఫైల్‌ను ఆర్థికశాఖకు విద్యాశాఖ పంపించినట్లు తెలిసింది. వారం రోజుల్లోగా బదిలీలు, రేషనలైజేషన్ నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో వెబ్ ఆధారంగా బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విధానం వల్ల కొంతమంది ఉపాధ్యాయులకు నష్టం జరిగే అవకాశం ఉన్నందున సాధారణ పద్ధతిలోనే (మాన్యువల్) బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. దీనిపై ప్రధాన ఉపాధ్యాయ సంఘాలతోపాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు సైతం విద్యాశాఖ అధికారులను కలసి విన్నవించారు. కొవిడ్ మార్గదర్శకాల ప్రకారం బదిలీల నిర్వహణకు ఉపాధ్యాయులు పూర్తిగా సహకరిస్తారని వారు ఉన్నతాధికారులకు తెలిపారు. రాష్ట్రంలో సింగిల్ టీచర్స్ ఉన్న స్కూళ్లకు రెండో పోస్టు మంజూరుకు ప్రభుత్వం సంసిద్ధతను తెలిపింది. విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి విషయంలో మాత్రం 1 : 30నే అనుసరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనివల్ల ప్రాథమిక పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్‌జీటీ) పోస్టులు రద్దయ్యే ప్రమాదం ఉందని ఉపాధ్యాయ సంఘాలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లాయి. అయితే, ఎక్కడా ఒక్క ఎస్‌జీటీ పోస్టు రద్దు కాకుండా చర్యలు చేపడతామని విద్యాశాఖ అధికారులు హామీ ఇచ్చారు. పాఠశాలలో 40 నుంచి 60 మంది విద్యార్థులుంటే మూడో పోస్టును మంజూరు చేయాలని సంఘాలు ఇప్పటికే ప్రతిపాదించాయి. అవసరం దృష్ట్యా విద్యా వలంటీర్లను ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. సమస్యలు తలెత్తకుండా పారదర్శకంగా బదిలీలు చేపట్టాలనే యోచనలో ప్రభుత్వం ఉంది.
సిఫార్సుల తంతు షురూ..
ప్రభుత్వం ఒకవైపు బదిలీలు చేపట్టేందుకు సిద్ధమవుతుండగా, కొందరు రాజకీయ సిఫార్సులతో ఆర్డర్స్ తెచ్చుకుని కోరుకున్న చోటకు బదిలీకి ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కొందరు ఉపాధ్యాయుల ఆర్డర్స్ సిద్ధమైనట్లు సమాచారం. అదే జరిగితే, బదిలీలలో చాలా మందికి అన్యాయం జరుగుతుందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు. దొడ్డిదారిన వచ్చే ఆర్డర్స్‌కు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల డిమాండు ఉన్నట్లు సమాచారం. ఒకేచోట ఐదేళ్లు నిండిన ప్రధానోపాధ్యాయులు, ఎనిమిదేళ్లు నిండిన ఉపాధ్యాయులు విధిగా బదిలీకావాల్సి ఉంది. అలాంటి వారే ముందస్తుగా ప్రభుత్వ పెద్దల ద్వారా తాము కోరుకున్న చోటకు ఆర్డర్స్ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు ఉపాధ్యాయులలో చర్చలు జరుగుతున్నాయి. పారదర్శకంగా బదిలీలు నిర్వహించాలంటే సిఫార్సు ఆర్డర్స్‌ను ప్రోత్సహించొద్దని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరుతున్నారు.
పారదర్శకంగా బదిలీలు : ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి
ఉపాధ్యాయుల బదిలీలను పారదర్శకంగా చేపట్టాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికను రూపొం దించాలన్నారు. బదిలీలకు ఉపాధ్యాయ సంఘాల సిఫార్సులను అమలు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆర్థికశాఖ గ్రీన్ సిగల్ లభిస్తే వారం రోజుల్లోనే బదిలీలు, రేషనలైజేషన్ మార్గదర్శ కాలను జారీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. బదిలీల నిర్వహణపై విద్యాశాఖ అధికారులను కలసినట్లు పేర్కొన్నారు.
వెబ్ కౌన్సెలింగ్ వద్దు : ఆప్టా
ఉపాధ్యాయుల బదిలీలను వెబ్ కౌన్సెలింగ్ విధానంలో చేపట్టవద్దని ఏపీ ప్రాథమిక టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) అధ్యక్షుడు ఏజీఎస్ గణపతిరావు, ప్రధాన కార్యదర్శి కె.ప్రకాశ రావు కోరారు. ఐదు, ఎనిమిదేళ్లపాటు ఒకేచోట పని చేసిన వారి సంఖ్య జిల్లాకు మూడు వేల మంది ఉంటుందని, అం దరూ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం కష్టమన్నారు. అంతేగాకుండా కొత్తగా ఏర్పడిన ఖాళీలు వెబ్‌లో కనిపించే అవకాశం లేద న్నారు. దీనికితోడు అందరికీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చే అవకాశం ఉండకపోగా, చాలా మందికి దీనిపై అవగాహన లేదన్నారు. గతంలో వెబ్ కౌన్సెలింగ్ విధానం వల్ల చాలామంది నష్టపో యారని, మాన్యువల్‌గానే బదిలీలు నిర్వహించాలని కోరారు.
మూలం:
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి :
0 Response to "Teachers Transfers"
Post a Comment