Teachers Transfers
ఉపాధ్యాయుల బదిలీలకు రంగం సిద్ధం
ప్రతి బడికి ఇద్దరు ఉపాధ్యాయులు
ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం
త్వరలో జీవో విడుదల కావచ్చంటున్న సంఘాలు
ప్రతి బడికి ఇద్దరు ఉపాధ్యాయులు
ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం
త్వరలో జీవో విడుదల కావచ్చంటున్న సంఘాలు
పది పరీక్షల అనంతరం ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. పరీక్షలను రద్దు చేయడం, ఆగస్టులో పాఠశాలల తెరవాలన్న లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం... ప్రస్తుతం ఉపాధ్యాయుల బదిలీలపై దృష్టి సారించింది. తొలుత హేతుబద్ధీకరణ, అనంతరం బదిలీలు కూడా చేపట్టాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఆయా ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాలు నిర్వహించిన ప్రభుత్వం దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయడంతోపాటు అవసరమైన కసరత్తు ప్రారంభించింది.
ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ
ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ 2017 జులైలో జరిగింది. మూడేళ్ల అనంతరం ప్రస్తుతం ప్రభుత్వం మళ్లీ హేతుబద్ధీకరణకు నిర్ణయించింది. జిల్లాలో ఉపాధ్యాయుల ఖాళీలు, 5, 8 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నవారి వివరాలతో పూర్తిస్థాయి నివేదికను జిల్లా విద్యా శాఖ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఖాళీలను భర్తీ చేయడంతోపాటు, తక్కువ విద్యార్థులున్న పాఠశాలల్లో అధికంగా ఉన్న ఉపాధ్యాయులను విద్యార్థులు ఎక్కువగా ఉన్న పాఠశాలలకు బదిలీ చేస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరి 29వ తేదీ వరకు పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల సంఖ్యను అనుసరించి ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ప్రక్రియ నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమయ్యింది. బదిలీలపై మార్గదర్శకాలు రూపొందించడంతో జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ప్రతి పాఠశాలకూ ఇద్దరు ఉపాధ్యాయులు
ప్రతి పాఠశాలకూ ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టులు రద్దు లేకుండానే అవసరమైన ప్రాంతాల్లో ఉపాధ్యాయులను కేటాయించనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆయా పాఠశాలల్లో 946 ఖాళీలు ఉన్నాయి. కొత్తగా కేటాయించిన పోస్టులతోపాటు హేతుబద్ధీకరణలో భాగంగా ఖాళీలు భర్తీ చేయడానికి అవకాశం ఉంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఒక్కో పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలి. జిల్లాలో ఏకోపాధ్యాయ పాఠశాలలు 450కుపైగా ఉండగా, ఉపాధ్యాయులు లేనివి కూడా ఉన్నాయి. విద్యార్థుల సంఖ్య మరీ తక్కువగా ఉన్న పాఠశాలను కిలోమీటరు దూరంలోపు పాఠశాలకు అనుసంధానం చేస్తారు. లేదంటే మరో ఉపాధ్యాయుడిని నియమిస్తారు. ఉపాధ్యాయులు లేని పాఠశాలలు, ఏకోపాధ్యాయ పాఠశాలలు కూడా మార్పు సంతరించుకోనున్నాయి. జిల్లాలోని పలు ప్రాథమికోన్నత పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత ఉంది. డీఈవో పూల్లో ఉన్న ఉపాధ్యాయులను ఆయా పాఠశాలల్లో సర్దుబాటు చేయనున్నారు.
అన్ని ఖాళీలు భర్తీ
జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 17 ప్రాథమికోన్నత పాఠశాలలను జడ్పీ ఉన్నత పాఠశాలలుగా వర్గోన్నతి కల్పించారు. ఇది జరిగి ఏళ్లు గడిచిపోతున్నా ఇంతవరకు పూర్తిస్థాయిలో సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులను కేటాయించలేదు. ఇప్పటి వరకు హెచ్‌ఎం పోస్టులు కూడా లేవు. ఇలా క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను ఉపాధ్యాయ సంఘాలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాయి. హైస్కూళ్లలో సబ్జెక్టు టీచర్లు లేనిచోట ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి పంపించడానికి చర్యలు తీసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
బదిలీలకు కనీస సర్వీసు రెండేళ్లు
ఉపాధ్యాయుల బదిలీలకు కనీస సర్వీసు రెండేళ్లు ఉండాలన్న నిబంధన విధించింది. ఒకే ప్రదేశంలో గరిష్ఠంగా ఎనిమిదేళ్లు పూర్తి కావాలి. ప్రధానోపాధ్యాయులకు ఐదేళ్ల సర్వీసు పూర్తయి ఉండాలి. ఆదర్శ పాఠశాలలు, కేజీబీవీల్లోనూ బదిలీలు చేపట్టడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కేటగిరీలనుబట్టి ఒకటి నుంచి 5 పాయింట్లు కేటాయిస్తారు. స్పౌస్‌కు 5 పాయింట్లు కేటాయిస్తారు. సర్వీసు పాయింట్లు, స్టేషన్ పాయింట్లు ఆధారంగా బదిలీలు చేపట్టనున్నారు.
మూడు పోస్టులు ఇవ్వాలి
విద్యార్థుల సంఖ్య 40 దాటితే మూడు పోస్టులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరాం. మిగిలిన పోస్టులను విద్యార్థుల సంఖ్యను బట్టి సర్దుబాటు చేయాలి. 40 మంది విద్యార్థులు దాటితే మూడు పోస్టులు కేటాయించాలన్నది మా ప్రధానమైన డిమాండ్. ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమ బోధనను ప్రోత్సహిస్తున్నందున ప్రతి పాఠశాలకు ఆంగ్లం బోధించే వారు ఒకరు ఉండాలి. ప్రభుత్వానికి చేసిన పలు ప్రతిపాదనలను ఆమోదించాలని కోరుతున్నాం. బదిలీల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
0 Response to "Teachers Transfers"
Post a Comment