Dropouts in AP should be minimized
ఏపీలో డ్రాపవుట్స్ తగ్గించాలి.
- రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలి
- సెకండరీ నుంచి 69 శాతమే ఉన్నత విద్యకు
- కడప జిల్లాలో మరీ అధ్వానం.. 50 శాతమే
- ఎలిమెంటరీలో అదనంగా 13,981 మంది టీచర్లు
- సెకండరీ స్కూళ్లలో 12,279 టీచర్ పోస్టులు ఖాళీ
- అవసరమైన చోట టీచర్లుండేలా హేతుబద్ధీకరించాలి: కేంద్రం
- రాష్ట్రంలో 2,692 కోట్లతో సమగ్ర శిక్ష పథకం అమలు!
న్యూఢిల్లీ, ఏపీలో డ్రాపవుట్ రేటును తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. సెకండరీ స్థాయిలో ఎస్టీ విద్యార్థుల డ్రాపవుట్ రేటు వార్షిక సగటు 18.7 శాతం ఉందని తెలిపింది. ఏపీలో రూ.2,692 కోట్లతో సమగ్ర శిక్ష అభియాన్ పథకాన్ని అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు 2020-21 సంవత్సరానికి కేంద్ర విద్యాశాఖలోని ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు రాష్ట్ర వార్షిక ప్రణాళిక, బడ్జెట్‌లను ఆమోదించింది. ఈ పథకంలో సర్వశిక్ష అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ పథకాలు, టీచర్ల శిక్షణ అంతర్భాగంగా ఉంటాయి. గతేడాది ముగిసే నాటికి మిగిలిన రూ.679.3 కోట్లతో కలిపి ఈ ఏడాది ఎలిమెంటరీ విద్యకు రూ.1,880.72 కోట్లు, సెకండరీ విద్యకు రూ.795.23 కోట్లు, టీచర్ ఎడ్యుకేషన్‌కు రూ.16.04 కోట్లను కేటాయించింది. ఈ మొత్తం వ్యయంలో కేంద్రం తన వాటాగా రూ.1348.85 కోట్లు అందిస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వం రూ.899.02 కోట్లు భరించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలపై బోర్డు సమీక్ష జరిపింది. 2018-19లో సెకండరీ విద్య పూర్తి చేసుకున్న వారిలో ఉన్నత విద్యకు వెళ్లిన వారు 69 శాతమే ఉన్నారని, కడప జిల్లాలో అది 50 శాతమేనని బోర్డు పేర్కొంది. ఈ పరిస్థితిని మెరుగుపర్చడానికి రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఎలిమెంటరీ స్థాయిలో 13,981 టీచర్లు అదనంగా ఉన్నారని, ప్రభుత్వ సెకండరీ పాఠశాలల్లో 12,279 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రస్తావించింది. అన్ని పాఠశాలల్లో అవసరమైన టీచర్లు ఉండేలా హేతుబద్ధీకరించాలని పేర్కొంది. ఎన్ని పోస్టులు మంజూరయ్యాయి? ఎన్ని భర్తీ అయ్యాయి? ఖాళీలెన్ని? అనే అంశాలపై స్పష్టత తెచ్చుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీ సీట్లను భర్తీ చేయాలని పేర్కొంది.
0 Response to "Dropouts in AP should be minimized"
Post a Comment