Ammavadi
అందని అమ్మఒడి!
- ఆంక్షల పేరిట లబ్ధిదారుల సంఖ్యలో కోత
- 42.33 లక్షల మందికి మాత్రమే సాయం
- వేలాది మంది అర్హులకు మొండిచెయ్యి
- పెండింగ్‌లోనే 72 వేల మంది అనాథలు
- పరిశీలన చేసి ధ్రువీకరించిన వలంటీర్లు
‘అమ్మఒడి’ పథకం కొందరికే పరిమితమైంది. ఆంక్షల సాకుతో వేలాది మంది అర్హులకూ ప్రభుత్వం మొండిచేయి చూపుతోందన్న ఆరోపణలున్నాయి. దరఖాస్తుల్లో లోపాలను ప్రధానోపాధ్యాయులు సరిదిద్దిన తర్వాత వలంటీర్లు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, ధ్రువీకరించినా ప్రభుత్వం మాత్రం అర్హులకు సాయం అందించకుండా చేతులు దులుపుకొందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో 1-10వ తరగతి వరకు దాదాపు 72లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఒక కుటుంబంలో ఎందరు చదువుకుంటున్నా ఒక్కరికే లబ్ధి చేకూరేలా నిబంధన విధిస్తూ 63లక్షల మంది తల్లులకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని తొలుత నిర్ణయించారు. ఆ తర్వాత అనేక ఆంక్షలు విధించి సంఖ్యను తగ్గించే ప్రయత్నాలు చేశారు.
ఈ ఏడాది జనవరి 9న ‘అమ్మఒడి’ని ఆర్భాటంగా ప్రారంభించిన ప్రభుత్వం... రాష్ట్రవ్యాప్తంగా 42.33 లక్షల మంది తల్లులకు రూ.15వేల చొప్పున వారి ఖాతాల్లో జమ చేసింది. విద్యుత్తు వినియోగం 300 యూనిట్ల కంటే ఎక్కువ ఉండటం, పట్టణ ప్రాంతాల్లో 100చ.గ. కంటే ఎక్కువ స్థలం ఉండటం, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు కావడం, బ్యాంక్ ఖాతా, ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్‌లో తేడా తదితర కారణాలతో మిగిలినవారిని పెండింగ్‌లో పెట్టారు. లోపాలను సరిచేశాక వీరిలో అర్హులకు డబ్బులిస్తామని చెప్పారు. పాఠశాలల హెడ్మాస్టర్లు 32 అంశాలతో కూడిన షీట్‌లో వివరాలను సరిదిద్ది మార్చి, ఏప్రిల్లో అప్‌లోడ్ చేశారు. తర్వాత గ్రామ/ వార్డు సచివాలయాల వలంటీర్లు సైతం ధ్రువీకరించారు.
కానీ వేలాది మంది అర్హులైన తల్లులకు మాత్రం ఇంతవరకూ డబ్బులివ్వలేదు. అప్పట్లో జిల్లా కలెక్టరేట్లలో నిర్వహించిన ‘స్పందన’లో తమకు అమ్మఒడి ఇప్పించాలని భారీ సంఖ్యలో అర్జీలు వచ్చాయి. కానీ కొవిడ్ కారణం చూపి మార్చి 27 తర్వాత ఈ కార్యక్రమం రద్దు చేశారు. దీంతో అన్ని జిల్లాల్లోనూ లబ్ధికి దూరమైన విద్యార్థుల తల్లులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణాజిల్లా విద్యాధికారి డేటా తెప్పించి ప్రభుత్వానికి పంపించారు. చిత్తూరు జిల్లాలో 30 శాతం మంది తల్లులు అమ్మఒడి కింద ఇవ్వాల్సిన లబ్ధికి దూరమైనట్లు సమాచారం. మిగిలిన జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. 1.15లక్షల మంది తల్లులు అర్హత కలిగి ఉన్నారంటూ వీరి జాబితాను ప్రభుత్వానికి పంపించారు. 72వేల మంది అనాథ పిల్లలకు పథకం వర్తింపజేయడంపై నిర్ణయం తీసుకోవలసి ఉంది.
0 Response to "Ammavadi"
Post a Comment