Within 24 hours .. Prevent the spread of the corona
24 గంటల్లోనే.. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట
కొత్త యాంటీవైరల్ ఔషధాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు.
వాషింగ్టన్: కొవిడ్-19 వ్యాప్తిని అడ్డుకునే సామర్థ్యం ఒక యాంటీవైరల్ ఔషధానికి ఉన్నట్లు అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ మహమ్మారి ఉద్ధృతికి కళ్లెం వేయడానికి దీన్ని ఒక మార్గంగా ఉపయోగించుకోవచ్చని తేల్చారు. జార్జియా స్టేట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ ఆవిష్కారం చేశారు.
మోల్నుపిరావిర్ అనే ఈ యాంటీవైరల్ ఔషధాన్ని తొలుత ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ల కోసం అభివృద్ధి చేశారు. శ్వాసకోశ వ్యవస్థలో ఇన్‌ఫెక్షన్లు కలిగించే ఆర్‌ఎన్‌ఏ వైరస్‌లపై మోల్నుపిరావిర్ సమర్థంగా పనిచేస్తుందని ఇప్పటికే రుజువైంది. ఇన్‌ఫెక్షన్ సోకిన జంతువులకు నోటి ద్వారా ఈ ఔషధాన్ని ఇచ్చినప్పుడు.. వాటి నుంచి బయటకు వెలువడే వైరల్ రేణువులు గణనీయంగా తగ్గుతాయని ప్రయోగాల్లో తేలింది. ఫలితంగా వైరస్ వ్యాప్తి నాటకీయంగా తగ్గిందని వెల్లడైంది. ఈ లక్షణాల కారణంగా మోల్నుపిరావిర్‌ను కొవిడ్ కట్టడికి అనువైన మందుగా గుర్తించారు. ప్రజలందరికీ టీకా వేసేలోగా కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడం చాలా కీలకం.
కొవిడ్‌పై ఈ ఔషధ సమర్థతను నిర్ధారించేందుకు ఫెర్రెట్ అనే జంతువులపై శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగించారు. వాటికి కరోనా వైరస్‌తో ఇన్‌ఫెక్షన్ కలిగించారు. వాటి ముక్కు ద్వారా వైరస్ రేణువులు బయటకు వస్తున్న దశలో కొన్ని జంతువులకు మోల్నుపిరావిర్ ఇచ్చారు. మిగతా వాటికి ఈ ఔషధాన్ని ఇవ్వలేదు. వాటిని వేర్వేరు బోనుల్లో ఉంచారు. ఆ తర్వాత ఈ రెండు బోనుల్లోకి ఆరోగ్యంగా ఉన్న ఫెర్రెట్లను ప్రవేశపెట్టారు. మోల్నుపిరావిర్ ఔషధాన్ని పొందిన జంతువులున్న బోనులోకి వెళ్లిన ఫెర్రెట్లకు వైరస్ సోకలేదు. ఆ మందును పొందని జీవులున్న బోనులోని ఫెర్రెట్లకు మాత్రం ఈ మహమ్మారి సోకింది. ఈ లెక్కన ఒక కొవిడ్ బాధితుడికి మోల్నుపిరావిర్ ఇస్తే.. 24 గంటల్లోనే అతడి నుంచి వైరస్ వ్యాప్తి ఆగిపోతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ‘‘ఇది నోటి ద్వారా తీసుకునే మందు. కరోనా వ్యాప్తిని వేగంగా అడ్డుకునే సామర్థ్యమున్న ఔషధాన్ని గుర్తించడం ఇదే మొదటిసారి. ఇది విప్లవాత్మక మార్పులు తెస్తుంది’’ అని పరిశోధనలో పాలుపంచుకున్న రిచర్డ్ ప్లెంపర్ తెలిపారు.
0 Response to "Within 24 hours .. Prevent the spread of the corona"
Post a Comment