Comprehensive Punishment Government of Andhra Pradesh Press Release (27.3.2021)
సమగ్ర శిక్షా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
పత్రికా ప్రకటన (27.3.2021)
విద్యార్థుల ఆరోగ్య భద్రతపై ప్రత్యేక ద్రుష్టి.
కోవిడ్ టెస్ట్ ల సంఖ్యను పెంచుతాం.
ఈ రెండు నెలలు క్లిష్టమైనవి.. జాగ్రత్తలు తీసుకోవాలి.
విద్యాశాఖ మంత్రి డా. ఆదిమూలపు సురేష్.
కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తున్న దృష్ట్యా ఉపాధ్యాయులు, విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్త వహించాలని రాష్ట్ర విద్యాశాఖామాత్యులు డా. ఆదిమూలపు సురేష్ గారు అన్నారు. శనివారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో ‘కోవిడ్ మహమ్మారి విస్తరణ ద్రష్ట్యా విద్యా వ్యవస్థలో ప్రత్యేక కార్యనిర్వహణా ప్రణాళిక’పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కాన్ఫరెన్సులో అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు (అభివృద్ధి), విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, ఆర్జేడీలు, ఆర్ఐఓలు(ఇంటర్మీడియెట్ విద్య), జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.
విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ పాత్రికేయులతో మాట్లాడుతూ కోవిడ్ వల్ల గత విద్యాసంవత్సరం చిన్నాభిన్నం అయిపోయినా విద్యా సంవత్సరం నష్ట పోకుండా, విద్యార్థులు చదువుకు దూరం కాకుండా ఉండటానికి పాఠాలను ఆన్ లైన్, ఆఫ్ లైన్, లైవ్ స్ట్రీమింగ్ బోధన అందించామని అన్నారు.
పూర్తి స్థాయిలో విద్యార్థులకు ఆరోగ్య భద్రత
పాఠశాలలకు, కళాశాలలకు వచ్చే విద్యార్థులకు వారి ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ ఉపయోగించడం, మాస్కులు ధరించడం వంటివి తప్పకుండా పాటించేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. ‘జగనన్న విద్యాకానుక’లో భాగంగా పాఠశాల విద్యార్థులకు మూడు చొప్పున మాస్కులు ఇచ్చామని తెలిపారు.
కోవిడ్-19 సమయంలో కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా పూర్తి స్థాయి జాగ్రత్తలతో తరగతులు నిర్వహించడం అరుదైన విషయమని గుర్తు చేశారు. గౌరవ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారి సంకల్పం, దిశానిర్దేశాల వల్ల అకడమిక్ క్యాలెండర్ ను గాడిలో పెట్టగలిగామని అన్నారు.
ప్రత్యేక సెల్ ఏర్పాటు
కరోనా వ్యాప్తి దృష్టిలో ఉంచుకుని ‘జగనన్న గోరుముద్ద’ను పిల్లలందరికీ ఒకేసారి కాకుండా కొద్ది మంది చొప్పున భౌతిక దూరం పాటిస్తూ వడ్డించాలని తెలిపారు. వడ్డించేటప్పుడు ఆయాలు చేతికి గ్లౌసులు వంటివి ధరించాలని అన్నారు. వాటిని సరఫరా చేయాలని జేసీలకు ఆదేశించారు.
ఈ విద్యా సంవత్సరం పకడ్బందీ నిర్వహణతో సక్రమంగా సాగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనికోసం ప్రత్యేక ఎస్ఓపీ మార్గదర్శకాలు రూపొందించామన్నారు. అలానే జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో ‘స్పెషల్ మోనటరింగ్ సెల్’ ఏర్పాటు చేయమని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.
ప్రాథమిక స్థాయి విద్యార్థుల ఆరోగ్యం పట్ల అత్యంత జాగరూకత వహించాలని, విద్యార్థుల కోసం థర్మల్ స్క్రీన్ ఏర్పాటు చేసేలా జాయింట్ కలెక్టర్లు, కలెక్టర్లకు ఆదేశించారు. ఇందుకోసం వైద్య, ఆరోగ్యశాఖ వారి సహాయం కూడా తీసుకోవాలని అన్నారు.
*ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు*
ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభిస్తున్నాం కాబట్టి పిల్లలు, ఉపాధ్యాయులు సమయానికి పాఠశాలకు వచ్చేలా చూడాలన్నారు. అందుకోసం బయోమెట్రిక్ సిస్టమ్ ను అప్ డేట్ చేశామని అన్నారు. అన్ని పాఠశాలల్లోనూ విద్యార్థులు, ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఉపయోగించాలని అన్నారు. జిల్లా అధికారులు బయోమెట్రిక్ హాజరును విధిగా తనిఖీ చేయడంతో పాటుగా పాఠశాలల్లో బయోమోట్రిక్ డివైజులు వినియోగం ఉన్నాయో లేవో తనిఖీ చేయవలసిందిగా ఆదేశించారు. బయోమెట్రిక్ డివైజుల వినియోగంలో ఏవైనా అవకతవకలు జరిగితే సంబంధిత అధికారులను తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి పాఠశాల విద్యా సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి, ఇంటర్మీడియెట్ బోర్డు ఎడ్యుకేషన్ కమీషనర్ వి.రామకృష్ణ, ఉన్నత విద్య స్పెషల్, ఛీప్ సెక్రటరీ సతీష్ చంద్ర, రాష్ట్ర ఉన్నత విద్య చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి, సీమ్యాట్ డైరెక్టర్ వి.ఎన్.మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు.
0 Response to "Comprehensive Punishment Government of Andhra Pradesh Press Release (27.3.2021)"
Post a Comment