Caronaa updates
పట్ట పగ్గాలు లేని కరోనా
- ఒకేరోజు 1,31,968 కేసులు
- ఏప్రిల్‌లో రోజుకు సగటున లక్ష చొప్పున నమోదు
- క్రమంగా పెరుగుతున్న మరణాలు
దేశంలో కరోనా మహమ్మారి పగ్గాల్లేకుండా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 1,31,968 మంది కరోనా బారిన పడ్డారు. 780 మంది ప్రాణాలు కోల్పోయారు. ఛత్తీస్‌గఢ్, ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్‌లలో ఇదివరకు ఎన్నడూ లేనంత గరిష్ఠ సంఖ్యలో కేసులొచ్చాయి. మరో 25 రాష్ట్రాల్లో గత రెండు వారాలను మించిన స్థాయిలో కేసులు నమోదయ్యాయి. రోజువారీ కేసుల్లో మహారాష్ట్ర వాటా తగ్గి మిగిలిన రాష్ట్రాల వాటా పెరుగుతూ పోతోంది. ఛత్తీస్‌గఢ్‌లో వరుసగా రెండోరోజు పదివేలకు పైగా కేసులొచ్చాయి. ఉత్తర్‌ప్రదేశ్, దిల్లీ పదివేలకు చేరువవుతున్నాయి. మొత్తం పది రాష్ట్రాల నుంచి 83.29% కేసులు, 92.82% మరణాలు నమోదయ్యాయి. ఏప్రిల్ 1న 6.43% ఉన్న పాజిటివిటీ రేటు శుక్రవారం నాటికి 9.67%కి పెరిగింది. ఈ నెలలో తొలి 9 రోజుల్లో 9,08,207 కేసులు నమోదు కాగా 5,174 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైరస్ సోకిన వారి సంఖ్య 1,30,60,542కి, మృతుల సంఖ్య 1,67,642కి పెరిగింది.
దేశంలో క్రియాశీల కేసులు 9,79,608కి పెరిగాయి. మొత్తం పాజిటివ్ కేసుల్లో దీని నిష్పత్తి 7.50%కి చేరింది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్, కేరళల్లో కలిపి 73.24% క్రియాశీల కేసులు కేంద్రీకృతమయ్యాయి. శుక్రవారం నాటికి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,19,13,292 (91.22%)కి చేరింది. 24 గంటల్లో 61,899 మంది కోలుకున్నారు. గత అయిదు రోజులుగా ప్రపంచంలో మరే దేశంలో లేనన్ని కేసులు భారత్‌లోనే నమోదవుతూ వస్తున్నాయి.
149 జిల్లాల్లో కొత్త కేసుల్లేవు: కేంద్రం
గత వారం రోజుల్లో దేశంలోని 149 జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాలేదని.. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 9.78 కోట్ల మందికిపైగా వ్యాక్సిన్ వేయించుకున్నట్లు తెలిపారు. శుక్రవారం ఉన్నతస్థాయి మంత్రుల బృందంతో నిర్వహించిన సమావేశంలో హర్షవర్ధన్ మాట్లాడుతూ.. ‘‘వ్యాక్సిన్ మైత్రి’’ ద్వారా దాదాపు 85 దేశాలకు 6.45 కోట్ల డోసుల వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు.
కరోనా ఉద్ధృతి ఇలాగే కొనసాగితే మహారాష్ట్రలో పూర్తిస్థాయిలో రెండు నుంచి మూడు వారాల పాటు లాక్‌డౌన్ విధించే అవకాశాలను కొట్టిపారేయలేమంటూ ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే సంకేతాలిచ్చారు.
ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా పాఠశాలలను మూసివేస్తున్నట్లు దిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుందని తెలిపారు.
కర్ణాటకలో నేటి నుంచి రాత్రి కర్ఫ్యూ
ఈనాడు డిజిటల్, బెంగళూరు: కర్ణాటకలో బెంగళూరు, మైసూరు సహా ఎంపిక చేసిన నగరాల్లో శనివారం నుంచి పది రోజుల పాటు రాత్రి కర్ఫ్యూ అమలు చేయనున్నారు. అత్యవసర సేవలు మినహా అన్నింటినీ నిషేధిస్తారు. రైళ్లు, బస్సులు, విమాన ప్రయాణికులకు ఈ నిబంధనల నుంచి సడలింపు ఉంది.
35 మంది ఎయిమ్స్ వైద్యులకు కరోనా
దిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో 50 మందికి పైగా ఉద్యోగులు కరోనా బారినపడ్డారు. వారిలో 35 మంది వైద్యులు కాగా మిగిలిన 15 మంది ఆరోగ్య సిబ్బంది.
జమ్మూ-కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా కరోనా బారిన పడ్డారు.
ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భాగవత్‌కు కరోనా సోకింది.
వ్యాక్సిన్ ఎగుమతులు ఆపండి : ప్రధానికి రాహుల్ లేఖ
ఈనాడు, దిల్లీ: దేశంలో వ్యాక్సిన్ కొరత కనిపిస్తున్న నేపథ్యంలో తక్షణం విదేశాలకు ఎగుమతి చేయడాన్ని నిలిపి వేయాలని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తిచేశారు. ఈమేరకు ఆయన శుక్రవారం లేఖ రాశారు. వ్యాక్సినేషన్ మొదలుపెట్టి మూడునెలలైనప్పటికీ కేవలం 1% మందికే పూర్తిస్థాయి టీకా అందించడం పట్ల ఆక్షేపణ వ్యక్తంచేశారు. దేశీయంగా వ్యాక్సిన్ కొరత ఎదురవుతున్న తరుణంలో 6 కోట్ల డోసులను విదేశాలకు ఎగుమతి చేయడానికి అనుమతివ్వడం వెనుక కారణమేంటని ప్రశ్నించారు. సొంత ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ప్రచారంకోసం పాకులాడుతున్నారా? అని వ్యంగ్యాస్త్రం సంధించారు. వైద్యం రాష్ట్రాల పరిధిలోని అంశమైనప్పటికీ వాటిని పక్కనపెట్టి వ్యక్తిగత ప్రచారం కోసం కేంద్రీకృత నిర్ణయాలు తీసుకుంటే దుష్పరిణామాలు సంభవిస్తాయని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానికి ఏడు సూచనలు చేశారు.
0 Response to "Caronaa updates"
Post a Comment