Karona Uppena
కరోనా ఉప్పెన
ఒక్కరోజులో 2.95 లక్షల మందికి వైరస్
రెండువేలకు పైగా మరణాలు
జపాన్ ప్రధాని భారత పర్యటన రద్దు
కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్‌కు పాజిటివ్
కరోనా మహమ్మారి దేశ ప్రజలపై ఉప్పెనలా విరుచుకుపడుతోంది. గత 42 రోజులుగా బాధితుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. కొన్ని ప్రాంతాల్లో కుటుంబంలో ఏ ఒక్కరినీ వదలకుండా అందరికీ సోకుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్‌కు, హిమాచల్ ప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి బిక్రమ్ సింగ్, కాంగ్రెస్ నేతలు అధీర్ రంజన్ చౌధరి, శశిథరూర్‌లకు కరోనా సోకింది. పద్మభూషణ్, జ్ఞానపీఠ్ పురస్కారాల గ్రహీత, ప్రముఖ బెంగాలీ రచయిత, కవి శంఖా ఘోష్ (89) కరోనాతో పోరాడుతూ బుధవారం మృతి చెందారు. తమ దేశంలోనూ వైరస్ వ్యాప్తి అధికంగా ఉండడంతో జపాన్ ప్రధాని యొషిహిదె సుగా భారత్, ఫిలిప్పీన్స్ పర్యటనలను రద్దు చేసుకున్నారు.
వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఇప్పటికే పలు రాష్ట్రాలు కర్ఫ్యూలు, వారాంతపు లాక్‌డౌన్‌లు విధించాయి. మరికొన్ని రాష్ట్రాలు కఠిన ఆంక్షలు దిశగా అడుగులేస్తున్నాయి. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో శుక్రవారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు పూర్తిస్థాయి కర్ఫ్యూను విధిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశాలు జారీ చేశారు. 10 శాతం ఉద్యోగులే కార్యాలయాలకు హాజరుకావాలని మధ్యప్రదేశ్ సర్కారు నిర్ణయించింది. మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ను పోలిన కఠిన ఆంక్షలను గురువారం రాత్రి 8 గం.ల నుంచి మే 1వ తేదీ ఉదయం 7 గంటల వరకు అమలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
రోజురోజుకూ కొత్త గరిష్ఠాలు
దేశంలో గత 42 రోజులుగా మహమ్మారి వ్యాప్తి అధికమవుతూనే ఉంది. బుధవారం ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో గతంలో ఎన్నడూలేని విధంగా 2,95,041 మందికి కరోనా సోకింది. 2023 మంది తుదిశ్వాస విడిచారు. ఈ నెలలో ఇప్పటివరకు రోజుకు సగటున 1,64,942 చొప్పున మొత్తం 34,63,795 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో రోజుకు సగటున 956 మంది చొప్పున 20,085 మంది కన్నుమూశారు. గత ఒక్కరోజులో 16 రాష్ట్రాల్లో ఇదివరకు ఎన్నడూలేనంత గరిష్ఠ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. కరోనా రోగులకు సత్వర వైద్య సేవలందించేందుకు రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్‌లు, నర్సింగ్ హోమ్‌లకు గుజరాత్ ప్రభుత్వం అనుమతించింది. జూన్ 15 వరకు ఇది వర్తిస్తుంది. మహారాష్ట్రలోని పుణె సహా పలు ప్రధాన నగరాల్లో అత్యవసర అంబులెన్స్ సేవల కోసం రోజుకు 9వేలకు పైగా ఫోన్లు వస్తున్నాయని కంట్రోల్ రూమ్ మేనేజర్ డాక్టర్ ప్రవీణ్ సాధలే తెలిపారు.®️
0 Response to "Karona Uppena"
Post a Comment