Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Is the guarantee on cancellation of CPS applicable?

సీపీఎస్‌ రద్దుపై హామీ అమలవుతుందా?

Is the guarantee on cancellation of CPS applicable?

  • అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తామన్న జగన్‌
  • ఆ తర్వాత కమిటీల మీద కమిటీలు
  • రెండేళ్లు గడిచినా తేలని నిర్ణయం
  • లక్షల మంది ఉద్యోగుల ఎదురుచూపు

ఈనాడు - అమరావతి సీపీఎస్‌ రద్దుకోసం దాదాపు 1,94,000 మంది ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు.కొత్త పింఛను విధానం కింద పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కొందరికి నెలకు రూ.2,000లోపే పింఛను అందుతోంది. ఇది ప్రభుత్వం వివిధ వర్గాల పేదలకు ఇచ్చే సామాజిక పింఛను కన్నా తక్కువే.

‘అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ప్రభుత్వ ఉద్యోగులకు అమలవుతున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకాన్ని (సీపీఎస్‌) ఏ ఇతర కమిటీలను నియమించకుండానే రద్దు చేస్తా’ అని ప్రతిపక్ష నాయకుడి హోదాలో పులివెందుల నుంచి శ్రీకాకుళం వరకు చేసిన పాదయాత్రలో అనేకచోట్ల జగన్‌ విస్పష్టంగా ప్రకటించారు. తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోనూ పొందుపరిచారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు దాటిపోయింది. సీపీఎస్‌ రద్దుపై నిర్ణయం వెలువడలేదు. ఆయన అధ్యక్షతన నిర్వహించిన తొలి మంత్రి మండలి సమావేశంలో సీపీఎస్‌ను సూత్రప్రాయంగా రద్దు చేస్తున్నట్లు తీర్మానించారు. అదీ ఆచరణలోకి రాలేదు. అయితే... చంద్రబాబు హయాంలో టక్కర్‌ కమిటీ సమర్పించిన నివేదికను అధ్యయనం చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. అదే నివేదికను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో అధికారులతో మరో కమిటీని నియమించారు. నాటి నుంచి నేటి వరకు ముఖ్యమంత్రి నోట ఈ అంశంపై ఒక్కమాటా వినిపించలేదు. ప్రభుత్వ మౌనం కారణంగా సీపీఎస్‌ పరిధిలోకి వచ్చే దాదాపు 1,94,000 మంది ఉద్యోగులు నిరాశకు గురవుతున్నారు.

2004 నుంచి..

ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ప్రతి నెలా పింఛను అందించే విధానం ఉంది. దీని స్థానంలో 2004లో కేంద్ర ప్రభుత్వం కాంట్రిబ్యూటరీ పింఛను విధానం రూపొందించగా... దాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సహా అనేక రాష్ట్రాలు అమలులోకి తెచ్చాయి. దాంతో 2004 తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వారికి సీపీఎస్‌ విధానమే అమలవుతోంది.  కొత్త పింఛను విధానం కింద పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పాత విధానం కంటే చాలా తక్కువ మొత్తం పింఛనుగా అందుతోంది.

పాత పద్ధతితో ఆర్థిక భరోసా..

  • ప్రభుత్వ ఉద్యోగులు తాము పదవీ విరమణ చేసే రోజు నాటికి ఉన్న తమ మూల వేతనంలో 40% అమ్ముకుని కమ్యుటేషన్‌గా పొందుతారు.
  • మిగిలిన మూల వేతనానికి, కరవు భత్యం కలిపి ప్రభుత్వం ప్రతినెలా పింఛనుగా అందిస్తుంది. ఈ పింఛను పొందేందుకు ఉద్యోగి తన జీతం నుంచి ఎలాంటి వాటా చెల్లించక్కర్లేదు. పైగా పీఆర్సీ సిఫార్సుల ఆధారంగా వీరి పింఛను పెరుగుతుంటుంది. కరవు భత్యమూ కలుస్తుంది.
  • ఉద్యోగి తదనంతరం జీవిత భాగస్వామికీ కుటుంబ పింఛను అందుతుంది.
  • దీంతోపాటు గ్రాట్యుటీ, ఆరోగ్య పథకం కింద ఎప్పటికప్పుడు వైద్య ఖర్చులను ప్రభుత్వం రీయింబర్సు చేస్తుంది. జీతం, పింఛన్ల నుంచి ఆరోగ్య పథకం కింద ప్రతినెలా కొంత మొత్తం మినహాయించుకుంటారు.

భరోసా ఇవ్వని ‘కాంట్రిబ్యూటరీ విధానం

  • కాంట్రిబ్యూటరీ పింఛను విధానం ప్రకారం... ఇందులో ఉద్యోగి మూలవేతనం నుంచి ప్రతినెలా 10% మినహాయిస్తారు. దీనికి ప్రభుత్వం 14% తన వాటాగా చెల్లించాలి. కానీ ప్రస్తుతం 10% చెల్లిస్తోంది.
  • ఈ మొత్తాన్ని ఉద్యోగి ప్రాన్‌ (శాశ్వత పదవీ విరమణ ఖాతా నంబరు) ఖాతాకు జమ చేస్తారు. ఆ సొమ్ములతో నేషనల్‌ సెక్యూరిటీ డిపాజిట్‌ లిమిటెడ్‌ ద్వారా షేర్‌ మార్కెట్లలో వివిధ పథకాల్లో పెట్టుబడులు పెడతారు.
  • ఉద్యోగి పదవీ విరమణ చేసే రోజు నాటికి ప్రాన్‌లో ఎంత మొత్తం ఉందో అందులో నుంచి 60% ఒకేసారి ఏక మొత్తంగా ఉద్యోగికి అందిస్తారు. షేర్‌ మార్కెట్‌ నష్టాలువస్తే అవి పోను ఆ రోజు నాటికి ఎంత ఉంటే అంతే ఇస్తారు. ఆ 60 శాతంలోనూ 20% మళ్లీ పన్నుగా ఉద్యోగి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది.
  • ఆ మిగిలిన 40 శాతాన్ని తిరిగి షేర్‌ మార్కెట్‌లోనే పెట్టుబడిగా పెట్టి ప్రతినెలా వచ్చే లాభాన్ని పింఛనుగా చెల్లిస్తుంటారు.
  • మొదట్లో సీపీఎస్‌లో గ్రాట్యుటీ లేదు. గత ప్రభుత్వ హయాంలో గ్రాట్యుటీ, కుటుంబ పింఛను ఇచ్చేందుకు అంగీకరించి అమలు చేస్తున్నారు. సీపీఎస్‌ ఉద్యోగి పదవీ విరమణలోగా మరణిస్తే బాధిత కుటుంబానికి అందే మొత్తం స్వల్పమే. అందుకే కుటుంబ పింఛను ఇవ్వాలని నిర్ణయించారు. ఆ ప్రకారం ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణిస్తే మూల వేతనంలో 50% ప్రతినెలా పింఛనుగా ఇస్తారు. ఇందుకు సర్వీసులో చేరి ఏడేళ్లు దాటి ఉండాలి. అదే ఏడేళ్లలోపు మరణిస్తే 30 శాతమే పింఛనుగా ఇస్తారు. అయితే... వీరు తమ ప్రాన్‌ ఖాతాలో ఉన్న సొమ్ము మొత్తం ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది.
  • సర్వీసులో ఉండగా ఆరోగ్య పథకం వర్తిస్తున్నా, పదవీ విరమణ తర్వాత ఆ ప్రయోజనాలు కొత్త పింఛను విధానంలో ఉద్యోగికి దక్కడం లేదు.

దాచుకున్న సొమ్ము మినహాయింపునకూ అవస్థలు

పాత పెన్షన్‌ విధానంలో ఉన్న ఉద్యోగులు ప్రభుత్వ ప్రావిడెంట్‌ ఫండ్‌కు ప్రతి నెలా నిధులు జమ చేస్తారు. అవసరమైనప్పుడు వాటిని తీసుకుని వినియోగించుకోవచ్చు. పదవీ విరమణ తర్వాత జీపీఎఫ్‌ సొమ్మును వడ్డీతో సహా ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లిస్తుంది.

సీపీఎస్‌లో ప్రాన్‌ ఖాతాకు జమ చేసే డబ్బులను మినహాయించుకోవడం సులభం కాదు. వెనక్కి తీసుకునేందుకు అవకాశమున్న మొత్తమూ చాలా స్వల్పమే.

రాష్ట్ర ప్రభుత్వ కమిటీలు... నివేదికలు

వైకాపా అధికారంలోకి వచ్చాక సీపీఎస్‌పై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. 2019 ఆగస్టు 1న ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆర్థిక, విద్య, పంచాయతీరాజ్‌, ఆరోగ్యశాఖల మంత్రులను ఈ బృందంలో నియమించారు. టక్కర్‌ కమిటీ నివేదికపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.

టక్కర్‌ కమిటీ నివేదికపై అధ్యయనం చేసేందుకు సీఎస్‌ అధ్యక్షతన 5 ప్రభుత్వశాఖల ముఖ్య కార్యదర్శులు/ కార్యదర్శులు సభ్యులుగా ఉండేలా మరో కమిటీని 2019 నవంబరు 27న ఏర్పాటు చేశారు. ఆ కమిటీ నివేదికను 2020 మార్చి నెలాఖరులోగా ఇవ్వాలని నిర్దేశించారు.

సీపీఎస్‌పై అధ్యయనం చేసి, వాస్తవ విశ్లేషణ చేసే బాధ్యతను కె.ఎ.పండిట్‌ కన్సల్టెన్సీకి అప్పగించినట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ శాసన మండలిలో 2020 డిసెంబరు 3న వెల్లడించారు.

సమస్యల పరిష్కారానికి ఉన్నది ముగ్గురు ఉద్యోగులే!

సీపీఎస్‌ అమలు విధానమూ సరిగా లేదని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జీతాల నుంచి మినహాయించిన మొత్తాలు వారి ప్రాన్‌ ఖాతాలకు సక్రమంగా చేరడం లేదు. దాదాపు రెండు లక్షల మందికి సంబంధించిన ఇలాంటి సమస్యల్ని పరిష్కరించేందుకు రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులు ముగ్గురే. సీపీఎస్‌ అమలులోకి వచ్చి 15ఏళ్లు దాటినా ఇప్పటికీ గాడిన పడలేదని కాగ్‌ సైతం 2019 నివేదికలో ప్రస్తావించింది. ఈ పథకం ప్రకారం పదవీ విరమణ ప్రయోజనాలు ఏమిటో ఇప్పటికీ తేల్చలేదని తప్పుబట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ దీని అమలు లోపాలతో నిండిపోయిందని పేర్కొంది. ఏపీలో ఉద్యోగుల ఖాతాల నుంచి మినహాయించిన రూ.325 కోట్లు ట్రస్టీ బ్యాంకుకు జమ చేయలేదంది. ప్రస్తుతం ఆ మొత్తం రెట్టింపు అయిందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.

రద్దు మినహా  ఏ ప్రత్యామ్నాయం అంగీకరించం

‘అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్‌ను రద్దు చేస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. ఇంతవరకు నిర్ణయం జరగలేదు. ఎంతో నమ్మకంతో ఎదురు చూస్తున్నాం. కిందటేడాది ఆగస్టు 31న ముఖ్యమంత్రిని కలిశాం. వారం రోజుల్లో ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని ఆ రోజు చెప్పారు. సీపీఎస్‌ రద్దుపై ప్రభుత్వ ఆలోచనలను అధికారులు వివరించి చెబుతారని తెలిపారు. అవి విన్న తర్వాత ఉద్యోగ సంఘాలు ఏది చెబితే అది చేస్తామని సీఎం జగన్‌ తెలిపారు. సీపీఎస్‌ రద్దు తప్ప మరో ప్రత్యామ్నాయానికి అంగీకరించబోమని ఆ రోజే చెప్పాం.’

- పి.రామాంజనేయులు, రాష్ట్ర అధ్యక్షులు, ఏపీ సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌

పోరాటానికి సిద్ధమవుతున్నాం

‘సీపీఎస్‌ రద్దుపై సీఎం మాట తప్పారు. ఇప్పటికే టక్కర్‌ కమిటీ నివేదిక ఉండగా మళ్లీ అధ్యయనం ఏమిటి? ఆ నివేదిక ప్రకారమే గత ప్రభుత్వం కుటుంబ పింఛను, గ్రాట్యుటీ అమలు చేసింది. పాత పింఛను విధానం ప్రకారం ఉద్యోగులు ఎంత నష్టపోతున్నారో ఆ మొత్తం ఇచ్చేందుకు సిద్ధమైంది. ఉద్యోగుల ముందు ఒక ప్రతిపాదన ఉంచింది. అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్‌... ఎన్నికల్లో తనను గెలిపిస్తే సీపీఎస్‌ను పూర్తిగా రద్దు చేస్తామని విస్పష్టంగా ప్రకటించారు. ప్రతిపక్ష నేత సీపీఎస్‌ను రద్దు చేస్తామని చెబుతుంటే మీ ప్రతిపాదనలను ఎలా అంగీకరిస్తామని నాటి ప్రభుత్వాన్ని అప్పట్లో మేం ప్రశ్నించాం. జగన్‌ ముఖ్యమంత్రి పదవి స్వీకరించి రెండేళ్లు అయినా సీపీఎస్‌ రద్దు చేయలేదు. క్షేత్రస్థాయి నుంచి మాపై తీవ్ర ఒత్తిడి ఉంది. త్వరలోనే కార్యాచరణ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాం.’    

💥- సి.ఎం.దాస్‌, అధ్యక్షుడు, ఏపీ సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం


సీఎస్‌ నేతృత్వంలోని కమిటీ చూస్తోంది

‘సీపీఎస్‌ రద్దుకు సంబంధించి టక్కర్‌ కమిటీ ఇచ్చిన నివేదిక, ఇతర నివేదికలపై సీఎస్‌ ఆధ్వర్యంలోని కమిటీ అధ్యయనం చేస్తోంది. తొలుత మంత్రుల బృందాన్ని నియమించినా టక్కర్‌ కమిటీ నివేదికను లోతుగా అధ్యయనం చేయాల్సి ఉండటంతో మళ్లీ కొత్త కమిటీని ప్రభుత్వం నియమించింది. తాజా పరిస్థితి ఏమిటో నేనూ తెలుసుకోవాల్సి ఉంది. సీఎస్‌ కమిటీ అధ్యయనం తర్వాత మంత్రుల బృందం నివేదిక ఇవ్వాలా? లేదా? అనే అంశాన్ని ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. కొవిడ్‌ నేపథ్యంలో అధికారులూ ఊపిరి సలపని పనుల్లో ఉన్నారు.

- బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆర్థిక మంత్రి

త్వరలోనే అధికారులతో సమావేశం

‘ఇంతకు ముందు ఉద్యోగ సంఘాలతో జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేశాం. అందులో సీపీఎస్‌తోపాటు ఇతర అనేక అంశాలూ చర్చకు వచ్చాయి. తర్వాత అధికారులతో మరో సమావేశం ఏర్పాటు చేసి వారి డిమాండ్లపై చర్చించా. కొన్ని అంశాలను కొందరు అధికారులకు అప్పజెప్పా. వచ్చే వారం అధికారులతో మళ్లీ ఉద్యోగుల డిమాండ్లు, సీపీఎస్‌ తదితర అంశాలపై సమావేశం ఏర్పాటు చేస్తా. వారికి అప్పజెప్పిన పనుల్లో ప్రగతి ఎంత ఉందో పరిశీలించాలి. సీపీఎస్‌పై మా కమిటీ ఇంకా నివేదికను సమర్పించలేదు.’

ఆదిత్యనాథ్‌ దాస్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Is the guarantee on cancellation of CPS applicable?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0