Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Chaduvulu Chattubandalu

చదువు చుట్టుబండలు

Chaduvulu Chattubandalu

  • తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇదీ..
  • ఎంవీ ఫౌండేషన్‌ - ‘ఈనాడు’ సర్వేలో తేటతెల్లం

విద్యా వ్యవస్థను కరోనా కోలుకోలేని దెబ్బతీసింది. పిల్లల చదువు చట్టుబండలైంది. దాదాపు ఏడాదిన్నర కాలంగా బడి ముఖమే ఎరుగని విద్యార్థులు అభ్యసన సామర్థ్యాలకు దూరమయ్యారు. ఇప్పటి వరకు నేర్చుకున్నవీ మరిచిపోతున్నారు. మూడు, నాలుగు అక్షరాల తేలికైన తెలుగు పదాలనూ తప్పులు లేకుండా రాయలేకపోతున్నారు. ప్రాథమిక స్థాయిలో చాలా మంది విద్యార్థుల పరిస్థితి తెలుగు రాయలేరు.. లెక్కలు చేయలేరు... ఆంగ్లం చదవలేరు అన్నట్లుగా ఉంది. ఎంవీ ఫౌండేషన్‌ సహకారంతో ‘ఈనాడు’ తెలుగు రాష్ట్రాల్లో చేసిన సర్వేలో తేటతెల్లమైన వాస్తవమిది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ విద్యా సంవత్సరం 3-6 తరగతులు చదువుతున్న పిల్లల విద్యా సామర్థ్యాల స్థాయిని నిర్ధారించేందుకు ప్రశ్నపత్రాలిచ్చి సర్వే చేయగా వారి చదువు అధ్వానంగా ఉన్నట్లు బహిర్గతమైంది. సర్వేలో పాల్గొన్న బాలురలో 88 శాతం మంది, 83 శాతం మంది బాలికలు తెలుగులో తేలికైన, గుణింత, ఒత్తు పదాలూ రాయలేకపోయారు. గణితంలో దాదాపు సగం మంది రెండంకెల కూడికలు, తీసివేతలూ చేయలేకపోయారు. గుణకారాలు, భాగాహారాలు రానివారు మొత్తంగా 82 శాతం మంది. అబ్బాయిల్లో ఇది 92 శాతం కావడం గమనార్హం. ఆంగ్లంలో బొమ్మల పేర్లు అక్షరదోషాలు లేకుండా రాసినవారు 44 శాతమే ఉండటం విద్యా సామర్థ్యాల దుస్థితికి నిదర్శనం. సొంతగా ఆలోచించి ఒక పేరా తెలుగులోనూ రాయలేకపోతుండటం ప్రధాన లోపంగా కనిపించింది.

నేర్చుకున్న నాలుగు ముక్కలూ మరిచిపోయిన విద్యార్థులు

తెలుగు రాష్ట్రాల్లో ‘ఈనాడు’ సర్వేలో తేటతెల్లం

కరోనా విజృంభణతో 2020 మార్చిలో బడులు మూతపడ్డాయి. అప్పటి నుంచి విద్యార్థులకు ఇంట్లోనే చదువు. ఆంధ్రప్రదేశ్‌లో గత విద్యా సంవత్సరం (2020-21)లో ఉన్నత పాఠశాలలు నవంబరు 2 నుంచి విడతలుగా, ప్రాథమిక బడులు ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్‌ 20 వరకు నడిచాయి. కరోనా రెండో దశ ఉద్ధృతితో మళ్లీ మూతపడ్డాయి. తెలంగాణలో రెండు నెలలపాటు ప్రత్యక్ష తరగతులు జరిగినా అవి 6-10 తరగతుల వారికి మాత్రమే. ఒకరకంగా దాదాపు ఏడాదిన్నరగా ఆన్‌లైన్‌ పాఠాలతోనే సరిపుచ్చారు. ఫోన్లు, టీవీలు, అంతర్జాల సౌకర్యం లేక...ఉన్నా ఆన్‌లైన్‌ పాఠాలు అర్థం కాక పిల్లలు అధిక శాతం చదువులను వదిలేశారు. పుస్తకాలు పట్టుకోవడం మానేశారు. దాని ఫలితమే పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలు ఘోరంగా పడిపోయాయి.

ప్రశ్నాపత్రం ఎలాగంటే..

విద్యా హక్కు చట్టం ప్రకారం ఏ తరగతిలో ఏం నేర్చుకోవాలో అభ్యసన సామర్థ్యాలను నిర్దేశించారు. ఆ ప్రకారం  తెలుగు, గణితం, ఆంగ్లంలో విద్యా సామర్థ్యాలను పరీక్షించేలా 3వ తరగతి స్థాయికి సమానమైన ప్రశ్నపత్రాన్ని ‘ఈనాడు’ రూపొందించింది. ప్రస్తుతం 3-6 తరగతులు చదువుతున్న పిల్లలకు దీన్ని అందజేసి పరీక్షించింది.

3వ తరగతి స్థాయి ప్రశ్నలకూ జవాబులు రాయలేని ఆరో తరగతి విద్యార్థులు

సర్వేలో ఇచ్చిన ప్రశ్నపత్రం మూడో తరగతి స్థాయిది. అందులో తెలుగులో ఇచ్చిన 15 బొమ్మల పేర్లు రాయాలి. ఆరు పదాలకు సొంత వాక్యాలు రాయాలి.. విచిత్రమేమిటంటే ప్రస్తుతం ఆరో తరగతిలోకి వచ్చిన విద్యార్థుల్లో సగం మంది కూడా ఆ ప్రశ్నలకు సరిగా సమాధానాలు రాయలేకపోయారు. ఆంగ్లం, గణితం సబ్జెక్టులోనూ అదే దుస్థితి.

మొత్తం 468 మంది ఆరో తరగతి పిల్లల్లో 159 (35%) మంది సరళ, గుణింత పదాలు, బొమ్మలు ఇస్తే చూసుకుంటూ రాయలేకపోయారు. పుస్తకం, గొడ్డలి, గొడుగు లాంటి వాటి పేర్లు కూడా తెలుగులో సరిగా రాయలేకపోతున్నారు. ఇదంతా ఆంగ్ల మాధ్యమ ప్రభావం అనుకోవడానికీ లేదు. ఎందుకంటే ఆంగ్లంలో పదాలు కూడా తప్పులు లేకుండా రాయలేనివారు 161 మంది. అంటే 34శాతం.

ఆంగ్లం సబ్జెక్టులో 10 బొమ్మలను చూసి స్పెల్లింగ్‌ తప్పులు లేకుండా పేర్లు రాయాలి. మరో విభాగంలో పండ్లు, కూరగాయల పేర్లు, నాలుగు అంకెలను ఆంగ్లంలో రాయాలి. పదాలు, వాక్యాలు, పేరాగ్రాఫ్‌ విభాగాల్లో తప్పులు లేకుండా రాయనివారు 405 మంది (87 శాతం) ఉన్నారని స్పష్టమైంది. ఆరో తరగతి విద్యార్థుల చదువే ఈ స్థాయిలో ఉంటే 4,5 తరగతుల పిల్లల పరిస్థితి ఊహించడం కష్టమేమీ కాదు.

చట్టం తెచ్చినా ప్రయోజనమేదీ?

కేంద్ర ప్రభుత్వం 2009లో విద్యా హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది. 6-14 ఏళ్లలోపు పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ విద్యను అందించాలన్నది దాని లక్ష్యం. 2017 ఫిబ్రవరిలో అందరికీ విద్య కాదు.. నాణ్యమైన విద్య అందాలంటూ చట్టానికి సవరణ చేశారు. తరగతులు, సబ్జెక్టుల వారీగా విద్యార్థులు ఏం నేర్చుకోవాలో నిర్దేశించారు. ఉపాధ్యాయులను జవాబుదారీ చేశారు. నాలుగున్నరేళ్లుగా గడిచినా పిల్లల అభ్యసన సామర్థ్యాలు ఏ మాత్రం మెరుగుపడకపోవడం గమనార్హం.

విద్యార్థులకు బట్టీపట్టడం అలవాటయిపోయిందని, ఫలితంగా విషయ పరిజ్ఞానం తగ్గుతోందని విద్యా రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్వేలో పాల్గొన్న విద్యార్థులు కనీస విద్యా స్థాయిని కూడా ప్రదర్శించకపోవడానికి ఇదీ ఓ కారణమే. అంతేకాక ప్రాథమిక పాఠశాల స్థాయిలో విద్యార్థుల అభ్యసన స్థాయికి తగ్గట్లు బోధన జరగడం లేదు. వీటిని సరిదిద్దితేనే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

తరగతికో ఉపాధ్యాయుడు తప్పనిసరి

- రమేష్‌ పట్నాయక్‌, కన్వీనర్‌, ఏపీ విద్యా పరిరక్షణ కమిటీ*

తగినంత మంది ఉపాధ్యాయులు లేకపోవడమూ విద్యాప్రమాణాలు పడిపోవడానికి కారణమే. రాష్ట్రంలో ఏకోపాధ్యాయ బడులు 8 వేలు. 15,227 బడుల్లో ఐదు తరగతుల బోధనకు ఇద్దరు, 6,227 పాఠశాలల్లో ముగ్గురు చొప్పున మాత్రమే టీచర్లు ఉన్నారు. ప్రాథమిక బడుల్లో 20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుణ్ని నియమించాలి. తరగతికో ఉపాధ్యాయుణ్ని నియమించాలంటే ఏటా ఖాళీలను భర్తీ చేయడం తప్పనిసరి. ప్రాథమిక స్థాయిలో చదవడం, రాయడం రాకపోతే పై తరగతుల్లో ఇబ్బందై, మధ్యలోనే చదువు మానేసే ప్రమాదం ఉంటుంది. అందుకే తరగతులే కాకుండా గ్రంథాలయం, ప్రయోగశాలల్లో గడిపేలా చూడాలి. 

బట్టీ విధానం మాన్పించాలి

- యజ్ఞమూర్తి శ్రీకాంత్‌, ప్రిన్సిపల్‌, మైసూరు ప్రాంతీయ విద్యా సంస్థ 

పిల్లలు పాఠాలను బట్టీ పడుతున్నారు. అందువల్లే పాఠ్యపుస్తకంలో నుంచి కాకుండా వేరే ప్రశ్నలిచ్చినా, ఒక ప్రశ్నను తిప్పి ఇచ్చినా రాయలేకపోతున్నారు. వీరికి బోర్డు పరీక్షల్లో అత్యధిక మార్కులు వస్తున్నా విషయ పరిజ్ఞానం ఉండటం లేదు. గణితం, సైన్సు సబ్జెక్టుల్లో ఇలాగే ఇబ్బందై చాలామంది హైస్కూల్‌కి వచ్చేసరికి బడి మానేస్తున్నారు. ప్రయోగాత్మకంగా పాఠాలు బోధిస్తూ.. పిల్లలకు బేసిక్స్‌ తప్పనిసరిగా వచ్చేలా చూడాలి. కొంత తరగతిలో, మరికొంత ఇంటి దగ్గర పిల్లవాడు చదువుకునేలా పాఠ్యప్రణాళిక ఉండాలి. ఉపాధ్యాయుల నియామకాల కంటే వారి సామర్థ్యాలను పెంచడంపై దృష్టి పెట్టాలి. వారికి ఏం అవసరమో గుర్తించి శిక్షణ ఇవ్వాలి.

రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 3-6 తరగతులు చదువుతున్న మొత్తం 1,592 మంది ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులను సర్వే చేశారు. వీరిలో 785 మంది బాలురు, 807 మంది బాలికలు ఉన్నారు. మొత్తం విద్యార్థుల్లో 608 మంది ప్రైవేటు పాఠశాల్లో విద్యనభ్యసిస్తున్నారు.

ఈనాడు, హైదరాబాద్‌, అమరావతి, న్యూస్‌టుడే బృందం

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Chaduvulu Chattubandalu"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0