Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Sanitation for teachers‌

ఉపాధ్యాయులకు శానిటైజేషన్‌ ‘శిక్ష'

Sanitation for teachers‌

  • నేడు గురుపూజోత్సవం
  • ఉపాధ్యాయులకు కొత్త పనులు
  • స్కూల్లో మరుగుదొడ్లు, వంట పాత్రల ఫొటోలు తీసి అప్‌లోడ్‌ చేయాలి
  • రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
  • మరోవైపు ‘ఉత్తమ’ అవార్డులు రద్దు
  • ఇతర కార్యక్రమాలకు లేనివిధంగా..గురుపూజోత్సవానికి కొవిడ్‌ నిబంధనలు
  • ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తి

 ఉపాధ్యాయ దినోత్సవం నాడు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు. చేయాల్సిన సత్కారం చేయలేదు. గురుపూజోత్సవం రోజు ఇవ్వాల్సిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను రద్దు చేశారు. కానీ చిత్రంగా అదేరోజు నుంచి ఉపాధ్యాయులందరికీ శానిటైజేషన్‌ విధులు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పాఠశాలల్లోని మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేలా చూడడం, వాటిని ఫొటోలు తీసి అప్‌లోడ్‌ చేయడం నుంచి.. మధ్యాహ్న భోజనం సమయంలో పాత్రలను ఫొటోలు తీయడం, అన్నం వడ్డించాక ఫొటోలు తీయడం, శుభ్రపరిచాక మళ్లీ ఫొటోలు తీయడం లాంటి పనులను ఉపాధ్యాయులే రొటేషన్‌ పద్ధతిలో చేయాలంటూ మెమో జారీచేసింది. ఇప్పటివరకు హెడ్‌మాస్టర్లు మాత్రమే ఈ పని చేసేవారు. వాస్తవానికి ఈ పని వారికి కూడా ఇబ్బందికరంగానే మారింది. హెడ్‌మాస్టరు మరుగుదొడ్ల దగ్గరకు వెళ్లి ఫొటోలు తీసి, మధ్యాహ్న భోజనం గిన్నెలు సరిగా కడిగారా? లేదా? అన్నది ఫొటోలు తీసి ప్రతిరోజు విద్యాశాఖ రూపొందించిన ఒక యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి.  అందరినీ సమన్వయం చేసుకుంటూ, పాఠశాలలో విద్యాబోధనను పరిశీలిస్తూ, తగు ప్రణాళికను సిద్ధం చేయాల్సిన హెడ్‌మాస్టర్‌కు ఇవే పనులు సరిపోతున్నాయని అంటున్నారు. ఈ పనులను ఎవరైనా సహాయకుడికి అప్పగించాలని గతం నుంచీ డిమాండ్‌ ఉంది. అయితే అలాంటి ఏర్పాటు చేయకుండా ఇప్పుడు ఈ బాధ్యతలను ఉపాధ్యాయులు రొటేషన్‌ పద్ధతిలో చేయాలంటూ పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు శనివారం ఉత్తర్వులిచ్చారు. దాదాపుగా ఉపాధ్యాయ దినోత్సవం రోజు నుంచే ఇది అమల్లోకి రానుండడం గమనార్హం. దీనిపై పలువురు ఉద్యోగుల్లో అసృంతృప్తి వ్యక్తమవుతోంది. 

వాటికి లేని అభ్యంతరం ‘వేడుక’కు ఎందుకు?

ఏటా సెప్టెంబరు 5న గురుపూజోత్సవం నిర్వహిస్తారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి ఆ రోజు వారిని సత్కరించడం, మెమెంటోలు ఇవ్వడం ఏటా జరుగుతుంది. కానీ ఈ ఏడాది కొవిడ్‌ కారణం చూపి ఆ కార్యక్రమాన్ని రద్దు చేశారు. దీనిపైనా పలు విమర్శలు వస్తున్నాయి. పాఠశాలలు జరుగుతున్నాయి. ఆగస్టు 15వ తేదీన కార్యక్రమాలు జరిగాయి. పాఠశాలల్లో తల్లిదండ్రుల కమిటీకి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నప్పుడు ఉపాధ్యాయ దినోత్సవం మాత్రం ఎందుకు రద్దుచేశారని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఇబ్బందికరం అనుకుంటే.. వర్చువల్‌ పద్ధతిలో అయినా ఈ కార్యక్రమం నిర్వహించవచ్చు. ముఖ్యమంత్రి ఆ కార్యక్రమంలో పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారందరినీ అభినందించవచ్చు. మెమెంటోలను ఆ తర్వాత అధికారులతో పంపించి సత్కారం చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఆన్‌లైన్‌ ద్వారా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించి ఉపాధ్యాయులను గౌరవిస్తోంది. ఈ ఏడాది కూడా ఆన్‌లైన్‌లో అవార్డులు ఇచ్చి ఉపాధ్యాయులను గౌరవించింది. ఆ పద్ధతిలోనే ఇక్కడా చేసే అవకాశం ఉంది. అయితే ఇందులో ఏ పద్ధతినీ విద్యాశాఖ పరిగణనలోకి తీసుకోకుండా మొత్తానికి కార్యక్రమాన్ని రద్దుచేయడం, అవార్డులు ఇవ్వకుండా ఉండడం సరికాదని అంటున్నారు. 

ఆనందం ఆవిరి... స్ఫూర్తికి విఘాతం

ప్రతి ఏటా ఆగస్టు 15వ తేదీకల్లా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానించి.. సెప్టెంబరు ఒకటో తేదీ నాటికి ప్రక్రియ పూర్తిచేసి ప్రకటన చేస్తారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారు తాము నిబద్దతతో చేసిన సేవకు దక్కిన గౌరవంగా దీన్ని భావిస్తుంటారు. ఈ ఏడాది దరఖాస్తులనే కొంత ఆలస్యంగా పిలిచారు. జిల్లా స్థాయిలో డీఈవోలు వీటిని స్ర్కూటినీ చేశారు. కొన్నిచోట్ల తుది ఎంపిక కూడా పూర్తయింది. తుది ఎంపిక పూర్తయిన చోట్ల ఆయా ఉపాధ్యాయులు తమ బంధుమిత్రులకు ఆనందంగా చెప్పుకున్నారు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యామని, ఐదో తేదీన సత్కారం చేస్తారని సంతోషం పంచుకున్నారు. కానీ ఇప్పుడు హఠాత్తుగా రద్దయ్యేసరికి వారి ఆనందం ఆవిరైంది. ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన వారే కాకుండా... వారిలా అవార్డు తెచ్చుకోవాలన్న తపనతో కష్టపడి పనిచేయాలనే స్ఫూర్తినీ దెబ్బతీసింది. ప్రతి జిల్లాకు ఆరుగురు నుంచి 10 మంది వరకు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులకు ఎంపిక చేస్తారు. అంటే 13 జిల్లాలు కలిపినా 125 మంది కంటే ఎక్కువ ఉండరు. వారికి సామాజిక దూరం పాటిస్తూ వేడుక చేసేంత స్టేడియాలు, ఫంక్షన్‌ హాళ్లు చాలా ఉన్నాయని అంటున్నారు. మరోవైపు జిల్లాల్లో ఇచ్చే అవార్డులను కూడా రద్దు చేశారు. రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి అవార్డులు రెంటినీ రద్దు చేసేశారు. 

అక్టోబరు 5న అయినా ఇవ్వండి.

ప్రభుత్వం ఉపాధ్యాయ దినోత్సవ నిర్వహణ, ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ఇవ్వడంపై ఇప్పటికైనా ఆలోచించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. మరోవైపు అక్టోబరు 5వ తేదీన అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం అని... ఆ రోజైనా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందించాలని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక (ఫోర్టో) గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, చైర్మన్‌ కరణం హరికృష్ణ డిమాండ్‌ చేశారు.

వేడుకలు రద్దు చేయడం తగదు.

సమాజ నిర్మాతల ఉత్సవాన్ని నీరు కార్చవద్దని, ఉపాధ్యాయ దినోత్సవాన్ని రద్దు చేయవద్దని ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ సెక్రటరీ జనరల్‌ అరవపాల్‌ అన్నారు. కొవిడ్‌ పేరుతో హఠాత్తుగా గురుపూజోత్సవం కార్యక్రమం, అవార్డుల ప్రధాన ప్రక్రియను రద్దు చేయడం తగదన్నారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజున వివిధ డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగులకు అవార్డులు అందజేశారని గుర్తు చేశారు. అప్పుడు లేని కొవిడ్‌ నిబంధనలు ఇప్పుడు ఎలా వచ్చాయనే అభిప్రాయాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారన్నారు. ఉద్యోగుల ఆవేదనను అర్థం చేసుకుని కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించాలని కోరారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Sanitation for teachers‌"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0