Another 3 per cent DA hike soon for central employees.
కేంద్ర ఉద్యోగులకు త్వరలో మరో 3శాతం డీఏ పెంపు.
- 2021 జూలై నెలకు సంబంధించిన డీఏపై త్వరలో నిర్ణయం
- ఇప్పటికే 11శాతం పెంపుతో 28శాతానికి చేరిన కరవు భత్యం
- జులైలో పెరిగిన జీతం అందుకున్న ఉద్యోగులు
- మరో 3శాతం పెరిగితే 31శాతానికి డీఏ
- కేంద్రం డీఏకు అనుగుణంగా ఆరు రాష్ట్రాల్లోనూ పెంపు
- నిరాశలో ఏపీ ఉద్యోగులు పెండింగ్ లో నాలుగు డీఏ లు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మొత్తం డీఏ 28శాతానికి చేరింది. వారు ఆ మేరకు పెరిగిన జీతాన్ని జులై నెలకు అందుకున్నారు. కేంద్రంతో పాటు మరో ఆరు రాష్ట్రాలూ డీఏను పెంచిన నేపథ్యంలో ఏపీ ఉద్యోగులు తమ డీఏ బకాయిలు ఎప్పుడు అందుతాయా అని ఎదురు చూస్తున్నారు. నాలుగు డీఏల బకాయిలు ఇంకా ప్రకటించకపోవడంతో వారు నైరాశ్యంలో ఉన్నారు. 2020-జనవరి, 2020-జూన్, 2021-జనవరి, 2021-జూన్ డీఏలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించలేదు. 2019-జనవరి, 2019-జూన్ డీఏలను మాత్రం మంజూరు చేసింది. వీటి పెంపు ప్రస్తుతం జీతంలో కనిపిస్తున్నా ఈ రెండు డీఏల బకాయిలు మాత్రం అందలేదు.
వాస్తవానికి కేంద్ర ఉద్యోగులకు 2020 జనవరి లో డియర్‌నెస్ అలవెన్స్ 4 శాతం పెరిగింది. 2020 జూన్ లో 3 శాతం, 2021 జనవరిలో 4 శాతం పెరిగింది. అంటే, ఈ మూడు విడతల్లో డీఏ మొత్తం 11 శాతం పెరిగింది. అయితే గత 18 నెలలుగా కేంద్రం డీఏను నిలిపేసిన సంగతి తెలిసిందే. డీఏ పునరుద్ధరించనున్నట్లు జులై 14 న జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. జులై 1 నుంచి అమలు చేసేలా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ 11శాతం పెంపుతో డీఏ 28%కి చేరుకుంది. జనవరి నుంచి జూన్ వరకు వినియోగదారుల ధరల సూచీ ప్రకారం చూస్తే డీఏలో మరో 3% పెరుగుదల ఉండాలి. ఇప్పుడు, జూన్‌లో 3 శాతం పెరుగుదల ఉంటే, డియర్‌నెస్ అలవెన్స్ 31 శాతానికి చేరుకుంటుంది (17+4+3+4+3). దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో ఇంకా పెరుగుదల కనిపిస్తుంది. 3% డీఏ పెంపును ప్రభుత్వం అతి త్వరలో ఆమోదిస్తుందని, త్వరలో దీనికి సంబంధించి ప్రకటన వెలువడుతుందని బలంగా వినిపిస్తోంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జులై 1 నుంచి డీఏ 28శాతానికి పెంచిన నేపథ్యంలో వారు జులై లో పెరిగిన జీతాన్ని అందుకున్నారు. తాజా పెంపుతో దాదాపు 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పింఛనుదార్లు లబ్ధి పొందనున్నారు.
కేంద్ర ఉద్యోగులు పెరిగిన డీఏతో పాటు హెచ్ఆర్ఏను కూడా అందుకున్నారు. వారు నివసించే నగరం ఆధారంగా హెచ్ఆర్ఏ పొందారు. నగరాలను మూడు కేటగిరీలుగా విభజించారు. వీటికి X, Y, Z అని పేరు పెట్టారు. ఇప్పుడు X నగరంలో నివసిస్తున్న కేంద్ర ఉద్యోగికి 27%, Y నగరంలో ఉండే వారికి 18%, Z నగరంలో నివసించే వారికి 9% హెచ్ఆర్ఏ ఇచ్చారు.
మూల వేతనంపై డీఏను లెక్కిస్తారు. 7 వ పే మ్యాట్రిక్స్ ప్రకారం, ఆఫీసర్ గ్రేడ్ ఉద్యోగుల జీతంలో ఎక్కువ పెరుగుదల ఉంటుంది.
ఉదాహరణకు, మూలవేతనం ప్రస్తుతం రూ. 31,550 అయితే...
మూల వేతనం రూ. 31,550
కొత్త డీఏ (28%) రూ. 8,834
పాత డీఏ (17%) రూ. 5364
పెరుగుదల రూ.8834-రూ.5364 = రూ .3,490
ఇది డీఏలో పెరుగుదల మాత్రమే. మొత్తం జీతంలో, హెచ్ఆర్ఏ, ప్రయాణ భత్యం కూడా కలుస్తాయి.
కేంద్రం డీఏను పెంచిన నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు కూడా డీఏను పెంచాయి.
ఉత్తర్ ప్రదేశ్: డీఏ 28 శాతానికి పెంచుతున్నట్లు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో దాదాపు 16 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 12 లక్షల మంది పింఛనుదార్లకు ప్రయోజనం చేకూరుతుంది.
జమ్మూ కశ్మీర్: జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం డీఏను 17 శాతం పెంచింది. దీంతో అక్కడ డీఏ 28 శాతానికి చేరింది. ఈ మార్పు జులై1 నుంచే అమలులోకి వచ్చింది.
ఝార్ఖండ్: ఝార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా డీఏను 17 శాతం పెంచడంతో 28శాతానికి చేరింది. జులై 1 నుంచి అమలులోకి వచ్చింది.
హరియాణా: హరియాణాలోనూ డీఏను 17 శాతం పెంచడంతో 28శాతానికి చేరింది. ఇందులో జనవరి 1-2020, జులై 1-2020 , జనవరి 1- 2021కు సంబంధించిన అదనపు వాయిదాలూ ఉన్నాయి.
పెంపు జులై 1 నుంచి అమలులోకి వచ్చింది
కర్ణాటక:కర్ణాటక ప్రభుత్వం డీఏ అదనపు వాయిదాలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ వాయిదాలు 2020, జనవరి నుంచి 2021 జూన్ వరకు వర్తిస్తాయి. దీంతో డీఏ ప్రస్తుతమున్న 11.25 నుంచి 21.5శాతానికి చేరుతుంది. కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం డీఏను గతంలో స్తంభింపజేసింది.
రాజస్థాన్: రాజస్థాన్ ప్రభుత్వం కూడా డీఏను 17శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో ఆ రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగుల డీఏ కూడా 28శాతానికి చేరింది.
0 Response to "Another 3 per cent DA hike soon for central employees."
Post a Comment