Covers on PRC report
ఉద్యోగులతో బంతాట!
- పీఆర్‌సీ నివేదికపై దాగుడుమూతలు
- ఇస్తామని సీఎస్ చెప్పారు.
- ఏమిటీ కొత్త సంప్రదాయం?
రాష్ట్రప్రభుత్వం ఉద్యోగులతో బంతాట ఆడుకుంటోంది. పీఆర్‌సీ నివేదికపై కాలయాపన చేస్తూ.. 13 లక్షల మంది ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోంది. మాజీ ఐఏఎస్ అధికారి అశుతోష్ మిశ్రా ఆధ్వర్యంలోని 11వ వేతన సవరణ సంఘం సిఫారసులపై అధ్యయనానికి ఏర్పాటైన సీఎస్ కమిటీ అధ్యయనం చేసి.. నివేదిక ఇస్తే.. దాని ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని శుక్రవారం జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో తేల్చేసింది. సీఎస్ చైర్మన్‌గా.. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్ కన్వీనర్‌గా.. రెవెన్యూ, జీఏడీ కార్యదర్శులు సభ్యులుగా.. సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం ప్రత్యేక ఆహ్వానితుడిగా ఈ ఏడాది ఏప్రిల్ 1న ఈ అధ్యయన కమిటీని నియమించింది.కానీ ఈ కమిటీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. ఉద్యోగ సంఘాలతోనూ చర్చించలేదు. అసలు ఆ కమిటీ ఉందన్న సంగతి అందరూ మరచిపోయారు. కానీ శుక్రవారం ఉన్నతాధికారులు హఠాత్తుగా తెరపైకి తెచ్చారు. ఆ కమిటీ ఇంకా నివేదిక ఇవ్వలేదని.. త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తుందని.. ఉద్యోగులతో కూడా భేటీ అవుతుందని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉన్నతాధికారులు సెలవిచ్చారు. కమిటీ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం పీఆర్‌సీపై నిర్ణయం తీసుకుంటుందని ఆర్థిక, జీఏడీ ముఖ్య కార్యదర్శులు రావత్, శశిభూషణ్ స్పష్టం చేసినట్లు తెలిసింది. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అంతేకాదు.. సదరు భేటీ అజెండా నుంచి పీఆర్‌సీ నివేదిక, పీఆర్‌సీ అంశం లేకుండా పోయాయు. ఇదిగో పీఆర్‌సీ.. అదిగో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ వేశాం. ఈ నెలాఖరుకు ఇస్తాం.. ఈ నెలలో ఇస్తామని ఊరిస్తూ ప్రభుత్వ పెద్దలు ఇన్నాళ్లు ఉద్యోగ సంఘాలకు చెప్పిన మాటలన్నీ నీటి మూటలేనని వారు మండిపడుతున్నారు.
ఇస్తామని సీఎస్ చెప్పారు.
గత నెల 29న జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీలో.. 2-3 రోజుల్లో సంఘాలకు పీఆర్‌సీ నివేదిక ఇస్తామని సీఎస్ చెప్పారు. అనంతరం దీపావళి తర్వాత ఇస్తామన్నారు. ఇప్పుడిది అధ్యయన కమిటీ తేల్చాలని ఉన్నతాధికారులు ఎలా ప్రకటిస్తారు? నిజంగా కమిటీ తేల్చాల్సి ఉంటే సీఎస్ ఆ రోజు ఎందుకు చెప్పలేదని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. అంటే పీఆర్‌సీ నివేదికను ఉద్యోగులకు ఇవ్వడం ప్రభుత్వానికి ఇష్టం లేక.. ఇంకా కాలయాపన చేసే ఉద్దేశంతోనే కమిటీని తెరపైకి తెచ్చిందన్న అనుమానాలు ఉద్యోగుల్లో బలంగా వ్యక్తమవుతున్నాయి. పీఆర్‌సీ నివేదిక ఇస్తారని తాము ఎదురు చూస్తుంటే.. ఇప్పుడు మళ్లీ కమిటీ పేరుతో కాలయాపన చేస్తే.. ఇక నివేదిక ఈ బడ్జెట్ సమావేశాల్లో అందదని.. వచ్చే బడ్జెట్ సమావేశాలకే వస్తుందని ఒక ఉద్యోగ సంఘం నాయకులు నిలదీయగా.. అధ్యయన కమిటీని వేసినప్పుడు ఎందుకు అడగలేదని ఉన్నతాధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. ఎప్పుడూ చూడని విచిత్ర పరిస్థితి చూస్తున్నామని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ పీఆర్‌సీ వేసే సమయం వస్తోందని, ఇన్నేళ్ల కాలయాపన తర్వాత ఇంకా జాప్యం చేయడానికే ప్రభుత్వం ఇలాంటివి చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఏమిటీ కొత్త సంప్రదాయం?
వేతన సవరణ సిఫారసులు చేయడానికి కమిషన్ ఏర్పాటు చేశాక.. దాని నివేదికను మంత్రివర్గంలో చర్చించి.. సంఘాల అభిప్రాయాలు తీసుకుని ప్రభుత్వం దానిని యథాతథంగా అమలు చేయడమో లేక మార్పులు చేర్పులు చేయడమో జరిగేదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. జగన్ ప్రభుత్వం అధ్యయనం పేరుతో కమిటీ వేసి కొత్త సంప్రదాయానికి తెరతీసిందని మండిపడుతున్నారు. పీఆర్‌సీ నివేదిపై డ్రామాలాడుతోందని, తమ రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందని మండిపడుతున్నారు.
0 Response to "Covers on PRC report"
Post a Comment