CS Committee proposals to give the best package: Sajjalarama Krishnareddy
అత్యుత్తమ ప్యాకేజీ ఇచ్చేలా సీఎస్ కమిటీ ప్రతిపాదనలు: సజ్జలరామ కృష్ణారెడ్డి
అమరావతి: ఉద్యోగ సంఘాల నేతలతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చలు ముగిశాయి. ఉద్యోగులు ఎంత పీఆర్‌సీ ఆశిస్తున్నారనే విషయంపై నేతలతో చర్చించారు. ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం చర్చించే అవకాశం ఉందని ఈ సందర్భంగా సజ్జల తెలిపారు. ఉద్యోగులకు ఇప్పటికే 27 శాతం ఐఆర్ ఇస్తున్నామని.. 14.29 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వడం వల్ల ఉద్యోగులకు ఎలాంటి నష్టం ఉండదన్నారు. 14.29 శాతం ఫిట్‌మెంట్ వల్ల ఐఆర్ కంటే రూపాయి కూడా తగ్గదని.. ఎక్కువగానే లబ్ధి ఉంటుందని స్పష్టం చేశారు. ఉద్యోగులు కోరే 45 శాతం సాధ్యం కాదని కమిటీ చెప్పిందన్నారు. కరోనాతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా దిగజారిందని ఆందోళన వ్యక్తం చేశారు. అయినా అత్యుత్తమ ప్యాకేజీ ఇచ్చేలా సీఎస్ కమిటీ ప్రతిపాదనలు చేసిందని పేర్కొన్నారు. సీఎస్ కమిటీ సిఫార్సు చేసిన ఫిట్‌మెంట్‌ను పెంచే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పీఆర్‌సీ అమలుకు ఏడెనిమిదేళ్లు పడుతోందని.. సెంట్రల్ పే కమిషన్ ప్రకారం పదేళ్లకు ఒకసారి ఇచ్చినా నష్టం ఉండదన్నారు. సీపీఎస్ రద్దుపై సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారని సజ్జల గుర్తు చేశారు. దీనిపై కమిటీలు అధ్యయనం చేస్తున్నాయని.. త్వరలోనే సీపీఎస్‌పై స్పష్టం వస్తుందని సజ్జల తెలిపారు.
నివేదిక ఆమోదయోగ్యంగా లేదు: ఐకాస నేత బండి శ్రీనివాస్
‘‘సీఎస్ కమిటీ నివేదిక మాకు ఆమోదయోగ్యం కాదని చెప్పాం. నిన్న ఇచ్చిన నివేదికతో రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. నివేదికపై మా అభిప్రాయాలను సజ్జలకు వివరించాం. సీఎస్ కమిటీ నివేదికపై ఉద్యోగుల్లో భయాందోళన నెలకొంది. సీఎం న్యాయం చేస్తారని మాకు నమ్మకం ఉంది. ఐఏఎస్‌లు ఇచ్చిన నివేదికను పరిగణించవద్దని సీఎంను కోరుతున్నాం. 2018 జులై నుంచి 55 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని సజ్జలను కోరాం’’ అని పేర్కొన్నారు.
ఆశించినట్లు సిఫార్సులు లేవు: వెంకట్రామిరెడ్డి
‘‘ఉద్యోగులు ఆశించినట్లు కమిటీ సిఫార్సులు లేవు. మెజారిటీ ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. రేపు సీఎంతో ఉద్యోగ సంఘాల నేతల చర్చలు ఉంటాయని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు’’ అని తెలిపారు.
0 Response to "CS Committee proposals to give the best package: Sajjalarama Krishnareddy"
Post a Comment