Kovishield and Kovaggin vaccines should not be given as a third dose! List of booster dose vaccines and their details.
కొవిషీల్డ్ , కొవాగ్జిన్ టీకాలు మూడో డోసుగా వేయరు ! బూస్టర్ డోసు వ్యాక్సిన్ల లిస్టు వాటి వివరాలు.
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్(Omicron Variant) విజృంభిస్తుండటంతో దేశవ్యాప్తంగా అదనపు డోసు(Additional Dose) గురించిన చర్చ మొదలైంది. ప్రతిపక్షాలూ బూస్టర్ డోసు వేయాలనే డిమాండ్ బలంగా వినిపించాయి.
టీకా పంపిణీకి కీలక సలహాలు, సూచనలు చేసే నిపుణుల కమిటీకి మూడో డోసుపై ఓ ఏకాభిప్రాయం ఏర్పడిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇది వరకే వేసుకున్న రెండు డోసుల టీకా కాకుండా.. మరో టీకానే మూడో డోసుగా వేయాలనే ఆలోచనలో నిపుణుల కమిటీ ఉన్నదని వివరించాయి. అంటే.. మన దేశంలో ఎక్కువ మందికి కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు వేశారు. మూడో డోసుగా మళ్లీ అవే టీకాలు వేయబోరన్నమాట. కొవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్న లబ్దిదారుడికి మూడో డోసుగా కొవిషీల్డ్ టీకానే వేయబోరు. వేరే టీకా వేసే ఆలోచనపై నిపుణుల కమిటీ సానుకూలంగా ఉన్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ ఆలోచన ఆధారంగానే మూడో డోసులుగా కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు వేయబోరనే విషయం స్పష్టం అవుతున్నదని వివరించాయి.
మూడో డోసు కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర పలు అవకాశాలు ఉన్నాయి. అన్నింటి కంటే ముందుగా హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఈ అభివృద్ధి చేసిన ప్రోటీన్ సబ్ యూనిట్ వ్యాక్సిన.. కోర్బ్‌వ్యాక్స్‌ను థర్డ్ డోసుగా వేసే అవకాశాలు ఉన్నాయి. క్రియారహితమైన వైరస్ మొత్తం కణానికి బదులుగా వైరస్‌లోని యాంటిజెనిక్ పార్ట్‌ను మాత్రమే ఈ టీకా కలిగి ఉండనుంది. ఈ టీకా కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 1,500 కోట్ల అడ్వాన్స్ కూడా ఇచ్చింది. ఈ అడ్వాన్స్‌తో 30 కోట్ల డోసులను బుక్ చేసింది. వచ్చే రెండు వారాల్లో కోర్బ్‌వ్యాక్స్ ప్రభుత్వం నుంచి అత్యవసర వినియోగ అనుమతులను పొందనున్నట్టు సమాచారం.
కాగా, దీనితోపాటు మరికొన్ని టీకాలు థర్డ్ డోసుగా కేంద్రం ఎంచుకుని పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయి. జాబితాలో సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన కోవోవాక్స్ కూడా ఉంది. యూఎస్‌కు చెందిన నోవావాక్స్, సీరం సంయుక్తంగా ఈ టీకాను అందుబాటులోకి తెచ్చాయి. ఫిలిప్పీన్స్‌లో ఈ టీకాకు ఇప్పటికే అత్యవసర అనుమతులు దక్కాయి. కొవిషీల్డ్ టీకాను అందుబాటులోకి తెచ్చింది కూడా ఈ సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థనే కావడం గమనార్హం.
కొవాగ్జిన్ అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్‌కు చెందిన ఇంట్రా నాసల్ వ్యాక్సిన్‌నూ కేంద్రం మూడో డోసుగా ఎంపిక చేసుకోవచ్చు. జనవరి ద్వితీయార్థంలో ఈ టీకా అందుబాటులోకి రానుంది. కాగా, మూడో డోసు టీకాల జాబితాలో పూణెకు చెందిన జెన్నోవా బయోఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన ఎంఆర్ఎన్‌ఏ వ్యాక్సిన్ ఉన్నది. ఈ టీకాను జెన్నోవా ఆరు కోట్లు ఉత్పత్తి చేయనున్నట్టు తెలిసింది. సాధారణంగా మూడో డోసుగా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ వేయాలనే అభిప్రాయం నిపుణుల్లో ఉన్నది. అయితే, ఫైజర్, మొడెర్నాలకు భిన్నంగా జెన్నోవా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్‌ను 2-8 డిగ్రీల దగ్గర నిల్వ చేసుకోవచ్చు.
0 Response to "Kovishield and Kovaggin vaccines should not be given as a third dose! List of booster dose vaccines and their details."
Post a Comment