Unfamiliar panchayat on PRC .. Incomplete negotiations
PRC పై తేలని పంచాయితీ.. అసంపూర్తిగా ముగిసిన చర్చలు
అమరావతి: పీఆర్సీపై ఏపీ సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం సమావేశమైంది. ఆర్థికశాఖ అధికారులు శశిభూషణ్ కుమార్, సత్యనారాయణల నేతృత్వంలో విడతల వారీగా ఉద్యోగ సంఘాలతో పీఆర్సీ సహా ఆర్థిక అంశాలపై చర్చించారు. తొలుత ఏపీ ఎన్జీఓ, ఏపీ రెవెన్యూ తదితర సంఘాలతో అధికారులు సమావేశమై ప్రభుత్వ ప్రతిపాదనలు వారి ముందు ఉంచారు. ప్రస్తుతం 27 శాతం ఐఆర్ ఇస్తున్నందున కొద్దిమేర పెంచి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశాలు జారీచేశారని పేర్కొన్నారు. కొత్తగా రూపొందించిన ప్రతిపాదనలను ఉద్యోగ సంఘాలకు వివరించారు.
సమావేశం ముగిసిన తర్వాత ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ... అధికారుల తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ‘‘వారం పది రోజుల్లో పీఆర్‌సీ ఇస్తామని సీఎం తిరుపతిలో చెప్పారు. ఇవ్వలేదు. ఆ తర్వాత 72గంటల్లో ప్రకటిస్తామన్నారు... అదీ లేదు. ఇవాళ సమావేశానికి పిలిచి పీఆర్‌సీ ఎంత ఇస్తారో చెప్పకుండా ఆర్థిక పరమైన అంశాలు వివరిస్తున్నారు. చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్ప... ఫలితం ఉండటంలేదు’’ అని ఏపీ జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసులు పేర్కొన్నారు. జనవరి 3న జరిగే జేఏసీ సమావేశంలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఉద్యోగులను అవమానించడానికి సమావేశాలు నిర్వహిస్తున్నారు తప్ప ఉపయోగం లేదని అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ‘‘ఈరోజు చెబుతున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి. రాష్ట్రంలో వచ్చే ఆదాయంలో రూ.75వేల కోట్లు ఉద్యోగుల కోసమే ఖర్చు చేస్తున్నామంటున్నారు. 2013 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎక్కడా తగ్గలేదు. ఉద్యోగుల కోసం 32శాతం ఖర్చు పెడుతూ.. రాష్ట్ర బడ్జెట్ మొత్తం ఖర్చు చేస్తున్నామని చెప్పడం సత్యదూరం. చర్చలకు ఎందుకు పిలిచారని అడిగితే .. ఫిట్‌మెంట్ గురించి మాట్లాడటానికని చెప్పారు. ఫిట్‌మెంట్ ఎంత ఇస్తారంటే మళ్లీ మొదటికొచ్చారు. సీఎం వద్దకు వారం రోజుల్లో తీసుకెళ్తామని ఇప్పటి వరకు పట్టించుకోలేదు. గతంలోనే ఎక్కువ జీతం తీసుకున్నారు.. దానికి తగ్గకుండా ఇస్తామని చెబుతున్నారు. ఇది అన్యాయం’’ అని బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆగ్రహం వక్తం చేశారు.
0 Response to "Unfamiliar panchayat on PRC .. Incomplete negotiations"
Post a Comment