Banks Home Loan Grant Process.
బ్యాంకుల ఇంటి రుణం మంజూరు ప్రక్రియ.
ప్రతి ఒక్కరికి సొంత ఇంటిలో నివసించాలని కోరిక ఉంటుంది. అయితే ఇంటిని సొంతం చేసుకోడానికి తగినన్ని నిధులు ఎవరికైనా అవసరమే.
రెసిడెన్షియల్ ప్రాపర్టీని కొనుగోలు చేయడానికి ఇంటి రుణం తీసుకోవాలనుకుంటే రుణ మొత్తాన్ని అందచేసే ముందు బ్యాంకులు, రుణ సంస్థలు అనుసరించే ఒక సాధారణ ప్రక్రియ ఉంది. ఇల్లు గాని, అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ గాని కొనుగోలు చేయాలనుకుంటే ఇంటి విలువ పూర్తిగా తెలుసుకున్నాక రుణ ధరఖాస్తుదారు ముందుగా ధరఖాస్తును బ్యాంకుకు పంపాలి. రుణాన్ని ఆమోదించాలా వద్దా అని బ్యాంకు నిర్ణయిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేసిన తర్వాత, అలాగే డాక్యుమెంట్‌లను క్షుణంగా తనిఖీ చేసిన తర్వాత, బ్యాంకు ధరఖాస్తుదారునికి ఆమోద నోటిఫికేషన్‌ను పంపుతుంది. అలాగే బ్యాంకు రుణాలను ఆమోదించే ముందు రుణగ్రహీత ఆదాయం, సిబిల్ స్కోర్‌ను తనిఖీ చేస్తుంది.
మంజూరు ప్రక్రియః
రుణగ్రహీత ఆదాయం, క్రెడిట్ రిపోర్ట్, ఇంటి గ్రౌండ్ రిపోర్ట్‌ని బట్టి బ్యాంకు రుణాన్ని అందచేస్తుంది. రుణం మంజూరు చేయబడితే, బ్యాంకు ద్వారా మంజూరు చేయబడే నిర్దిష్ట మొత్తంలో రుణాన్ని పొందవచ్చు. రుణగ్రహీతలకు ఆస్తి విలువలో 80% వరకు రుణాన్ని బ్యాంకు ఆమోదిస్తుంది. వినియోగదారు వద్ద ఎక్కువ డౌన్ పేమెంట్ మొత్తం ఉంటే రుణం ఇంకా తగ్గించి కూడా తీసుకోవచ్చు. రుణ మంజూరు తర్వాత రుణ గ్రహీత ఆస్తి కొనుగోలుకి ముందుకి వెళ్లవచ్చు. బ్యాంక్ రుణాన్ని ఆమోదించిన తర్వాత, ఫ్లాట్ బుకింగ్‌ని నిర్ధారించడానికి రియల్ ఎస్టేట్ డెవలపర్‌కు చూపించాల్సిన మంజూరు లేఖను బ్యాంక్ అందిస్తుంది. తర్వాత ధరఖాస్తుదారు డౌన్ పేమెంట్‌తో ముందుకు సాగవచ్చు. రుణ మంజూరు ప్రక్రియలో ఇంటి నిర్మాణం బట్టి రుణగ్రహీత వాయిదాల వారీగా నిధులను అందుకుంటారు. పునఃవిక్రయ ఆస్తి అయితే బ్యాంకు పూర్తి రుణ మొత్తాన్ని ఒకేసారి అందచేస్తుంది. పునఃవిక్రయ ఆస్తి విషయంలో బ్యాంకు రుణ గ్రహీత ఖాతాలో మొత్తం జమ చేస్తుంది. అయితే కొత్త నిర్మాణ ఆస్తి విషయంలో బ్యాంకు ఒప్పందం, నిర్మాణ పనుల ప్రకారం బిల్డర్‌కు వాయిదాల మొత్తంలో చెల్లిస్తుంది.
రుణ పంపిణీకి ప్రతిపాదిత ఆస్తికి సంబంధించిన ఆస్తి పత్రాలు, ఆస్తి అంచనా వ్యయం కూడా అవసరం. ఫార్మాలిటీలు పూర్తయిన తర్వాత బ్యాంకు రుణగ్రహీత రుణాన్ని మంజూరు చేసి అతని ఖాతాలో రుణ మొత్తాన్ని వేస్తుంది. బ్యాంకు రుణాన్ని పంపిణీ చేసిన తర్వాత `ఈఎంఐ` వసూలును ప్రారంభిస్తుంది. వసూలు చేయబడే ఈఎంఐలు రుణగ్రహీతలు సకాలంలో చెల్లించాలి. కొత్త నిర్మాణ ఆస్తి కోసం అలాగే పునఃవిక్రయ ఆస్తి కోసం ఏ బ్యాంక్ దగ్గర నుండి అయినా రుణాలు తీసుకోవచ్చు. ప్రైవేట్ బ్యాంకులు, కో-ఆపరేటివ్ బ్యాంకులు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎన్‌బీఎప్‌సీలలో కూడా ఇంటి రుణాలు తీసుకోవచ్చు. ఈ ఇంటి రుణాలు గరిష్టంగా 30 ఏళ్ల కాల పరిమితి వరకు ఇవ్వబడతాయి. ప్రస్తుతం రుణాల వడ్డీ రేట్లు సంవత్సరానికి 6.40-12% పరిధిలో ఉన్నాయి. పెనాల్టీ విధించకుండా ఉండటానికి రుణ గ్రహీత తీసుకున్న రుణాలను సకాలంలో ఈఎంఐలు తిరిగి చెల్లించాలి. ఈఎంఐలు చెల్లించడంలో ఎక్కువ సార్లు డిఫాల్ట్ అయితే బ్యాంకులు నోటీసులు ఇచ్చిన పిదప ఇంటిని బ్యాంకు ద్వారా వేలం వేయడం జరుగుతుంది. అలాంటి పరిస్థితులు వస్తే రుణగ్రహీత డౌన్ పేమెంట్‌ని కూడా నష్టపోయే ప్రమాదం లేకపోలేదు.
0 Response to "Banks Home Loan Grant Process."
Post a Comment