This PRC is not acceptable
ఈ పీఆర్సీ ఆమోదయోగ్యం కాదు
- సీఎం దీనిపై పునస్సమీక్షించాలి
- ఫిట్‌మెంట్ కనీసం 30 శాతమైనా ఉండాలి
- సీఎస్‌కు వినతిపత్రం అందజేసిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం
ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ ఆమోదయోగ్యం కాదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం స్పష్టం చేసింది. పలు దఫాలు ఉద్యోగ సంఘాలతో చర్చించినా ఉద్యోగులకు మేలు జరిగేలా నిర్ణయాలు లేవని అసంతృప్తి వ్యక్తం చేసింది. మూడేళ్లకుపైగా ఎదురుచూస్తున్న 11వ పీఆర్సీలో భాగంగా ప్రభుత్వం నిర్ణయించిన ఫిట్‌మెంట్, ఉద్యోగులకు కల్పిస్తున్న ఆర్థిక ప్రయోజనాలపై అసమ్మతి తెలియజేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో అన్ని తరగతుల ఉద్యోగులు ప్రభుత్వ ప్రకటనను తిరస్కరిస్తున్నారని, దీని ప్రకారం వేతన సవరణ జరిగితే న్యాయమైన ఆర్థిక ప్రయోజనాలకు నష్టం కలుగుతుందని పేర్కొంది. సీఎం దీనిపై పునస్సమీక్షించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం అధ్యక్షులు కె.ఆర్.సూర్యనారాయణ, కార్యదర్శి జి.భాస్కరరావు బుధవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి వినతిపత్రం అందజేశారు.
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం డిమాండ్లు ఇవీ.
- అశుతోష్ మిశ్రా పీఆర్సీ నివేదికను ఉద్యోగ సంఘాలకు అందజేయాలి.
- 2010లో పీఆర్సీ సిఫార్సులో ఫిట్‌మెంట్ 27 శాతం ఉంటే ప్రభుత్వం 39 శాతం ప్రకటించింది. గత ప్రభుత్వం 43 శాతం ఇచ్చింది. పక్క రాష్ట్రంలో 30 శాతం ఆమోదించారు. దీనిని దృష్టిలో పెట్టుకొని 30 శాతానికి తగ్గకుండా ఫిట్‌మెంట్ ప్రకటించాలి.
- 2018 జులై 1 నుంచి నోషనల్ బెనిఫిట్, 2019 జులై 1 నుంచి ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలి. ఈ నెల నుంచి నగదు ప్రయోజనాన్ని ఉద్యోగులకు కల్పించి, 2019 జులై 1 నుంచి గతేడాది చివరి వరకు బకాయిలను జీపీఎఫ్ ఖాతాలకు జమ చేయాలి.
- అద్దె భత్యం, సిటీ కాంపన్సేటరీ అలవెన్స్‌ను యథాతథంగా కొనసాగించాలి. హైదరాబాద్ నుంచి వచ్చిన పనిచేస్తున్న ఉద్యోగులకిచ్చే భత్యాలు కొనసాగించాలి.
- 70- 75 ఏళ్ల మధ్య ఉన్న పింఛనర్లకు అదనంగా 10 శాతం, 75- 80 ఏళ్ల వయసున్న పింఛనర్లకు అదనంగా 15 శాతం పింఛనును అమలు చేయాలి.
- ఉద్యోగుల పదవీవిరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నాం.
- పెండింగ్‌లో ఉన్న అయిదు డీఏలను వెంటనే మంజూరు చేయాలి.
- కేంద్ర పీఆర్సీతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను అనుసంధానం చేస్తామనే ప్రతిపాదన ఉపసంహరించుకోవాలి.
- అయిదేళ్లకోసారి పీఆర్సీని నియమించే విధానం కొనసాగించాలి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న అన్ని సదుపాయాలు.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకూ కల్పించాలనేది ప్రభుత్వ ఆలోచన అయితే చర్చలకు మేం సిద్ధమే.
- సీఎం హామీ మేరకు సీపీఎస్ రద్దు చేసి, పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలి.
- 1993 నుంచి పనిచేస్తున్న కంటింజెంట్, ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి
- గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ వెంటనే ఖరారు చేసి, రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా పీఆర్సీ అమలు చేయాలి.
- పదవీ విరమణ ప్రయోజనాలు, జీపీఎఫ్, ఏపీజీఎల్‌ఐ, మెడికల్ రీఎంబర్స్‌మెంట్ తదితర పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి.
నాడు సీఎంతో సమావేశానికి రాలేకపోయాం
పీఆర్సీపై ఆర్థికశాఖ అధికారులతో చర్చించి మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని సీఎం ఈ నెల 6న తెలిపారని, కానీ ఏడో తేదీ మధ్యాహ్నమే సమావేశం నిర్వహించారన్నారు. అప్పటికే తాము శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఉద్యోగులతో సమావేశాలకు వెళ్లడంతో.. సీఎంతో సమావేశానికి హాజరుకాలేకపోయామని తెలిపారు. అందుకే పీఆర్సీ ప్రకటనపై ఇప్పుడు తమ అసమ్మతి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్ లేఅవుట్లలో ఉద్యోగులకు 10 శాతం ఇళ్ల స్థలాలను 20 శాతం రిబేటుతో ఇవ్వాలనే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. పెండింగ్‌లో ఉన్న 5 విడతల డీఏ మంజూరు ప్రకటనపై ధన్యవాదాలు తెలియజేశారు.
అసంతృప్తిలో పింఛనర్లు ఏఏపీపీఎస్‌హెచ్
పీఆర్సీ ఫిట్‌మెంట్‌ని 23 శాతంగా ప్రకటించడంతో ప్రభుత్వ పింఛనుదారులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని హైదరాబాద్‌లో స్థిరపడ్డ ఆంధ్రప్రదేశ్ పింఛనుదారుల సంఘం పేర్కొంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి బుధవారం వారు లేఖ రాశారు. ‘ఫిట్‌మెంట్ 27% కంటే తక్కువ కాకుండా చూడాలి. అదనపు పింఛను ప్రయోజనాలను 70 ఏళ్ల నుంచే అమలుచేయాలి. పీఆర్సీ బకాయిలను ఆరు నెలల్లోగా చెల్లించాలి. హెల్త్ స్కీముల పేరిట అదనపు ప్రీమియం వసూలు చేయకూడదు. 2018 జులై నుంచే పీఆర్సీ అమలుచేసి అప్పటి నుంచే చెల్లించాలి’ అని లేఖలో కోరారు.
ఫిట్‌మెంట్ నిర్ణయాన్ని పునఃసమీక్షించండి: ఎమ్మెల్సీ కత్తి
పీఆర్‌సీ, ఫిట్‌మెంట్ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం ఆయన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. పీఆర్‌సీపై ఉద్యోగుల ఆకాంక్షలకు విరుద్ధంగా నిర్ణయాలు ఉన్నాయని, వారి వేతనాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఫిట్‌మెంట్, హెచ్‌ఆర్‌ఏ, పెన్షనర్లు, ఎరియర్లు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, సీపీఎస్, ఒప్పంద, పొరుగుసేవల సిబ్బంది, గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలను ఆయన లేఖలో వివరించారు.
0 Response to "This PRC is not acceptable"
Post a Comment