OTT services exclusively in the education system: Adimulapu Suresh
విద్యా వ్యవస్థలో ప్రత్యేకంగా ఓటీటీ సేవలు: ఆదిమూలపు సురేశ్
సమీప భవిష్యత్తులో రాష్ట్ర విద్యా వ్యవస్థలోకి డిజిటల్ సేవలు పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం కొత్త రాజాపేట గ్రామంలో రూ.6 కోట్ల నిధులతో అత్యాధునిక వసతులతో నిర్మించిన గురుకుల పాఠశాల భవనాలను ఎమ్మెల్యే విడదల రజినితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. భవిష్యత్తు అంతా డిజిటల్ రంగానిదేనని.. విద్యా రంగంలో ఆన్‌లైన్ చదువులు కీలక పాత్ర పోషించబోతున్నాయన్నారు. విద్యా వ్యవస్థలో ప్రత్యేకంగా ఓటీటీలను అందుబాటులోకి తీసుకొచ్చి విద్యా బోధన చేపట్టేలా ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగానే వచ్చే ఏడాది నుంచి అమ్మ ఒడి పథకంలో భాగంగా 9, 10 తరగతుల విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందజేయాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు.
ఇప్పటికే విద్యావ్యవస్థలో డిజిటల్ విప్లవం కొనసాగుతోందని.. విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం తదితరాలన్నీ ఆన్‌లైన్‌లోనే నమోదవుతున్నాయన్నారు. చివరికి విద్యాసంస్థల్లోని శౌచాలయాలు శుభ్రం చేస్తున్నారా.. లేదా.. అనేది కూడా ఆన్‌లైన్ ద్వారానే పరిశీలిస్తున్నామని తెలిపారు. మారుతున్న కాలానికి, విద్యా పద్ధతులకు అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా మారాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసమే ఉపాధ్యాయులకూ ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లాకు ఒక ప్రత్యేక శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు.
0 Response to "OTT services exclusively in the education system: Adimulapu Suresh"
Post a Comment