Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Stunts under the name Rationalization‌.

బడితో చెడుగుడు!

Stunts under the name Rationalization‌.


  • రేషనలైజేషన్‌ పేరుతో విన్యాసాలు.
  • అప్పర్‌ ప్రైమరీకి హెచ్‌ఎం ఉండరు
  • ఇక ఈ కూత వినిపించేనా?
  • 137 మంది కంటే విద్యార్థులు తగ్గితే హైస్కూలుకూ హెచ్‌ఎం, పీఈటీ ‘నో’
  • పేరుకు 30 మందికి ఒక టీచర్‌
  • మిగిలేది ఏకోపాధ్యాయ పాఠశాలలే
  • హైస్కూళ్లలో సెక్షన్‌కు ఒక టీచరు రోజంతా పాఠాలు చెప్పాల్సిందే
  • తెలుగు మీడియం ఎత్తేసినట్లే!?
  • 8వ తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియమే
  • టీచర్ల రేషనలైజేషన్‌ ఉత్తర్వులు విడుదల
  • రెండు రోజుల్లో విలీన ప్రక్రియ పూర్తి
  • ఉపాధ్యాయ సంఘాల్లో తీవ్ర అసంతృప్తి

విద్యా వ్యవస్థపై వింత ప్రయోగాలు చేస్తున్న వైసీపీ సర్కారు... ‘రేషనలైజేషన్‌’ పేరుతో ‘బడి’ని మరింత గడబిడగా మార్చేందుకు సిద్ధమైంది. రకరకాల సంస్కరణలతో ఇప్పటికే ‘పదో తరగతి’ విద్యార్థులతో చెడుగుడు ఆడుకుంది. ఇప్పుడు... ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకూ కష్టాలు తెచ్చి పెడుతోంది. మారిన నిబంధనల ప్రకారం పలు స్కూళ్లకు హెడ్‌మాస్టర్‌ గానీ, ఆటలు ఆడించే పీఈటీ గానీ ఉండకపోవడం పరిస్థితి తీవ్రతను చెబుతోంది.

పునఃసమీక్షించాలి

ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియంను మాత్రమే పరిగణనలోకి తీసుకుని క్రమబద్ధీకరించారు. దీనివల్ల చాలా పోస్టులు రద్దవుతాయి. విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. మ్యాథ్స్‌ ఉపాధ్యాయుడు వారానికి 48 క్లాసులు బోధించాల్సి వస్తుంది. యాప్‌ అప్‌లోడ్‌, ఫొటోల అప్‌లోడ్‌, మార్కుల ఆన్‌లైన్‌, స్పాట్‌ వాల్యుయేషన్‌లాంటి పనులు దీనికి అదనం. మరోవైపు 17 సెక్షన్లున్న స్కూల్‌కు ఒకే ఒక్క హిందీ ఉపాధ్యాయుడిని నియమించారు. దీనిని మళ్లీ సమీక్షించాలి.

సాయిశ్రీనివాస్‌, తిమ్మన్న (ఎస్‌టీయూ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు)

ఉపాధ్యాయ పోస్టులను కత్తిరించేలా, ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం రేషనలైజేషన్‌ ప్రక్రియ నిబంధనలు రూపొందించింది. ఈ నిబంధనల ప్రకారం... అప్పర్‌ ప్రైమరీ (3 నుంచి 8వ తరగతి) పాఠశాలలకు అసలు ప్రధానోపాధ్యాయుడే ఉండరు. మొత్తం విద్యార్థుల సంఖ్య 137కంటే తక్కువ ఉంటే ఉన్నత పాఠశాలలకూ (3 నుంచి 10వ తరగతి) ప్రధానోపాధ్యాయుడి పోస్టు ఉండదు. ఈ స్కూళ్లకు పీఈటీలు ఉండరు. ఉన్న ఉపాధ్యాయుల్లో సీనియర్‌గా ఉన్న వ్యక్తే... బోధనతోపాటు ప్రధానోపాధ్యాయుడి విధులు కూడా చూసుకోవాలి. ఇక... 6 నుంచి  10వ తరగతి వరకు ఉన్న పాఠశాలల్లో 92 మందికంటే తక్కువమంది విద్యార్థులుంటే ఆ పాఠశాలలకు కూడా హెచ్‌ఎంలు, పీఈటీలు ఉండరు. అంటే ఇప్పటివరకు ఆయా పాఠశాలల్లో ఉన్న హెచ్‌ఎంలు, పీఈటీలను అక్కడి నుంచి పంపించేస్తారు. సబ్జెక్టు టీచర్లతో తరగతులు చెప్పిస్తామన్న ప్రభుత్వం దాన్ని కూడా పూర్తిగా నెరవేర్చకుండా తప్పించుకోబోతోంది. టీచర్ల రేషనలైజేషన్‌ ప్రక్రియపై రాష్ట్ర విద్యాశాఖ శుక్రవారం ఉత్తర్వులు (జీవో 117) జారీచేసింది. కిలోమీటరు లోపు పాఠశాలలను విలీనం చేసే ప్రక్రియ రెండురోజుల్లో పూర్తవుతుందని తెలిపింది. నూతన విద్యావిధానం ప్రకారం కొత్తగా వర్గీకరించనున్న పాఠశాలలకు ఉపాధ్యాయులను కేటాయించే విధానాన్ని వివరించింది. 

ఫౌండేషన్‌ పాఠశాలల్లో ఒకే ఒక్క ఉపాధ్యాయుడు

పాఠశాలలను ఫౌండేషన్‌ నుంచి హైస్కూల్‌ ప్లస్‌ వరకు ఐదురకాలుగా వర్గీకరించిన ప్రభుత్వం... దాని ప్రకారం విలీన ప్రక్రియ మొదలుపెడుతుంది. విలీనం చేసిన పాఠశాలలకు ఉపాధ్యాయులను ఎలా కేటాయించాలన్న దానిపై తాజా జీవో లో నిబంధనలు పొందుపరిచింది. పాఠశాలల్లో ప్రతి 30మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలని పేర్కొంది. ఫౌండేషన్‌ పాఠశాలల్లోనూ 30 మంది విద్యార్థులకు ఒక సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ను నియమిస్తారు. కానీ... 1, 2 తరగతుల్లో కలిపి 30 మంది విద్యార్థులే ఉంటే, ఇద్దరు టీచర్లను ఇవ్వరు. అంటే... ఇవి ఏకోపాధ్యాయ పాఠశాలలుగా పనిచేస్తాయి. రెండు తరగతులకు బోధనతోపాటు... బోధనేతర విధులైన యాప్‌లో వివరాలు నింపడం, మరుగుదొడ్ల పరిశుభ్రత, మధ్యాహ్న భోజనం పర్యవేక్షణ వంటివన్నీ ఆ ఒక్క టీచరే చూసుకోవాలి. ఉన్న ఒక్క ఉపాధ్యాయుడు సెలవు పెడితే.... అంతే సంగతులు. ప్లేస్కూల్‌కు పాఠాలు చెప్పే అంగన్‌వాడీ టీచర్లే 1, 2 తరగతులకు కూడా పాఠాలు చెప్పాలి. ఫౌండేషన్‌ ప్లస్‌ పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుంది. 30 మందికంటే ఎక్కువ విద్యార్థులు ఉంటేనే రెండో టీచర్‌ను కేటాయిస్తారు.  1 నుంచి 5 తరగతుల వరకు బోధన జరిగే ఈ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 121కంటే ఎక్కువుంటేనే ప్రధానోపాధ్యాయుడు ఉంటారు. లేకుంటే ఉండరు. 

1 నుంచి 5వ తరగతి వరకు బోధన జరిగే పాఠశాలలు రాష్ట్రంలో 34వేలు ఉన్నాయి. వీటినే ఇప్పుడు ఫౌండేషన్‌, ఫౌండేషన్‌ ప్లస్‌ పాఠశాలలుగా విడదీస్తున్నారు. 1, 2 తరగతులను వదిలేసి... 3, 4, 5 తరగతులను హైస్కూల్స్‌లో కలిపేస్తారు. రెండురోజుల్లో ఆ ప్రక్రియ పూర్తవుతుంది. ఇలా మొదటి దశలో దాదాపు 10వేల పాఠశాలలను కలిపేస్తున్నారు. అలా కలిపేశాక మిగిలే 1, 2 తరగతులలో ఉండే విద్యార్థుల సంఖ్య 30లోపే.

లెక్కల మాస్టారుకు 8 పీరియడ్లు

ప్రీ హైస్కూల్స్‌, హైస్కూల్స్‌ పరిస్థితిని కూడా గందరగోళంగా మార్చారు. వీటికి రేషనలైజేషన్‌ ప్రకారం ఉపాధ్యాయుల్ని కేటాయించే నిబంధనలు మరీ దారుణంగా ఉన్నాయి. 3 నుంచి 8 వరకు ఉన్న పాఠశాలల్లో ఆరు సెక్షన్లు (ఒక్కో తరగతికి ఒక సెక్షన్‌ ఉంటుందనే భావనతో) ఉంటే... ఆరుగురు స్కూల్‌ అసిస్టెంట్లను కేటాయిస్తారు. ఏడు సెక్షన్లు ఉంటే ఏడుగురు స్కూల్‌ అసిస్టెంట్లను నియమిస్తారు. వెరసి... ప్రతి టీచరు, ప్రతిరోజూ 6 నుంచి 8 తరగతులను కనీసం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే... ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్క పీరియడ్‌ కూడా విరామం లేకుండా చెబుతూనే ఉండా లి. పరీక్ష పేపర్లు దిద్దడం, క్లాసులకు సన్నద్ధం కావడం ఎప్పుడనేది ప్రశ్నార్థకమే! మరో దారుణం ఏమిటంటే... మొత్తం విద్యార్థుల సంఖ్య 137కంటే తక్కువ ఉంటే, ప్రధానోపాధ్యాయుడు కూడా ఉండరు. ఉన్న టీచర్లలోనే ఒక సీనియర్‌ ఆ బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది.

హైస్కూల్స్‌లో 17 సెక్షన్లు ఉన్నప్పటికీ. ముగ్గురు మ్యాథ్స్‌ టీచర్లనే ఇచ్చారు. అంటే ఒక్కొక్కరికి ఆరు క్లాసులు. నిబంధనల ప్రకారం మ్యాథ్స్‌ ప్రతి తరగతికి వారానికి 8క్లాసులు తీసుకోవాలి. అంటే ఒక్కో మ్యాథ్స్‌ టీచరు వారంలో ఆరు రోజులు... రోజుకు 8 క్లాసుల చొప్పున... 48క్లాసులు చెప్పాలి. అంటే... అవిశ్రాంతంగా పాఠాలు చెబుతూనే ఉండాలన్న మాట! బడిలో ఒక నిర్దిష్ట సంఖ్యను మించి విద్యార్థులుంటేనే అదనపు స్కూల్‌ అసిసెంట్లను (సబ్జెక్ట్‌ టీచర్లు) ఇస్తారు. లేదంటే... సెకండరీ గ్రేడ్‌ టీచర్లనే కేటాయిస్తారు.  వెరసి... ‘విద్యార్థులకు సబ్జెక్టు టీచర్లతో బోధన’ అంటున్న ప్రభుత్వం స్వీయ నిబంధనలనే ఉల్లంఘిస్తోంది. 

తెలుగు మీడియం ఎత్తేసినట్లేనా!

 తాజాగా జారీ చేసిన రేషనలైజేషన్‌ ఉత్తర్వులను చూస్తే తెలుగు మాధ్యమాన్ని ఎత్తేసినట్లే కనిపిస్తోంది.  ఉదాహరణకు... 3-8 వరకు ఉన్న ప్రీ హైస్కూల్స్‌లో అత్యధికంగా 8 సెక్షన్లే ఉన్నట్లు పరిగణించింది. 8 తరగతులకు 8 సెక్షన్లు అంటే... ఒక మాధ్యమమే అమలులో ఉన్నట్లు. ఆంగ్ల మాధ్యమం పెడతానంటున్న ప్రభుత్వం దానివరకే లెక్కేసి... తెలుగు మీడియం సెక్షన్లను ఎత్తేసినట్లు కనిపిస్తోంది. సెక్షన్ల వారీగా ఉపాధ్యాయులను నియమిస్తామన్న ప్రభుత్వం... ఒక్కో సెక్షన్‌కు ఎంత మంది విద్యార్థులుంటారో చెప్పలేదు. ఉదాహరణకు... గతంలో 40 మంది విద్యార్థులకు ఒక సెక్షన్‌ ఉండేది. ఇప్పుడు 50 లేదా 60 మందిని ఒకే సెక్షన్‌ చేస్తారా? అనే అనుమానాలు ఉన్నాయి.

హేతుబద్ధీకరణ ప్రక్రియకు కమిటీ

ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల విలీన ప్రక్రియ చేపట్టేందుకు కమిటీని నియమించారు. జిల్లా విద్యాధికారులు, మండల స్థాయిలో విద్యాధికారులు ఆయా మండలాల్లోని పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థుల సంఖ్యను తీసుకుని హేతుబద్ధీకరణపై రెండు చార్టులను రూపొందిస్తారు. వాటిని జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌గా ఉన్న కమిటీ ముందు పెట్టాలి. ఈ కమిటీలో జాయింట్‌ కలెక్టర్‌, జడ్పీ సీఈవో, మునిసిపల్‌ కమిషనర్‌, సమగ్ర శిక్ష ప్రాజెక్టు కోఆర్డినేటర్‌, ఐటీడీఏ పీవో, డీఈవో, ఎంఈవోలు సభ్యులుగా ఉంటారు.

బడులు ఐదు రకాలు.

    పాఠశాలలను ప్రభుత్వం ఐదు రకాలుగా వర్గీకరించింది. అవి... 

    ఫౌండేషన్‌ స్కూల్‌: ఇందులో ప్లే స్కూల్‌ 1, ప్లేస్కూల్‌ 2తోపాటు ఒకటి, రెండు తరగతులు.

    ఫౌండేషన్‌ ప్లస్‌ స్కూల్స్‌: ప్లే స్కూల్‌ 1 నుంచి ఐదో తరగతి వరకు.

    ప్రీ హైస్కూల్స్‌: 3 నుంచి 8వ తరగతి వరకు.

    హైస్కూల్‌: 3 నుంచి 10వ తరగతి వరకు. కొన్ని హైస్కూళ్లలో 6 నుంచి 10వ తరగతి వరకు మాత్రమే ఉంటాయి.

    హైస్కూల్‌ ప్లస్‌: ఇంటర్‌ వరకు.

    ఈ వర్గీకరణ ప్రకారం పాఠశాలలను విలీనం చేస్తారు. విలీనం చేసిన పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులను ఎలా కేటాయించాలన్నదానిపై ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. 

నాణ్యమైన చదువులకు దూరమే.

రేషనలైజేషన్‌ వల్ల వేలాది పాఠశాలలు ఏకోపాధ్యాయ బడులుగా మారిపోతాయి. ప్రాథమిక విద్య నాశనమవుతుంది. ప్రాథమిక విద్యలో ఎల్‌ఎ్‌ఫఎల్‌ పోస్టు 121వద్ద ఉంచారు. దాన్ని 80కి కుదించాలి. కొత్త విధానంలో 3-8 తరగతుల బోధనకు వేలాదిమందికి స్కూల్‌ అసిసెంట్‌ పదోన్నతులు ఇస్తామన్నారు. అదేమైంది? గతంలో విద్యార్థులను బట్టి సెక్షన్‌ చేశారు. ఇప్పుడు ఎం తమంది ఉన్నా ఒకే సెక్షన్‌ ఉంటుందనేలా చెబుతున్నారు. ఏకోపాధ్యాయ పాఠశాలల వల్ల నాణ్యమైనవిద్య ఎలా అందుతుంది?


 హృదయరాజు, చిరంజీవి (ఏపీటీఎఫ్‌ 1938 రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు)

ప్రమాణాలకు దెబ్బ

8వ తరగతి వరకు ఒకే మీడియంగా పరిగణించారు. ఇది మాతృభాషలో కూడా బోధన జరగాలన్న కోర్టు ఉత్తర్వులకు విరుద్ధం. హెడ్‌మాస్టర్‌ లేకుంటే విద్యా ప్రమాణాలు దెబ్బతింటాయి.  కొత్త విధానంలో... వేలాది పోస్టులు పోతాయి. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను వదిలి ప్రైవేటు పాఠశాలల వైపు మళ్లేందుకే ఈ నిబంధనలు పనికొస్తాయి. ఈ జీవోను రద్దుచేసి శాస్ర్తీయమైన, హేతుబద్ధమైన ఉత్తర్వులను జారీ చేయాలి. దీనిపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలి. 

మంజుల, కె.భానుమూర్తి (ఏపీటీఎఫ్‌ 257రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు) 

చదువులు నిర్వీర్యం

ఈ హేతుబద్ధీకరణ వల్ల ప్రాథమిక దశలోనే విద్యా వ్యవస్థ నిర్వీర్యమవుతుంది. అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు కుదించేశారు. ఏకోపాధ్యాయ పాఠశాల్లో ఉన్న ఒక్క ఉపాధ్యాయుడు బోధనేతర విధులకే సరిపోతారు. ఇక నాణ్యమైన విద్య ఎలా అందుతుంది?

మన్నం శ్రీనివాస్‌, 

తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Stunts under the name Rationalization‌."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0