About cps
సీపీఎస్‌పై ఎవరి మాటవారిదే!
పాత పెన్షన్ కుదరదు.తేల్చేసిన మంత్రుల కమిటీ
- జీపీఎస్‌కు అంగీకరించం: సీపీఎస్ సంఘాలు
- చివరకు బుగ్గన లేరంటూ భేటీ వాయిదా
- 1న సీఎం ఇల్లు ముట్టడి యథాతథం
- అదే రోజు ‘చలో విజయవాడ’
- ఉద్యోగ, ఉపాధ్యాయ, సీపీఎస్ సంఘాల స్పష్టీకరణ
- ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో రద్దుచేసినప్పుడు ఇక్కడెందుకు చేయరని నిలదీత
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)పై మంత్రుల కమిటీ, ఉద్యోగ, ఉపాధ్యాయ, సీపీఎస్ ఉద్యోగ సంఘాల మధ్య జరిగిన చర్చలు ఫలించలేదు. పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరణ ప్రసక్తే లేదని మంత్రుల కమిటీ మరోసారి తేల్చేసింది. ప్రభుత్వం ప్రతిపాదించిన పెన్షన్ పద్ధతి (జీపీఎస్)కు అంగీకరించేది లేదని సంఘాలు తెగేసిచెప్పాయి. ఓపీఎస్ అమలు చేసేవరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశాయి. సీపీఎస్ రద్దు కోరుతూ.. వచ్చే నెల 1వ తేదీన ఏపీసీపీఎస్ ఉద్యోగుల సంఘం సీఎం ఇల్లు ముట్టడి(విద్రోహదినం)కి పిలుపివ్వగా.. అదే రోజు ‘చలో విజయవాడ (మరో మిలీనియం మార్చ్)’కు ఏపీసీపీఎస్‌ఈఏ ఉద్యోగుల సంఘం పిలుపుచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం... మంత్రుల కమిటీతో గురువారం అమరావతి సచివాలయంలో చర్చలకు రావాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, సీపీఎస్ ఉద్యోగ సంఘాలను ఆహ్వానించింది. మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, జీఏడీ, ఆర్థికశాఖ ఉన్నతాధికారులు, ఏపీజేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు, ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ వైవీరావు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కార్‌రావు, ఏపీ సచివాలయ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి నాపా ప్రసాద్, ఏపీసీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీఎం దాస్, ప్రధాన కార్యదర్శి రవికుమార్, ఏపీసీపీఎ్‌సఈఏ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.అప్పలరాజు, ప్రధాన కార్యదర్శి పార్థసారథి, పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు.
రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు సీపీఎ్‌సను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాయని.. మన రాష్ట్రంలో ఎందుకు చేయరని సంఘాల నేతలు నిలదీసినట్లు తెలిసింది. ఇతర రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో వేతనాల పెరుగుదల ఎక్కువని మంత్రుల కమిటీ అనగా... మన బడ్జెట్ పెరుగుదలను ఎందుకు చూడడంలేదని సంఘాల నేతలు ప్రశ్నించారు. సీపీఎ్‌సపై చర్చ అంటేనే సమావేశానికి వచ్చామని... జీపీఎస్ అమలు చేస్తామంటే అసలు వచ్చే వాళ్లమే కాదన్నారు. పాత పెన్షన్ పునరుద్ధరణ మినహా ఏ ప్రత్యామ్నాయం అవసరం లేదని స్పష్టం చేశారు. సాయంత్రం 5.45 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కమిటీ చర్చలను సాగదీసింది. ఉద్యోగ సంఘాల వైఖరిలో మార్పు లేకపోవడంతో.. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి లేనందున మరోసారి భేటీ అవుదామని మంత్రి బొత్స, సజ్జల చెప్పారు. సమావేశాన్ని వాయిదావేశారు.
చలో విజయవాడ నిర్వహించి తీరతాం.
సమావేశం అనంతరం ఆయా సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. ఓపీఎ్‌సపై చర్చకు అంటేనే మరోసారి సమావేశానికి వస్తామని.. సీపీఎస్, జీపీఎస్‌పై చర్చలకు రామని తేల్చిచెప్పారు. సెప్టెంబరు 1న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించి తీరతామని ఏపీసీపీఎ్‌సఈఏ రాష్ట్ర అధ్యక్షుడు అప్పలరాజు స్పష్టం చేశారు. ర్యాలీ వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో తిరిగి నివేదికలిచ్చామని.. ఓపీఎ్‌సపై మాత్రమే చర్చింలని కోరామని.. ఓపీఎస్ తప్ప ఎటువంటి ప్రత్యామ్నాయానికి ఒప్పుకోమని స్పష్టం చేశామని తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సీఎం ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని జరిపి తీరతామని సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మరియదాస్ చెప్పారు. సీపీఎస్ రద్దు చేయాలని, ఓపీఎస్ కావాలని అన్ని సంఘాలూ చెప్పాయని ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు తెలిపారు. ఓపీఎ్‌సపై అయితేనే చర్చలకు వస్తామని కమిటీకి గతంలోనే చెప్పామని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామన్న జగన్ హామీతోనే వైసీపీ అధికారంలోకి రావడానికి సహకరించామని చెప్పారు. జీపీఎస్ విధానం ద్వారా 33 శాతం వరకు పెన్షన్ వచ్చేలా గ్యారెంటీ ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిందని, అవసరమైతే కొన్ని వెసులుబాట్లు కల్పించి ఓపీఎస్ పేరుతోనే పథకాన్ని అమలు చేస్తామని వెల్లడించిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు.
ఎట్టకేలకు ఉపాధ్యాయ సంఘాలకు ఆహ్వానం.
సీపీఎ్‌సపై గురువారం జరిగిన సమావేశానికి రావాలని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని ఉద్యోగ జేఏసీలు, పలు ఉద్యోగ సంఘాలకు బుధవారమే ఆహ్వానాలు పంపిన జీఏడీ అధికారులు.. అదే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని శాశ్వత సభ్యత్వం కలిగిన సంఘాలైన యూటీఎఫ్, ఏపీటీఎఫ్, ఎస్‌టీయూ ఉపాధ్యాయ సంఘాలను మాత్రం ఆహ్వానించలేదు. దీంతో విమర్శలు వెల్లువెత్తాయి. అన్యాయం, అప్రజాస్వామికమంటూ టీచర్ల సంఘాలు విరుచుకుపడ్డాయి. ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు వెళ్లాయో ఏమో.. గురువారం సమావేశం ప్రారంభానికి కొన్ని నిమిషాల ముందు ఉపాధ్యాయ సంఘాల నేతలూ రావాలని ఏపీ జేఏసీ నేతల ద్వారా కబురు పంపారు. దీంతో వారు కూడా వచ్చారు.
0 Response to "About cps"
Post a Comment