Teachers are responsible for the 'egg'!
‘గుడ్డు’ బాధ్యత టీచర్లదే!
- స్టాంపింగ్, సైజు రెండూ పరిశీలించాలి
- వేర్వేరుగా యాప్‌లో అప్‌లోడ్ చేయాలి
- పాఠశాల విద్యాశాఖ కొత్త నిబంధన
ప్రభుత్వం ఉపాధ్యాయులపై రోజురోజుకూ యాప్‌ల భారం పెంచుకుంటూ వెళ్తోంది. ఇప్పటికే బాత్‌రూమ్‌ల నుంచి హాజరు వరకు రకరకాల యాప్‌లతో పాఠశాలల్లో కుస్తీలు పడుతున్న ఉపాధ్యాయులపై కొత్తగా, విద్యార్థులకు మధ్యాహ్నం భోజనంలో వడ్డించే గుడ్ల బాధ్యత పెట్టింది. వాస్తవానికి.. ఇప్పటికే ప్రఽధానోపాధ్యాయులపై గుడ్ల బాధ్యత ఉన్నప్పటికీ ఎన్ని గుడ్లు తీసుకున్నారనేంత వరకే పరిమితమైంది. కానీ కొత్తగా గుడ్లపై కలర్ స్టాంప్‌లు వేశారా? లేదా?... గుడ్లు ఏ సైజులో ఉన్నయనే వివరాలను కూడా ఐఎంఎంఎస్ యాప్‌లో అప్‌లోడ్ చేయాలని పాఠశాల విద్యాశాఖ కొత్త నిబంధన పెట్టింది. అంటే ప్రతి వారం గుడ్లు పాఠశాలకు వచ్చినప్పుడు అన్నిటినీ పరిశీలించి యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. దాంతోపాటు వాటి ఫొటోలు కూడా అప్‌లోడ్ చేయాలనే నిబంధన విధించింది. అయితే క్షేత్రస్థాయిలో దీని అమలు అంత సులభం కాదని ఉపాధ్యాయ వర్గాలంటున్నాయి. ఉన్నత పాఠశాలలకు ఒకేసారి మూడు నాలుగు వేలకు పైగా గుడ్లు వస్తాయని, అందులో ప్రతి గుడ్డునూ పరిశీలించడం సాధ్యం కాదని చెబుతున్నాయి.
అన్ని వేల గుడ్లు పరిశీలించాలంటే ఒక రోజు కూడా సరిపోదని అంటున్నాయి. కాగా, ప్రభుత్వం వారానికోసారి గుడ్లు సరఫరా చేయాలని చెబుతున్నా కాంట్రాక్టర్లు చాలావరకు పదిహేను రోజులకోసారి మాత్రమే సరఫరా చేస్తున్నారు. అంటే అప్పుడు ఒకేసారి లెక్కించాల్సినవి ఇంకా ఎక్కువే ఉంటాయి. అలా కాకుండా ఏరోజు వాడుకునేవి ఆ రోజు లెక్కించాలని అనుకున్నా ప్రతిరోజూ నాలుగైదు వందల గుడ్లు పరిశీలించాల్సి వస్తుంది. ఇదంతా సాంకేతికంగా సాధ్యమవుతుందా? లేదా? అనేది పట్టించుకోకుండానే పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీచేస్తోంది. సైజు కూడా చూసి చెప్పడం తప్ప కచ్చితంగా నిర్దేశిత బరువు ఉందో లేదో చూసే వ్యవస్థ లేదు. నిబంధనల ప్రకారం ప్రతి గుడ్డూ 45గ్రాములకు తక్కువ కాకుండా ఉండాలి.
ఇంకెన్ని యాప్‌లు?
ఇప్పటికే టీచర్లపై యాప్‌ల భారం విపరీతంగా పెరిగిపోయింది. ఇటీవలే ముఖ హాజరు యాప్ కొత్తగా వచ్చి చేరింది. దీంతో ప్రతిరోజూ ఉదయం పాఠశాలకు రాగానే టీచర్లు వారి సొంత ఫోన్లలో హాజరు వేసుకోవాలి. అనంతరం విద్యార్థుల హాజరు యాప్‌లో వేయాలి. ఈలోపు హెచ్‌ఎంలు బాత్‌రూంల ఫొటోలు తీసి అప్‌లోడ్ చేయాలి. తర్వాత మధ్యాహ్న భోజన పథకం ఫొటోలు తీయాలి. మధ్యాహ్నం ఏవైనా మార్కుల వివరాలుంటే అప్‌లోడ్ చేయాలి. అలాగే చిక్కీలు, బియ్యం వస్తే వాటి వివరాలు నమోదుచేయాలి. వీటితోపాటు ఇతరత్రా ఇంకా ఏవైనా పరీక్షలుంటే ఎప్పటికప్పుడు ఆ వివరాలూ అప్‌లోడ్ చేయాలి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక యాప్‌ల పని మొదలైంది. అంతకుముందు టీచర్ల హాజరు కోసం గత ప్రభుత్వం ట్యాబ్‌లు, బయోమెట్రిక్ యంత్రాలు పంపిణీ చేసింది. కానీ ఇటీవల గతంలో ఇచ్చిన డివైజ్‌లు పక్కనపెట్టి సొంత ఫోన్లలో హాజరు వేసే విధానం తెచ్చింది. దీనిపై మొదట టీచర్లలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనా ప్రభుత్వం తీరులో మార్పు లేకపోవడంతో సర్దుకుపోయారు. టీచర్లు, విద్యార్థుల హాజరు యాప్‌లో వేయడం వల్ల ప్రతిరోజూ ఉదయం మొదటి పీరియడ్ బోధన కష్టమమతోందని టీచర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
0 Response to "Teachers are responsible for the 'egg'!"
Post a Comment