Bhishma Ekadashi
భీష్మ ఏకాదశి
హిందూ పంచాగం ప్రకారం, మాఘ మాసంలోని శుక్ల పక్షంలో ఏకాదశి తిథిన అంటే 31 జనవరి 2023 మంగళవారం నాడు ఉదయం 11:55 గంటలకు ప్రారంభమవుతుంది. అనంతరం మరుసటి ఫిబ్రవరి 01వ తేదీన బుధవారం మధ్యాహ్నం 2:01 గంటలకు ముగుస్తుంది.
భీష్మ సందేశం భీష్మ ఏకాదశి
భీష్ముడు ఈ మాట వినగానే మహత్తరమైన ఆవేశం మనల్ని అవహిస్తుంది. శరీరం చైతన్యవంతం అవుతుంది. అనంతమైన ధైర్యం మనలో నిండుతుంది. భీషణమైన ప్రతిజ్ఞ చేసి ఆ ప్రతిజ్ఞ కోసం జీవిత సర్వస్వాన్ని అంకితం చేసిన త్యాగమూర్తి ఆదర్శ జీవనం మనోఫలకంపై కదలా డుతుంది. ఒక్క మాటకే అదీ ఒక్క పేరుకే ఇంతటి ఘనత ఉందా? అంటే ఉందని రొమ్ము విరుచుకుని సగర్వంగా చెప్పవచ్చు.
శీలం, నీతి, నిష్ఠ, ధర్మం, ఆచారం ఒకటేమిటీ అనంతమైన సగుణ సంపదలో భీష్ముడికి సాటి భీష్ముడే! తండ్రి కోసం రాజ్యాన్ని, రాజ్యసుఖాన్ని మాత్రమే కాదు చివరకు తనకంటూ సొంత జీవితాన్ని కూడా లేకుండా త్యాగం చేసిన దయామూర్తి ఆయన. 21సార్లు యావత్ భూమండలాన్ని పర్యటించి క్షత్రియుడనే పేరు వినపడకుండా రాజలోకాన్ని జయించిన పరశురాముడిని నిలువరించిన ఘనత కూడా భీష్ముడికి మాత్రమే దక్కింది. ఇటువంటి పాత్ర మరొకటి భారతంలో కనిపించదు.
తిక్కన సోమయాజి కూడా ‘మహోగ్రశిఖర ఘన తాళ తరువగు సిదము వాడు’ అంటూ బృహన్నల (శాపం అనుభవిస్తున్న అర్జునుడి ద్వారా ఉత్తర గోగ్రహణ సందర్భంలో) చేత భీష్ముని ఔన్యత్యాన్ని ప్రశంసింపజేస్తాడు. భీష్ముని రథ పతాకం మీద తాళ (తాటి) వృక్షం చిత్రించి ఉంటుంది. రథపతాకం రథి హృదయానికి ప్రతీక. నిటారుగా నిలబడి సర్వోన్నతంగా కనిపించే తాళవృక్షంలా. వందలాది పాత్రలున్న మహాభారతంలో ఎవరికీ అందనంత సమున్నత గుణశ్రేణితో అందరిచేతా తాతా! అంటూ గౌరవాన్ని అందుకున్న ఒకే ఒక వ్యక్తి భీష్ముడు, భీష్ముడు కాదు భీష్మాచార్యుడు.
భీష్ముడు ధర్మాన్ని ఎంతటి కఠినమైన పరిస్థితుల్లో ఆచరించేవాడు అనడానికి ఉదాహరణ భారతయుద్ధ సందర్భంలో కనిపిస్తుంది. శాస్త్రవిహితమైన సంధ్యా వందనం, సూర్యుడికి అర్ఘ్యప్రదానం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టేవాడు కాదు భీష్ముడు. యుద్ధం చేస్తున్నా కూడా సంధ్యా సమయంలో ఆగి, సూర్యోపాసన చేసి, నీరు దొరకకపోతే యుద్ధభూమిలోని ఇసుకతోనే అర్ఘ్యప్రదానం చేసినవాడు. అదీ ధర్మంపై, ధర్మాచరణపై ఆయన చూపించిన అంకితభావం.
తండ్రి కోసం రాజ్యాన్ని మాత్రమే కాదు.. తన సంసార సుఖాన్ని కూడా త్యాగం చేశాడు భీష్ముడు. యావత్ ప్రపంచంలో ఇంతటి భీషణమైన ప్రతిజ్ఞ చేసిన వ్యక్తి, చేసిన ప్రతిజ్ఞను చివరి ఊపిరి వదిలే వరకు ఆచరించిన వ్యక్తి మరొకరు లేరు. తన తమ్ములు చనిపోయిన తర్వాత, తాను భీషణమైన ప్రతిజ్ఞ చేయడానికి కారణమైన సత్యవతీదేవి స్వయంగా ఆజ్ఞాపించినా ప్రతిజ్ఞాభంగం చెయ్యడానికి అంగీకరించలేదు.
భీష్ముడు అనగానే ఇతరులకు ఊహించడానికి అవకాశం లేనంత గొప్ప రాజనీతి, చాకచక్యం, ధర్మనిష్ఠ, రాజభక్తి గుర్తుకువస్తాయి. వీటన్నిటితో పాటు మరొక కోణం కూడా భీష్ముడిలో ఉంది. అదే.. అచంచలమైన కృష్ణభక్తి. కేవలం కారణ మాత్రంగానే పరమాత్మ భౌతికరూపంతో కృష్ణుడుగా అవతరించాడని ఎరిగిన అతి కొద్దిమంది భక్తాగ్రేసరుల్లో భీష్ముడు ఒకడు. అయితే, అందరిలా భీష్ముడు ఎక్కడా బాహాటంగా తన కృష్ణభక్తిని ప్రకటించలేదు. కేవలం ఒకే ఒక సందర్భంలో అదీ యుద్ధభూమిలో ఉండగా, తాను నమ్మినదైవమైన పరమాత్మే స్వయంగా తనను చంపుతానని చక్రం చేపట్టినప్పుడు.. అంతకంటే తనకు కావలసింది ఏమున్నదంటూ పరమాత్మకు సాగిలపడ్డాడు.
అంపశయ్యపై ధర్మబోధ
భారతయుద్ధంలో మొదటి అంకం పూర్తయింది. భీష్ముడు అంపశయ్యపైకి చేరాడు. ఎంతటి ప్రజ్ఞ, ధర్మచింతన కలిగిన వాడైనా కొన్ని సందర్భాల్లో నోరు మెదపకుండా, ధర్మానికి గ్లాని జరుగుతున్నా చూసి ఊరుకున్న కారణంగా వచ్చిన దోషాన్ని పోగొట్టుకోవడానికే అంపశయ్యపై పడుకున్నాడు. నిజానికి ‘స్వచ్ఛంద మరణ’ శక్తి ఉన్నా.. పునరావృత్తి రహితమైన మోక్షాన్ని అందుకోవాలంటే చేసుకున్న పాపం పూర్తిగా నశించాలి. అందుకే అంపశయ్యపైకి చేరాడు. తన బాణాల ధాటికి కృష్ణుడు కూడా తట్టుకోలేకపోయాడన్న అహంకారం భీష్ముడిలో ఉంది. అంపశయ్యపైకి చేరడంతో ఆ అహంకారం నశించింది. దైవబలం ముందు భుజబలం అణిగి ఉండాలని అర్థమైంది. పూర్తిగా దైవచింతనలో, అహంకార మమకారాలకు, అరిషడ్వార్గాలకు, లౌకిక బంధాలకు అతీతుడయ్యాడు. అందుకే కృష్ణపరమాత్మ ‘నీ బిడ్డలకు ధర్మబోధ చెయ్యవయ్యా’ అని అంపశయ్య మీద ఉన్న భీష్ముడికి చెప్పాడు. ‘స్వామీ! నువ్వే చెప్పవచ్చు కదా!’ అంటాడు భీష్ముడు. ‘ఆచరించిన అనుభవజ్ఞుడు చెబితేనే ధర్మానికి విలువ, అందుకే నీతో చెప్పిస్తున్నా’ అన్నాడు పరమాత్మ.
అదొక దివ్య ముహూర్తం. తరతరాల పాపాలను క్షయం చేసే విష్ణుసహస్రనామ స్తోత్రం లోకానికి అందింది. వెయ్యి నామాల్లో అనంతుడి అనంతశక్తిని వివరించాడు భీష్ముడు. యుగాల నాటి మాట ఇది. కాలప్రమాణాలకు అందని చిరపురాతనమైనా అధునాతన ప్రపంచంలోనూ భీష్మకృతమైన విష్ణుసహస్ర నామ స్తోత్రానికి వెలుగు తగ్గలేదు. సకల పాపహారిణిగా ఇప్పటికీ మానవులను తరింపజేస్తున్నది. ఈవిధంగా విష్ణు సహస్రనామాలను అందించి, తాను తరించడం మాత్రమే కాదు… తనతోటి వారిని, తన సమాజాన్ని… చివరకు తన లోకాన్నే పావనం చేసిన అగణిత పుణ్యశీలి భీష్మపితామహుడు.
దార్శనికుడి బోధనలు
- నదీప్రవాహం ఒడ్డును కోసేస్తూ విస్తరించినట్లు శత్రువుని కూడా బలహీనపరచాలి. దెబ్బ తీయకూడదు. గాయం మానకూడదు.
- మృదువుగా మాట్లాడాలి. మృదువుగా వ్యవహారాన్ని చక్కబెట్టాలి. మృదువుగా హెచ్చరించాలి. మృదుత్వాన్ని మించిన ఆయుధం లేదు.
- ఉన్నంతలోనే నలుగురికీ పెట్టేవాడు ఇహంలోను, పరంలోను గౌరవం పొందుతాడు.
- సంపద, స్నేహం ఈ రెండింటిలో ఏదికావాలని అడిగితే, స్నేహాన్నే ఎంచుకుంటాను.
- తీరని అప్పు, ఆరని నిప్పు ఎప్పుడూ ప్రమాదమే.
- నాయకుడనే వాడు ముఖస్తుతికి లొంగకూడదు. పొగడ్తలతో దగ్గర కావాలనుకునే వారిని దూరంగా ఉంచాలి.
- అహింస, సత్యం, దయ, ఇంద్రియ నిగ్రహం.. వీటికి మించిన తపస్సు లేదు.
0 Response to "Bhishma Ekadashi"
Post a Comment