Removal of children under ten
250 బడులకు మంగళం
- పది మంది లోపు పిల్లలుంటే ఎత్తివేత?
- జిల్లాల వారీగా సమాచారం కోరిన విద్యాశాఖ
నూతన జాతీయ విద్యావిధానం పేరుతో ఇప్పటికే ప్రాథమిక పాఠశాలల్లోని మూడు, నాలుగు, అయిదు తరగతులను కిలోమీటర్ పరిధిలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. తాజాగా ఒకటి, రెండు తరగతులతో నడుస్తున్న ప్రాథమిక పాఠశాలల్లో మరికొన్ని మాయం కాబోతున్నాయి. పది మంది లోపు విద్యార్థులున్న పాఠశాలలను పూర్తిగా ఎత్తేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు జిల్లాలవారిగా ఈ తరహా స్కూళ్లు ఎన్ని ఉన్నాయో వివరాలు సేకరించారు. 3, 4, 5 తరగతులను ఏవిధంగా విలీనం చేశారు.. మిగిలిన 1, 2 తరగతులను కూడా ఉన్నత పాఠశాలల్లో కలిపేసి ఆయా పాఠశాలలను ఏకంగా చాప చుట్టేయబోతున్నట్లు ఉపాధ్యాయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఇదివరకు 330 ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను సమీప పాఠశాలల్లో విలీనం చేశారు. సుమారు 17 వేల మంది విద్యార్థులు కిలోమీటరు దూరంలోని పాఠశాలలకు మారాల్సి వచ్చింది. మిగిలిన 1, 2 తరగతులను కూడా విలీనం చేస్తే పాఠశాల నిర్వహణ ఖర్చుతో పాటు, ఉపాధ్యాయుల కొరతను అధిగమించొచ్చని సర్కారు భావిస్తోంది. ముందుగా 10 మందిలోపు పిల్లలున్న పాఠశాలలను ఎంపిక చేసుకుని ఆయా విద్యార్థులను సమీప పాఠశాలల్లో కలపడానికి సిద్ధమవుతోంది. ఈ లెక్కన అనకాపల్లి జిల్లాలో అత్యధికంగా 151 పాఠశాలలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. అల్లూరి జిల్లాలో 87, విశాఖలో 12 స్కూళ్లు మాయమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 250 ప్రాథమిక పాఠశాలలు ఎత్తేసి సమీప స్కూళ్లకు పిల్లలను పంపించనున్నారు.
విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నా.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నా సంస్కరణల అమలుకు సర్కారు వెనుకాడడం లేదు. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 30 వేల మంది విద్యార్థులు తగ్గిపోయారు. పాఠశాలలను విలీనం చేస్తున్నామని సర్కారు చెబుతోంది. ఆ విద్యార్థులు పైవేటు స్కూళ్లల్లో చేరిపోతున్నారు. మూడు, నాలుగు, అయిదు తరగతుల విద్యార్థులే సమీప పాఠశాలలకు వెళ్లకపోతే ఒకటి, రెండు తరగతుల బాలలు కిలోమీటరు పరిధిలో పాఠశాలకు ఎలా వెళతారని ఉపాధ్యాయులంటున్నారు.
0 Response to "Removal of children under ten"
Post a Comment