SREESAILA KSHETRAM
శ్రీశైల జ్యోతిర్లింగం
శ్రీశైలం సాక్షాత్తుగా మన ఆంధ్రదేశంలోనే కర్నూలు జిల్లాలో వెలసిన స్వయంభూలింగ మూర్తి ఉన్న క్షేత్రము. విశేషించి అష్టాదశశక్తి పీఠములలో శ్రీశైలంలో ఉన్న భ్రమరాంబికా అమ్మవారు ఒక శక్తిపీఠం.
శ్రీశైలం అంత గొప్ప క్షేత్రం. ఆ పరమేశ్వరుడు వెలసిన కొండపేరు శ్రీగిరి. మనం ఎవరినయినా గౌరవవాచకంతో పిలవాలని అనుకున్నప్పుడు పక్కన శ్రీకారం చుడతాము. శైలమునకు ముందు శ్రీకారం వ్రాయబడి శ్రీశైలం అయింది. దానిపేరు శ్రీగిరి. శ్రీశైలంలో స్వామి లింగమూర్తియై అరూపరూపిగా ఉన్నాడు. ఉన్నది ఒక్క పరమాత్మే రెండుగా భాసిస్తున్నాడు. శ్రీగిరి అన్న పేరు రావడానికి సంబంధించి స్థల పురాణం ఒకమాట చెప్పింది. ఒక భక్తురాలు తాను ఒక కొండగా మారాలని కోరుకుని శైలముగా మారినదని చెబుతారు. దాని తాత్త్వికమయిన రహస్యం వేరు. శ్రీ’లో ‘శ’కార, ‘ర’కార, ‘ఈ’కారములు ఉన్నాయి. ఈ మూడక్షరములు బ్రహ్మశక్తి, రుద్రశక్తి, విష్ణుశక్తి – ఈ మూడు శక్తులను తెలియజేస్తాయి. ఈ మూడు శక్తులు ఉన్న కొండ శ్రీశైలం. ఈ మూడు శక్తులు మమైకమయిన శక్తి రూపిణి భ్రమరాంబిక. అందుకని శ్రీశైలం ఒక శక్తి పీఠం. ఆ కొండమీద అడుగుపెట్టిన వాడు సరస్వతీ కటాక్షమును కానీ, లక్ష్మీ కటాక్షమును గానీ, జ్ఞానమును గానీ నోరువిప్పి అడగక్కరలేదు. అతనికి కావలసినది ఆ కొండలోంచి ప్రసరిస్తుంది. అంత శక్తిమంతమయిన కొండ. శ్రీశైల పర్వతం ఎన్నో ఓషధులకు ఆలవాలము. శ్రీశైలము ఎన్నో ఉపాసనలకు ఆలవాలము. అటువంటి శ్రీశైలంలో పర్వతం మీద పరమశివుడు స్వయంభువుగా వెలిశాడు. ఆయన అక్కడ వెలవడానికి గల కారణం గురించి పెద్దలు ఒక విషయమును చెప్తారు.
గణాధిపత్యం ఎవరికి ఇవ్వాలి అని నిర్ణయం చేయవలసి వచ్చినప్పుడు శంకరుడు తన ఇద్దరు కుమారులను పిలిచి, ఎవరు భూమండలమునంతటిని తొందరగా ప్రదక్షిణం చేసి వస్తారో వారికి గణాధిపత్యం ఇస్తాను అని చెప్పగానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గబగబా బయలుదేరి భూమండలంలో ఉన్న దేవాలయములన్నింటినీ దర్శనం చేసుకుంటూ వస్తున్నారు. గణపతి మాత్రం అలా అన్ని దేవాలయములకు వెళ్ళలేదు. సూక్ష్మలో మోక్షం అన్నట్లుగా ఆయన ‘నాన్నగారూ! తల్లిదండ్రులకు చేసిన ప్రదక్షిణం భూమండలమునకు చేసిన ప్రదక్షిణతో సమానం. నేను మీకే ప్రదక్షిణం చేసి మీకే నమస్కరిస్తున్నాను’ అని తన తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేశాడు. ఈవిధంగా గణపతి తన బుద్ధి కుశలతను ప్రదర్శించాడు. శంకరుడు గణపతికి గణాధిపత్య పదవిని ఇచ్చారు.
సుబ్రహ్మణ్యుడికి కోపం వచ్చి అక్కడినుంచి వెళ్ళిపోయాడు. పార్వతీ పరమేశ్వరులిద్దరూ సుబ్రహ్మణ్యుడిని ఇంటికి రమ్మనమని కోరడానికి వెళ్ళారు. వీరిని చూసి సుబ్రహ్మణ్యుడు 24 క్రోసుల ముందుకు వెళ్ళిపోయాడు. శంకరుడు మల్లెతీగల చేత చుట్టుకోబడిన ఒక అర్జున వృక్షం క్రింద కూర్చున్నాడు. పార్వతీదేవి కూడా వెళ్ళింది. పిల్లవాడు ఎలా ఉన్నాడో అని శంకరుడు సుబ్రహ్మణ్యుడు ఉన్న చోటుకు వెళ్లి కొడుకును బుజ్జగించాడు. ఆయన అలక తీరిపోయింది. ఆయన మహా జ్ఞానిగా నిలబడ్డాడు. శ్రీశైలమునకు పరమేశ్వరుడు ప్రతి అమావాస్య నాడు వెళ్లి దర్శనం చేసి వస్తూ ఉంటాడు. ప్రతి పౌర్ణమి నాడు అమ్మవారు వెళ్లి దర్శనం చేసి వస్తూ ఉంటుంది. పిల్లవానికి దగ్గరలో ఉన్నామని అనిపించుకోవడానికి అక్కడే ఉండి సుబ్రహ్మణ్యుడిని చూసుకుంటూ ఈ మల్లెచెట్టు క్రిందకి వచ్చాము కదా అని అక్కడ వెలశారు. అలకచేతనో, అజ్ఞానం చేతనో మన శరీరములను చూసుకుని భగవంతునికి దూరం అవుతున్నాము. ఇలాంటి వాళ్ళు ఎవరయినా ఉంటే వాళ్ళ దగ్గరకు తానే వెళ్ళిపోతాను అని చెప్పి వచ్చి పరమశివుడు శ్రీశైలంలో కూర్చున్నాడు. శ్రీశైల మల్లికార్జునుడిది ధూళి దర్శనం. మీరు మీ ప్రదేశం నుంచి శ్రీశైలం వెళ్ళే లోపల ఎంతో అశౌచమునకు లోనవుతుంది శరీరం. ఆ బట్టలతో కొండమీదకి వెళతారు. శుభ్రపడి దర్శనానికి వెడితే ఆయన కొద్దిగా చిన్నబుచ్చుకుంటాడట. ఆ క్షేత్రమునకు వెళ్ళగానే ఆశౌచంతో కూడిన శరీరంతో గుడి దగ్గరకు వెళ్లి ధూళి దర్శనమునకు వచ్చాము అని చెప్పి లోపలి వెళ్లి ఈ మట్టి కాళ్ళతో మోకాళ్ళ మీద కూర్చుని మట్టి చేతులతో శివలింగమును ముట్టుకుని, శివలింగం మీద తల తాటిస్తే పరమేశ్వరుడు పొంగి పోయి సర్వకామ్య సిద్ధిని ఇస్తాడుట. దీనిని ధూళి దర్శనం అంటారు శ్రీశైలంలో. శ్రీశైలంలో ధూళి దర్శనం చెయ్యాలి.
అసురసంధ్య వేళలో నందివాహనం భూమండలం మీదనుండి వెడుతుంది. అటువంటి సమయంలో పరమాత్మ శ్రీశైలపర్వతం మీద ఒకసారి దిగుతాడు. అంత పరమ పవిత్రమయిన సమయంలో శ్రీశైలంలో దేవాలయంలో కూర్చుని శివాష్టోత్తర శతనామములు చదువుకున్నట్లయితే అక్కడ దిగిన పరమాత్మ అది చూసి ఆయనను అన్ని పేర్లు పెట్టి పిలిచినందుకు ఎంతగానో సంతోషిస్తాడు. జన్మ చరితార్థం అయిపోతుంది. చెంచులు చెవిటి మల్లన్నా అని అరుస్తూ ఉండేవారు. చెవిటి మల్లన్న అంటే ఆయన పొంగిపోతాడట. శ్రీశైలంలో పరమేశ్వరుడు తన భక్తుల కోర్కెలను తీర్చడానికి ఒక తండ్రిగా వచ్చి కూర్చున్నాడు. శ్రీశైలం స్వామి వారిని దర్శించడానికి వచ్చిన వారి గోత్రనామమునలు ప్రత్యేకంగా ఒక చిట్టాలో వ్రాయమని అమ్మవారు గణపతికి చెప్పింది. అందుకే శ్రీశైలం వెడితే తప్పకుండా సాక్షి గణపతి దగ్గర ఆగాలి.
లోపలి వెళ్లి గోత్రం, పేరు, చెపితే గణపతి మన గోత్ర నామమును చిట్టాలో రాసేసుకుంటారు.
శ్రీశైలంలో శిఖరేశ్వరం ఉన్నది. అక్కడికి నువ్వులు పట్టుకెళ్ళి నంది విగ్రహం దగ్గర పోస్తారు. పూర్వకాలంలో శివాలయంలో చరనంది ఉండేది. పూర్వం రోజులలో ఇప్పుడు ఉన్నంత వైద్య సదుపాయం ఉండేది కాదు. శివాలయం, విష్ణ్వాలయం తప్పకుండా ఉండి తీరేవి. ఎవరయినా గర్భిణీకి అనుకోకుండా నొప్పులు వస్తే పట్నానికి తీసుకు వెళ్ళడానికి అవకాశం లేకపోతే అంతరాలయం మూసేసి ఉన్నా కూడా పరుగెత్తుకుంటూ అర్చకుడి దగ్గరకు వెడితే ఆలయ ప్రధాన ద్వారం తీసేవారు. ఈ బాధ పడుతున్న గర్భిణి ఇల్లు ఎటువైపు ఉన్నదో అటువైపు చరనందిని తిప్పేవారు. ఈ చరనంది అటు తిరగగానే అటువైపు బాధపడుతూ ప్రసవం జరగకుండా ప్రాణాలు పోతాయేమో నని అనుకున్న వాళ్లకి కూడా ఎందరికో సుఖప్రసవములు జరిగేవి. అందుకే అనేక శివాలయములలో చరనంది ఉండేది. శిఖరేశ్వరంలో కూడా మనం ఈశ్వరుణ్ణి పొందలేక పడుతున్న బాధ నుంచి విముక్తం కావడానికి నువ్వులు వేసి తిప్పి శిఖరం చూడాలి. కానీ యథార్థమునాకు శిఖరము నంది శృంగములలోంచి కనపడదు. మీరు భావన చేస్తూ కళ్ళు తెరచి అక్కడ చూడాలి. ఈ కన్నులు తెరచి నంది శృంగములలోంచి చూస్తుంటే జేగురు రంగులో ఉన్న శ్రీశైల మల్లికార్జునుని ఆలయ గోపురం మీద వున్నా త్రిశూలంతో కూడి మెట్లు మెట్లుగా ఉన్న శిఖరం మీకు కనపడాలి. అలా కనపడిన వాడికి ఒక పునర్జన్మ ఉండదు. అందుకే శిఖరేశ్వర దగ్గర పరమాత్మ ఒక పరీక్ష పెట్టాడు. ఒకసారి అమ్మవారు ‘ఏమండీ శిఖరేశ్వరం దగ్గరకు వచ్చి నందిని తిప్పి శిఖరం చూస్తే ఇక పునర్జన్మ లేకుండా మోక్షమును ఇచ్చేస్తారా? అని అడిగితే శంకరుడు శ్రీశైలం వచ్చిన వారందరికీ మోక్షం ఇవ్వను. ఎవరికి ఇస్తానో నీకు చూపిస్తాను అని ఆయన ఒక వృద్ధ బ్రాహ్మణ రూపమును స్వీకరించారు. ఒక వృద్ధ బ్రాహ్మణిగా పార్వతీదేవి వచ్చింది. ఇద్దరూ ఆ శిఖరేశ్వరం దగ్గరికి వచ్చారు. మెట్లు ఎక్కుతున్నారు. నంది శృంగముల లోంచి చూస్తున్నారు. క్రిందికి దిగిపోతున్నారు. ఈశ్వరుడు అక్కడ చిన్న ఊబిని సృష్టించాడు. అందులో వృద్ధ బ్రాహ్మణుడు దిగిపోతున్నాడు. ఆ ఒడ్డున ఉన్న వృద్ధ బ్రాహ్మణి ‘మా అయన దిగబడిపోతున్నాడు. అందుకని ఎవరయినా ఒక్కసారి చేయినిచ్చి పైకి లాగండి’ అన్నది. అందరూ గబగబా వచ్చి చెయ్యి ఇవ్వబోయారు. ఆమె మీలో పాపం లేనివారు పైకి లాగండి అన్నది. ప్రతివారు తాము ఏదో పాపం చేసి ఉండక పోతానా అనుకుని వెనక్కి వెళ్ళిపోయారు. ఆ సమయంలో అటుగా ఒక వేశ్య కిందికి దిగుతోంది. ఈవిడ వేశ్య అని అందరూ అంటున్నారు. ఆవిడ దిగుతూ వచ్చి నేను లాగుతాను అంటే పార్వతీ దేవి ‘ఏమ్మా! అందరూ మాకు పాపం ఉంది అని వెళ్ళిపోతున్నారు. వాళ్ళ పాపము కంటే నీ పాపం గట్టిది కదా! నువ్వు నా భర్తను ఎలా లాగుతావు? అని అడిగింది. ఆవిడ ‘శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే’ – అమ్మా! నేను ఇప్పడు శిఖర దర్శనం చేశాను. మోక్షం రావాలంటే పాపం లేదు, పుణ్యం లేదు. రెండూ సున్నా అయిపోతేనే కదా మోక్షం. ఇపుడు నా ఖాతాలో పాపం లేదు. పుణ్యం లేదు అందుకని లాగుతున్నాను. నేను అర్హురాలను’ అన్నది. ఈవిడకు విశ్వాసం నిజంగా ఉన్నది ఈవిడకు మోక్షం ఇస్తున్నాను’ అని శివుడు పార్వతికి చెప్పాడు. నంది శృంగములలోంచి చూడడం కాదు. అక్కడ ఉన్నది తన తల్లిదండ్రులని నమ్మిన వాడు ఎవరో వానికి మాత్రమె మోక్షం ఇవ్వబడుతుంది. శ్రీశైల క్షేత్రంలో అడుగు పెట్టిన వాడికి తాను తన తల్లిదండ్రుల దగ్గర ఉన్నాననే భావన ఉండాలి. ఈ భావన పరిపుష్టమై శ్రీశైలం వెడితే మీకు అక్కడ ఎనలేని సౌభాగ్యం కలుగుతుంది.
హటకేశ్వరం
శ్రీశైలంలో హటకేశ్వరము అని ఒక దేవాలయం ఉన్నది. అది చిత్రమయిన దేవాలయం. ఒక బంగారు లింగం తనంత తాను కుండపెంకునందు ఆవిర్భవించిన హటకేశ్వర దేవాలయము క్షేత్రము కనుక దానిని ‘హటకేశ్వరము అని పిలుస్తారు. అక్కడ మెట్లు బాగా క్రిందికి వస్తే పాలధార, పంచధార అని అయిదు ధారలు పడుతుంటాయి. పరమశివుని లలాటమునకు తగిలి పడిన ధార ఫాలధార. అనగా జ్ఞానాగ్ని నేత్రమయిన ఆ కంటినుండి, పైనుండి జ్ఞానగంగ మరింతగా తగిలి క్రింద పడిన ధార. ఇది శివుడి లలాటమును తగిలి వస్తున్నధార అని లోపలికి పుచ్చుకుంటే ఉత్తర క్షణం గొప్ప ఫలితమును కలుగుతుంది. ఎందుచేత ఇలా ఏర్పడింది? ఈశ్వరాలయంలో తీర్థం ఇవ్వరు. సాక్షాత్తు సాకారరూపుడయిన శంకరునికి తగిలి పడిన ధార పాలధార. పంచధార అయిదు రకములుగా ప్రకాశిస్తున్న భగవంతుని శిరస్సులకు తగిలి పడిన ధారలు. ఆ తీర్థం తీసుకునేటప్పుడు మర్యాద పాటించాలి. చెప్పులతో వెళ్ళకూడదు. శంకర భగవత్పాదుల వారు తపస్సు చేసి అక్కడే శివానందలహరి చెప్పారు. ఆయనకు భ్రమరాంబికా దేవి ప్రత్యక్షం అయింది. చంద్రశేఖర పరమాచార్య స్వామి తపస్సు చేసుకుంటూ ఉండిపోతాను అన్న ప్రదేశం అదే. అంత పరమమయిన ప్రదేశంలో పంచధారలు పడతాయి. ఒకటి బ్రహ్మధార. ఒకటి విష్ణుధార, ఒకటి రుద్రధార, ఒకటి చంద్రధార, ఒకటి దేవధార. ఈ పంచధారలను స్వీకరించడం సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త లోకసాక్షులయిన సూర్యచంద్రులు. ఈ అయిదు తీర్థములను అక్కడ తీసుకోవచ్చు. పరమ పావనమయిన క్షేత్రం శ్రీశైల క్షేత్రం.
శ్రీశైలంలో ఉండే భ్రమరాంబా అమ్మవారి దేవాలయం వెనక నిశ్శబ్దంగా ఉన్నప్పుడు వెళ్లి చెవిని బాగా నొక్కిపెట్టి ఉంచి చాలా జాగ్రత్తగా కళ్ళు మూసుకుని వింటే ఒక తుమ్మెద ఝుంకారము వినపడుతుంది. దానిని భ్రామరీ నాదము అంటారు. అమ్మవారిని ఇప్పటికీ అక్కడ తుమ్మెదరూపంలో ఉన్న రెక్కలతో అలంకారం చేస్తారు. ఆ తల్లిముందు శంకరాచార్య స్వామి వారు శ్రీచక్రములను వేశారు. అక్కడికి వెళ్లి అమ్మవారి శ్రీచక్రం ముందు కూర్చుని ఏ తల్లి అయినా కుంకుమార్చన చేస్తే ఆమె పూర్ణంగా మూడు తరములు చూసి హాయిగా పదిమంది చేత పండు ముత్తైదువని అనిపించుకుని వార్ధక్యంలో హాయిగా ఆవిడ భర్తగారి తొడమీద తల పెట్టుకొని ప్రాణం విడిచిపెట్టగలిగిన అదృష్టం కలుగుతుంది. శ్రీశైలలింగమునకు పట్టు తేనెతో అభిషేకం చేస్తే ఉత్తరజన్మలలో గంధర్వగానం వస్తుంది. భ్రమరాంబికా అమ్మవారి దగ్గర కూర్చుని కుంకుమార్చన చేసుకోవాలి. నాలుగు మారేడు దళములు పట్టుకెళ్ళి ఆ శివలింగమును తడిమి తడిమి అభిషేకం చేసుకోవాలి. తల తాటించి నమస్కరించుకోవాలి.
పూర్వం అరుణాసురుడనే రాక్షసుడొకడు బయలుదేరాడు. వాడు బ్రహ్మ ఇచ్చిన వరముల వల్ల మిక్కిలి గర్వమును పొంది లోకముల నన్నిటిని క్షోభింపజేస్తున్నాడు. ఆ సమయంలో అమ్మవారు భ్రామరీ రూపమును పొందింది. భయంకరమయిన యుద్ధం చేసిన తరువాత భ్రామరీ రూపంతో వెళ్ళి ఆ అరుణాసురుణ్ణి సంహారం చేసింది. ఇప్పటికీ శాస్త్రంలో శ్రీశైల మల్లికార్జునుడు మల్లెపూవు అయితే అమ్మవారు సారగ్రాహి అని చెప్తారు. తుమ్మెద ఎప్పుడూ పువ్వుచుట్టూ తిరుగుతుంది. ఆయన మల్లికార్జునుడు. ఆవిడ భ్రమరాంబికా దేవి. శివుడు ఉన్నచోట అక్కడ ఆవిడ భ్రమర రూపంతో తిరుగుతూ ఉంటుంది. ఇప్పటికీ ఆ నాదము వినపడుతూ ఉంటుంది. ఈ నాదమును ఆలిండియా రేడియో హైదరాబాద్, కర్నూల్, విజయవాడ స్టేషన్లు రికార్డుచేశాయి. శ్రీశైలం వెళ్లి అమ్మవారిని చూసినట్లయితే అమ్మవారి కనుగుడ్లు స్పష్టంగా కనపడుతుంటాయి. ఆమె ముందు గల శ్రీచక్రం ముందు కూర్చుని కుంకుమార్చన చేసుకుని “అవిద్యానామంతస్తిమిర మిహిరద్వీపనగరీ” అని సౌందర్యలహరి లోని నాలుగు శ్లోకములు చెప్పుకుని వస్తే జన్మ ధన్యం అయిపోతుంది.
అక్కడ ఉన్న స్వరూపములలో వీరభద్రుడు ఒకడు. శ్రీశైల మల్లికార్జునుని దర్శనం చేసి బయటకు వచ్చి ఎడమ పక్కకు వెళ్ళినప్పుడు వీరభద్రుడు కనపడతాడు. బయలు వీరభద్రుడని క్షేత్ర పాలకుడు ఒకాయన ఉన్నాడు. రక్త సంబంధమయిన వ్యాధులు శరీరంలో పొటమరిస్తే వారు శ్రీశైల క్షేత్రంలో ఉన్న వీరభద్ర స్వరూపం దగ్గర కూర్చుని ప్రతిరోజూ ఒక గంట సేపు శివనామములు చెప్పుకుని కొద్దిరోజులు ఉండి వస్తే ఆ వ్యాధులు నయం అవుతాయి. అలా నయమయిన సందర్భములు ఎన్నో ఉన్నాయి. అక్కడ ఉన్న వీరభద్ర మూర్తిలోంచి అటువంటి శక్తి ప్రసారం అవుతుందని పెద్దలు చెప్తారు.
చంద్రవతి అనే రాజకుమార్తె ఒక భయంకరమయిన గడ్డు కాలమును ఎదుర్కొంది. తన తండ్రే తనను మోహించాడు. ఆమె పరుగెత్తి శ్రీశైల క్షేత్రమును చేరుకొని గుళ్ళోకి వెళ్ళిపోయింది. రాజు ఆమె వెనుక తరుముకు వస్తున్నాడు. గుళ్ళోకి వెళ్ళిన ఆమె శివలింగమును చూసి దానిని శివలింగమని అనలేదు. అక్కడ మల్లికార్జునుడు ఉన్నాడు అని ఆమె చేతిలో ఉన్న మల్లెపూల దండను సిగకు చుట్టుకుని ‘మల్లికార్జున నేను నీకు ఇవ్వగలిగింది ఇదే – ఇది నీ సిగకు చుట్టుకుని నన్ను నీవు కాపాడు’ అని ప్రార్థించింది. లింగోద్భవ మూర్తి స్వామి వచ్చి ఆమెను తరుముకు వస్తున్న రాజును చూసి నీవు పచ్చలబండవగుదువుగాక అని శపించాడు. అంతటి దుష్కృత్యమునకు ప్రయత్నించిన ఆ రాజు పచ్చలబండయి ఇప్పటికీ అలా పడి ఉన్నాడు. ఈవిడ ఇచ్చిన మల్లికా పుష్పముల మాలను తన సిగకు చుట్టుకుని స్వామి మల్లికార్జున అని మరొకమారు పిలిపించుకున్నాడు.
శ్రీశైలంలో ఒక శివ లింగము ముడతలు పడిపోయి ఉంటుంది. ఆ ముడతలు బాగా దగ్గరగా వచ్చేసి ఉంటాయి. ఈ మల్లికార్జునుడు ఎప్పుడు వెలసినదీ సాధికారికంగా చెప్పలేము. అక్కడ జరిగిన విచిత్రం ఒకటి ఉన్నది. మహీధర మహారాజు అని ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకు ఒక కుమార్తె. ఆమె శంకరుని సౌందర్యమును ఉపాసన చేసింది. సాధారణంగా ఈశ్వరుని తండ్రిగా ఉపాసన చేస్తారు. కానీ ఆమె శివుణ్ణి మోహించింది. తనకి శివుడి వంటి భర్త కావాలి అన్నది. ఈ పిల్ల ఏమి చేస్తుందో అని శంకరుడు ఆమె కలలోకి వచ్చి “నీకు నన్ను వివాహం చేసుకోవాలని ఉంటే శ్రీగిరి పర్వతం మీద ఉన్న తెల్ల మద్దిచెట్టు కిందవున్న మల్లెపొదలో ఉన్నాను. అక్కడకు రా నిన్ను వివాహము చేసుకుంటాను’ అన్నాడు. ఆమె శంకరుడు చెప్పిన చోటికి వచ్చి ఆ చెట్టును, పొదను వెతుకుతున్నది. పార్వతీ దేవి “జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని చెప్తారు. మీకు ఈ బుద్ధి ఎప్పటినుంచి వచ్చింది అని శంకరుని అడిగింది. శంకరుడు ఆమె నన్ను భక్తితో ఆరాధన చేసింది. ఇక్కడ వివాహం అనగా నేను ఆవిడను నాలోకి తీసుకోవడం అని చెప్పాడు. పార్వతీ దేవి అయితే ఆమె ఉపాసనలో అంత భక్తి ఉన్నదా? అని అడిగిటే శంకరుడు ఆమె ఎంత భక్తి తత్పరురాలో చూపిస్తాను చూడమని వెంటనే 96 సంవత్సరముల వృద్ధునిగా మారి వెతుకుతున్న పిల్ల దగ్గరకు వెళ్ళి పిల్లా! నీవు ఇక్కడ ఎవరి కోసం వెతుకుతున్నావు? అని అడిగాడు.
ఆమె తాను శివుడి కోసం వెతుకుతున్నానని జవాబు చెప్పింది. ఆయన నేనే శివుడిని ఇంత వృద్ధుడిని కదా! నన్ను పెళ్ళాడతావా? అని అడిగాడు. నీవు వృద్దుడవో, యౌవనంలో ఉన్నవాడివో నాకు తెలుసు. నాకు నీవే భర్త. వేరొకరిని ఈ లోకంలో నేను భర్తగా అంగీకరించనని చెప్పింది. ఆవిడకు కావలసింది ఆయనలో ఐక్యమవడం. చూశావా పార్వతీ ! ఈమె భక్తి ఈమెను నాలో ఐక్యం చేసుకుంటున్నాను అని శివుడు ఆమెను తనలో ఐక్యం చేసుకుని ఈ పిల్లను స్మరించి ఇటువంటి భక్తి తత్పరురాలికోసం సృష్టిలో లేని విధంగా ముడతలు పడిపోయిన శివలింగమని, వృద్ధ మల్లికార్జునలింగమని తలచుకున్న వాళ్ళని, పొంగిపోతూ నేను చూస్తానని వృద్ధ మల్లికార్జునుడై వెలిశాడు. అక్కడ కళ్యాణములు చేస్తున్నారు. ఈవిధంగా శ్రీశైలం ఎన్నో విశేషములతో కూడుకున్న క్షేత్రం.
ఈ క్షేత్రంలోనే శంకరాచార్యుల వారు శ్రీశైల శిఖరం మీద ఉండగా ఒక కాపాలికుడు వచ్చి శంకరాచార్యుల వారి శిరస్సు కావాలని అడిగాడు. శంకరాచార్యుల వారు ‘నా శిరస్సును ఇవ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదు. నీవు నా శిరస్సును తీసుకుంటే నా శిష్యులు బాధపడతారు. నా శిష్యులు ఉదయముననే పాతాళగంగ దగ్గరకు వెడతారు. అప్పుడు వచ్చి నా శిరస్సు ఉత్తరించి పట్టుకు వెళ్ళు’ అని చెప్పారు. మరునాడు ఉదయం ఆ కాపాలికుడు వచ్చి ధ్యానం చేసుకుంటున్న శంకరాచార్యుల వారి శిరస్సును ఉత్తరించడం కోసమని చేతిలో ఉన్న కత్తి పైకెత్తిన సమయంలో స్నానం చేస్తున్న పద్మపాదాచార్యుల వారికి ఏదో అమంగళం గోచరించి అక్కడి నుండే నరసింహ మంత్రోపాసన చేశారు ఆయన. ఎక్కడి నుండి వచ్చాడో మహానుభావుడు నరసింహుడు గబగబా వచ్చి కత్తినెత్తిన కాపాలికుడి శిరస్సును త్రుంచి అవతల పారేసి నిలబడ్డాడు. ఆ తేజోమూర్తిని శంకరాచార్యుల వారు నరసింహ స్తోత్రంతో ప్రార్థన చేశారు. ఈవిధంగా నరసింహ స్వామి దర్శనం ఇచ్చిన క్షేత్రం. శివకేశవ అభేదముగా శంకర భగవత్పాదులు రక్షించబడిన క్షేత్రం శ్రీశైల క్షేత్రం. జగద్గురువులను రక్షించుకున్న మన తెలుగునాట ఉన్న కొండ.
అక్కడ ప్రవహించే కృష్ణానదిని కృష్ణానది అని పిలవరు. కృష్ణానది శ్రీశైల పర్వతశిఖరమును పామువలె చుట్టుకొని ప్రవహిస్తుంది. శివుడిని విడిచి పెట్టలేక భక్తుల పాపములను తొలగించడానికి ఉత్తరమున ఉన్న గంగ దక్షిణమునకు వచ్చి కృష్ణ పేరుతో అక్కడ ప్రవహించింది కాబట్టి దానిని ‘పాతాళ గంగ అని పిలుస్తారు. ఆలయ ప్రాంగణంలో పంచపాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు శ్రీశైలంలో ప్రతిష్ఠ చేసిన లింగములు అయిదు ఉంటాయి. దేవాలయంలో తూర్పున కృష్ణ దేవరాయలు నిర్మించిన గోపురం దక్షిణమున హరిహర రాయలవారు నిర్మించిన గోపురములు కనపడతాయి. ఆ ఆలయ ప్రాంగణంలోనే మేడి, జువ్వి, రావి ఈ మూడూ కలిసి పెరిగిన త్రిఫలవృక్షమని ఒక పెద్ద వృక్షం ఉంటుంది. ఆ చెట్టు నాలుగు వేల సంవత్సరములు. అక్కడికి సమీపంలోనే వృద్ధ మల్లికార్జునుడు ఉంటాడు. ఆ వెనుక రాజరాజేశ్వరీ దేవాలయం. సమీపంలో భ్రమరాంబ అమ్మవారి త్రిఫల వృక్షం ఉంటాయి. ఉత్తరమున శివాజీ గోపురం, కళ్యాణమంటపం, నందనవనం అనే పుష్పవాటిక ఉంటాయి. ఆ వనంలో సుబ్రహ్మణ్య స్వామి నెమలితో ఉంటారు.
శివాజీ మహారాజు అక్కడికి వెళ్లి అమ్మవారి ప్రార్థన చేశాడు. ఆ దృశ్యం శివాజీ గోపురం మీద ఇప్పటికీ చెక్కబడి ఉంటుంది. భవానీమాత ప్రత్యక్షమై ‘ఈ చంద్రహాసమును చేత పట్టుకో నీకు ఎదురు లేదు’ అని అనుగ్రహించి శివాజీకి చంద్రహాసమును బహూకరించింది. ఆ కత్తి పట్టుకునే మహానుభావుడు హిందూ ధర్మ సామ్రాజ్యమును స్థాపించాడు. అంత గొప్ప క్షేత్రం శ్రీశైల క్షేత్రం.
అందరి కన్నులు పాగాలంకరణ పైనే
మహాశివరాత్రి వేడుకల సందర్భంగా శ్రీశైలంలో పాగాలంకరణకు ప్రత్యేక విశిష్టత కలదు. శైవక్షేత్రాల్లో మరెక్కడా జరగని విశిష్టసేవ శ్రీశైలజ్యోతిర్లింగమూర్తికి మూడు తరాలుగా చేపడుతోన్న అద్వితీయ సేవే ఈ పాగాలంకరణ.
తాత్వికపరంగా ప్రపంచం భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అనే పంచభూతాలతో నిండి ఉంది. పంచభూతాలకు ప్రతీకగా స్వామివారి గర్భాలయ విమాన గోపురానికి మధ్యలో ప్రధాన కలశం నలుమూలలా నాలుగు కలశాలనే చెప్పవచ్చు. అలాగే వృషభం ధార్మికతకు ప్రతీక అయితే గర్భాలయ ముఖమండపంపై ఉన్న నవనందులు, అయిదు కలశాలకు కలిపి పాగా చుట్టబడుతుంది. 14 లోకాల్లో మల్లన్న అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని లోకకళ్యాణాన్ని కాంక్షిస్తూ నిర్వహించే సేవ ఇది.
ప్రకాశం జిల్లా హస్తినాపురానికి చెందిన ఫృధ్వీవెంకటేశ్వర్లు అనే భక్తుడి కుటుంబం మూడు తరాలుగా శ్రీశైలమల్లన్నకు పాగాను అలంకరిస్తోంది.స్వామివారికి పాగాను వంశపారంపర్యంగా సమర్పిస్తున్నారు. ఏడాదిపాటు దీక్షలో ఉండి రోజుకు ఒక మూర చొప్పున 365 రోజులు పాగా వస్త్రాన్ని నేస్తారు. కావున మల్లన్నకు మహాశివరాత్రి రోజున నిర్వహించే పాగాలంకరణను దర్శించడం ద్వారా పరమేశ్వరుడి అనుగ్రహంతో ఆ ఏడాది అంతా శు భాలు చేకూరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో స్వామివారి కళ్యాణానికి ముందు పెండ్లికుమారుడికి తలపాగా చూటే ఆచారశైలిని అనుసరించి తరతరాలుగా ఏటేటా పాగాలంకరణ సేవ చేస్తున్నారు ఫృధ్వీవెంకటేశ్వర్లు కుటుంబం.
స్వామివారిని పాగాను ఎంతో భక్తి, దీక్షతో ప్రతిరోజు ఉదయం ఒక మూరచొప్పున 365 రోజులపాటు నేస్తుంది. మహాశివరాత్రి పర్వదినం నాటికి శ్రీశైలం చేరిన సదరు కుటుంబానికి దేవస్థానం ఆలయ లాంఛనాలతో స్వాగతం పలికి ఆతిధ్యం ఇస్తోంది. ఫృధ్వీవెంకటేశ్వర్లు శివరాత్రి రోజున చిమ్మచీకట్లో దిగంబరుడై స్వామివారి గర్భాలయ విమాన కలశాలు, ముఖమండప నవనందులను కలుపుతూ పాగాలను అలంకరిస్తారు. ఆ సందర్భంగా ఒంటిపై నూలు పోగు లేకుండా, చిమ్మచీకటిలో పాగా అలంకరణ చేయడం ఇక్కడ విశిష్టత. వీటిని శ్రీశైలంకు వచ్చిన అశేషభక్తజనం తిలకిస్తారు.
🔯శ్రీశైలం మహాపుణ్యక్షేత్రం🔯
0 Response to "SREESAILA KSHETRAM"
Post a Comment