Aadhaar services coming soon.
ఆధార్ సేవలు చేరువగా.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందడం.. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవడం.. విద్యాసంస్థల్లో ప్రవేశం.. బ్యాంకుల్లో ఖాతాలు తెరవడం
మొబైల్ సిమ్ కార్డులు పొందడం ఇలా.. ఏ అవసరానికై నా ఆధార్ కార్డు ప్రస్తుతం అత్యంత కీలకంగా మారింది. దాదాపు ప్రతి ఒక్కరికీ ఇప్పటికే ఆధార్ కార్డు ఉంది. అయితే వీటిల్లో తప్పులు ఉండటంతో అర్హత ఉన్నప్పటికీ కొంతమంది సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆధార్ కార్డు పొంది పదేళ్లు పూర్తయిన వారు తగిన గుర్తింపు కార్డులతో ఆధార్ సేవా కేంద్రాలకు వెళ్లి, తమ వివరాలను మళ్లీ అప్‌డేట్ చేయించుకోవాలని యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఐ) ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా 2016 కంటే ముందు ఆధార్ కార్డు పొందిన వారు, ఐదేళ్ల నుంచి 15 సంవత్సరాల వయస్సు లోపు వారు తమ వివరాలను పూర్తిస్థాయిలో అప్‌డేట్ చేయించుకోవాలి. తద్వారా తప్పులు లేనివిధంగా ఆధార్ కార్డులు రూపొందించనున్నారు.
ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు.
ఆధార్ నమోదు, వివరాల్లో చిరునామా, ఫొటో మార్పు, ఇతర మార్పులు, చేర్పులు, మొబైల్ నంబర్ అనుసంధానం తదితర సేవల కోసం ప్రజలు గతంలో ఆధార్ సేవలు అందిస్తున్న మీసేవ కేంద్రాలు, బ్యాంకులు, తపాలా కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది. అక్కడ టోకెన్ తీసుకుని నిర్దేశించిన తేదీ వరకూ ఎదురు చూడాల్సి వచ్చేది. ఈ క్రమంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన గ్రామ/వార్డు సచివాలయాల్లో కూడా ఆధార్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. జిల్లాలో ఆధార్ సేవలు అందించే సచివాలయాలు 82 ఉన్నాయి. వీటన్నింటికీ ఆధార్ సేవలకు అవసరమయ్యే ల్యాప్‌టాప్, ప్రింటర్, స్కానర్, ఐరిస్, వేలిముద్రల పరికరాలతో కలిపి మొత్తం 19 కిట్లు అందజేశారు. ఆధార్ వివరాలు నమోదు చేసే డిజిటల్ అసిస్టెంట్లకు పరీక్షలు నిర్వహించి, ఉత్తీర్ణులైన వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రింటర్, స్కానర్, ఐరిస్, వేలిముద్రల పరికరాలను ఏవిధంగా ఉపయోగించాలో ప్రత్యేక తర్ఫీదు ఇచ్చారు. మరోపక్క ఆధార్ సేవలను అన్ని సచివాలయాల్లోనూ దశల వారీగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రత్యేకంగా రోజుకో సచివాలయంలో ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేసి, సేవలు అందించడంతో పాటు అందరికీ అవగాహన కల్పించే కార్యక్రమాలను అధికారులు ముమ్మరం చేశారు.
కొత్త ఆధార్ నమోదు ఉచితం
కొత్తగా ఆధార్ కార్డు పొందే పిల్లలకు దీనిని ఉచితంగా అందించనున్నారు. అయితే ఇప్పటికే కార్డు ఉండి, నవీకరణ చేయించుకునే వారు ఆయా సేవలను బట్టి నిర్ణీత ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి బయోమెట్రిక్ అప్‌డేషన్‌కు రూ.100, సవరణలకు రూ.50, ఆధార్ కార్డు ప్రింట్‌కు రూ.30 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. సచివాలయాల్లోనే ఆధార్ సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పాయి.
ఆధార్ సేవలివీ.
- ఆధార్‌కు మొబైల్ నంబర్ లింకింగ్
- ఈ-మెయిల్ ఐడీ లింకింగ్
- బయోమెట్రిక్
- (ఫొటో, ఐరిస్, ఫింగర్ ప్రింట్)
- పేరు మార్పు (ప్రూఫ్ తప్పనిసరి)
- పుట్టిన తేదీ మార్పు
- (తగిన ఆధారం ఉండాలి)
- జెండర్ మార్పు
- ఆధార్ డాక్యుమెంట్ అప్‌డేట్
- గుర్తింపు పత్రం తప్పనిసరి)
- చిరునామా మార్పు
- (తగిన ఆధారం చూపాలి)
- కొత్తగా ఆధార్ నమోదు
- ఆధార్ కార్డు డౌన్‌లోడ్
- పదేళ్లకోసారి నవీకరణ తప్పనిసరి
- జిల్లాలోని 82 సచివాలయాల్లో
- నమోదు కేంద్రాలు
- ప్రత్యేక మొబైల్ క్యాంపుల నిర్వహణ
- చిరునామా, మొబైల్ నంబర్లు,
- ఫొటో మార్చుకునే అవకాశం
- భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవు
2011 సంవత్సరం తరువాత ఆధార్ పొందిన వారు తమ కార్డులను అప్‌డేట్ చేయించుకోవాలి. పదేళ్లుగా ఎటువంటి అప్‌డేషన్ చేయించుకోని వారు ఒరిజినల్ గుర్తింపు కార్డులతో ఆధార్ సెంటర్లకు వెళ్లాలి. వాటిని అప్‌లోడ్ చేయించుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవు.
0 Response to "Aadhaar services coming soon."
Post a Comment