Late arrival is not allowed
ఆలస్యంగా వస్తే అనుమతి లేదు
- పదో తరగతి పబ్లిక్ పరీక్షలపై పాఠశాల విద్యాశాఖ సర్క్యులర్
- ఉదయం 8.45 గంటల నుంచి 9.30 వరకు పరీక్ష హాల్లోకి అనుమతి
- ఆ తర్వాత ఎవరినీ అనుమతించరు
- 12.45 గంటల తర్వాతే పరీక్ష కేంద్రం నుంచి బయటకు.
- 3 నుంచి 18 వరకు పరీక్షలు
రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుంచి 18 వరకు జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులను ఉదయం 8.45 గంటల నుంచి 9.30 గంటల వరకు మాత్రమే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్ తెలిపారు.
9.30 గంటల తర్వాత ఆలస్యంగా వచ్చిన ఎవరినీ అనుమతించబోమన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సర్క్యులర్ విడుదల చేశారు. www.bse.ap.gov.in లో పదో తరగతి పరీక్షల టైమ్‌టేబుల్‌ను చూడొచ్చన్నారు. అన్ని పరీక్షలను నిర్దేశించిన తేదీల్లో ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు నిర్వహిస్తామని చెప్పారు.
విద్యార్థులకు సూచనలు.
హాల్‌టికెట్లు పొందాక విద్యార్థులంతా తమ పేరు, పుట్టిన తేదీ, ఫొటో వంటి అన్ని వివరాలను సరిచూసుకోవాలి. వాటిలో పొరపాట్లు గమనిస్తే పాఠశాల హెడ్‌మాస్టర్/ప్రిన్సిపాల్‌ని సంప్రదించాలి.
విద్యార్థులు తప్పనిసరిగా హాల్‌టికెట్‌లను తమతో పాటు పరీక్షకు తీసుకెళ్లాలి. హాల్‌టికెట్ లేకపోతే పరీక్షకు అనుమతించరు.
పరీక్ష కేంద్రంలోకి మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్పీకర్లు, స్మార్ట్ వాచ్‌లు, బ్లూటూత్, కెమెరాలు, ఇయర్ ఫోన్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురాకూడదు. ఎవరైనా వాటిని లోపలకు తీసుకువెళ్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారు.
విద్యార్థులు ఫిజికల్ సైన్స్, నేచురల్ సైన్స్ ప్రశ్నలను వేర్వేరు సమాధాన పత్రాల్లో రాయాలి. ఈ రెండింటి కోసం వేర్వేరుగా 12 పేజీల సమాధానాల బుక్‌లెట్లు ఇస్తారు.
విద్యార్థులను అత్యవసర పరిస్థితుల్లో మినహా 12:45 గంటల వరకు పరీక్ష హాల్ నుంచి బయటకు వెళ్లడానికి అనుమతించరు.
ప్రశ్నపత్రాల లీక్ అని తప్పుడు, నిరాధారమైన పుకార్లకు పాల్పడకూడదు. వదంతులను వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారు.
పరీక్ష సమయంలో అక్రమాలకు పాల్పడేవారిపై, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చర్యలు ఉంటాయి. అలాంటివారిని తదుపరి పరీక్షలు రాయనీయరు.
విద్యార్థి పేరు, రోల్ నంబర్, ఇతర వివరాలను 24 పేజీల జవాబు బుక్‌లెట్, మ్యాప్ లేదా గ్రాఫ్ షీట్‌లోని ఏ పేజీలోనూ రాయకూడదు.
♦ కాగా పరీక్షలు జరిగే రోజుల్లో ఎంఈవోలు, హెచ్‌ఎంలు, చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్ల విధులపైనా సూచనలు జారీ చేశారు.
0 Response to "Late arrival is not allowed"
Post a Comment