Mokshamepada for teachers' promotions.
టీచర్ల ప్రమోషన్స్ కు మోక్షమెప్పుడు.
ప్రభుత్వ ఉద్యోగంలోకి ప్రవేశించిన ప్రతి ఉద్యోగికి విధిగా వారి అర్హతల మేరకు పదోన్నతులు కల్పించడం, నిర్ణీత కాల వ్యవధి పూర్తవగానే బదిలీలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత.
వాళ్ళు చేసిన పాపమేంటి?
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత కేవలం ఒకే ఒక్కసారి 2015లో రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. కానీ గత ఎనిమిదేళ్లుగా పదోన్నతులు, ఐదు ఏళ్లుగా బదిలీలు లేక ఉపాధ్యాయులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారనేది వాస్తవం. ఈ బదిలీలకు, ప్రమోషన్లకు ఏకీకృత సర్వీస్ రూల్స్ ప్రధాన అడ్డంకిగా ఉన్నాయనుకుంటే, 2009, 2015లో పదోన్నతులు కల్పించిన సందర్భంలో కూడా సర్వీస్ రూల్స్‌ని ప్రభుత్వం పాటించలేదు. కానీ ఉన్నత న్యాయస్థానం తుది తీర్పుకు లోబడి అనే వాక్యం చేర్చి ప్రక్రియను పూర్తిచేసింది. మరి ప్రస్తుతం అదే విధానాన్ని కొనసాగిస్తూ పదోన్నతుల ప్రక్రియను ఎందుకు పూర్తి చేయడం లేదు?
నిజానికి ఉపాధ్యాయ ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని, ఖాళీలు పది శాతానికి మించకూడదని విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 26 సూచిస్తుంది, కానీ అవేవీ ప్రభుత్వం పట్టించుకోకుండా ఇంచార్జ్‌లతోనే కాలం వెళ్లదీస్తోంది. విద్యా వ్యవస్థకు దిశా నిర్దేశం, భావి భారత ఉపాధ్యాయులను తయారు చేసే జిల్లా ఉపాధ్యాయ శిక్షణా సంస్థలు, రాష్ట్ర విద్యా పరిశోధక శిక్షణా సంస్థ (SCERT)లోని అధ్యాపకులు, ప్రొఫెసర్‌లు కేవలం అరు శాతం మాత్రమే పనిచేస్తున్నారు. అలాగే పాఠశాల విద్యాశాఖలో జిల్లా విద్యాశాఖాధికారుల, మండల విద్యాధికారుల ఇంచార్జ్‌ల పాలన కొనసాగుతోంది. రాష్ట్రంలోని 607 మండలాలకు గానూ కేవలం 21 రెగ్యులర్ ఎంఓఏలే పనిచేయడం నేటి దుస్థితికి అద్దం పడుతుంది. విద్యాశాఖలో కారుణ్య నియామక పథకం క్రింద జూనియర్ అసిస్టెంట్‌గా నియామకమైనవారు నేడు అడిషనల్ డైరెక్టర్, జిల్లా విద్యాశాఖధికారి హోదాలో ఉండటం అంతకన్నా ముందే నియామకమైన టీచర్లు మాత్రం పదోన్నతులు లేక అదే క్యాడర్‌లో పదవీ విరమణ పొందడం టీచర్లు చేసుకున్న పాపమా?
ఈ సెలవుల్లోనైనా పూర్తయ్యేనా?
నిజానికి టీచర్ల ప్రమోషన్‌లు వారి వ్యక్తిగత ప్రయోజనంగా భావించకూడదు. అది లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు, వారి విద్యాభ్యాసానికి పాఠశాల విద్య బలోపేతానికి చెందిన అంశంగా భావించాలి. చాలా ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు దిశా నిర్దేశం చేసే ప్రధానోపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సబ్జెక్టు టీచర్ల కొరత వెంటాడుతోంది. వర్క్ అడ్జెస్ట్‌మెంట్, విద్యా వాలంటీర్ల వైపు దృష్టిసారిస్తున్న ప్రభుత్వం పదోన్నతులు కల్పించడంపై శ్రద్ద తీసుకున్నట్లయితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికేది. చివరికి ఉపాధ్యాయ సంఘాల పోరాటాల ఫలితంగా పరీక్షలు సమీపిస్తున్న దశలో, ఎమ్మెల్సీ ఎన్నికల తరుణంలో, జనవరిలో హడావిడిగా బదిలీలు పదోన్నతులు సుదీర్ఘ షెడ్యూల్ విడుదల చేయడంతో ఉపాధ్యాయుల్లో ఆశలు చిగురించాయి. కానీ విడుదల చేసిన ఉత్తర్వుల్లో స్పష్టత లేకపోవడంతో కొందరు ఉపాధ్యాయులు తమకు నష్టం జరుగుతుందని న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కోర్టు స్టే విధించడంతో ఆగిపోయాయి. ఈ వేసవి సెలవుల్లో నైనా ప్రక్రియ పూర్తవుతుందనే ఆశతో టీచర్లు ఎదురుచూస్తున్నారు.
అందుకే ప్రభుత్వం ఇప్పటికైనా కోర్టు కేసుల పేరుతో కాలయాపన చేయకుండా బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలి. పదోన్నతులకు శాశ్వత బదిలీ కోడ్‌ను రూపొందించాలి. బదిలీల, ప్రమోషన్ల చేపట్టే ముందు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో కూలంకుషంగా చర్చించిన అనంతరం ఉత్తర్వులు విడుదల చేయాలి. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా నెల వారి ప్రమోషన్ల పద్ధతిని కొనసాగించాలి. ప్రమోషన్ల పేరుతో టీచర్ల భావోద్వేగాలతో అడుకోకుండా త్వరగా ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలి.
0 Response to "Mokshamepada for teachers' promotions."
Post a Comment