Today is Chaitra Poornima, what does it mean? Why is this festival important?
ఈరోజు ఛైత్ర పూర్ణిమ , అంటే ఏమిటి ? ఈ పండుగకు ఎందుకంత ప్రాధాన్యత ?
హిందూ క్యాలెండర్ ప్రకారం , ప్రతి నెలలో పౌర్ణమి వస్తుంది. అయితే తొలి మాసంలో వచ్చే ఛైత్ర పూర్ణిమను అదృష్ట పూర్ణిమగా పరిగణిస్తారు.
సనానత ధర్మంలో ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండటం వల్ల మీ కోరికలు నెరవేరడంతో పాటు భగవంతుడి అపారమైన అనుగ్రహం పొందొచ్చని పండితులు చెబుతున్నారు.
ఈరోజు చంద్రునికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల విశేష ఫలితాలోస్తాయని భక్తుల నమ్మకం. తెలుగు సంవత్సరంలో ఛైత్రం మొదటి మాసం కాబట్టి ఈ నెలను చంద్రమాసం అని కూడా అంటారు. ఈ ఏడాది ఛైత్ర పూర్ణిమ ఏప్రిల్ 5వ తేదీన బుధవారం వచ్చింది. ఈ సందర్భంగా ఛైత్ర పూర్ణిమ అంటే ఏమిటి ? ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
విష్ణువుకు ప్రత్యేక పూజలు.
పురాణాల ప్రకారం ఛైత్ర పూర్ణిమ రోజు శ్రీ మహా విష్ణువుకు భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం వల్ల ఆ భగవంతుని ప్రత్యేక అనుగ్రహం పొందుతారు. ఈ పవిత్రమైన రోజున చంద్రునికి సంబంధించిన వ్రతం చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి. అంతేకాదు ఈరోజు పేదవారికి దానం చేయడం ద్వారా చంద్రుడు ప్రసన్నమవుతాడని నమ్ముతారు. ఈరోజు ఉదయాన్నే గంగానదిలో లేదా పారుతున్న నీటిలో స్నానం చేయడం వల్ల ప్రత్యేక ఫలితాలు లభిస్తాయట. ఈరోజున తులసి స్నానం చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని చాలా మంది విశ్వాసం.
ఛైత్ర పూర్ణిమ నాడు.
హిందూ పురాణాల ప్రకారం , ఎవరైనా నియమ నిష్టలతో , పూర్తి భక్తి శ్రద్ధలతో ఉపవాసముండాలి. అలా లేకపోతే దానికి సంబంధించిన ఫలితం లభించదు. ఇదే పద్ధతిని ఛైత్ర పూర్ణిమ రోజున అనుసరించాలి. ఈరోజు ఉపవాసం ఉండటంతో పాటు.. లక్ష్మీదేవిని పూజించాలి. అలాగే కనకధార స్తోత్రం పఠించవచ్చు. అనంతరం చీకటి పడ్డాక చంద్రుడికి నీటిని సమర్పించాలి. తర్వాత బ్రహ్మాణులకు ఆహారం దానం చేయాలి. లేదా పేదలకు దానం చేయొచ్చు. ఇలా చేయడం వల్ల చంద్రుడు కోరికలను నెరవేరుస్తాడని పండితులు చెబుతారు.
సత్యనారాయణ స్వామి ఆరాధన.
ఛైత్ర పూర్ణిమ రోజున సత్యనారాయణ స్వామిని ప్రత్యేకంగా పూజిస్తారు. రామాయణం లేదా భాగవతం గురించి తెలియని వారు ఈరోజు సత్య నారాయణ స్వామి కథను వింటే మంచి ఫలితం ఉంటుంది. ఈ పౌర్ణమి రోజున ఈ కథను ఇంట్లో వినడం వల్ల ప్రత్యేకమైన ఫలితం వస్తుంది. అంతేకాకుండా ఇంట్లో సంతోషం , శ్రేయస్సుతో పాటు ఆదాయ పరంగా శుభప్రదమైన ఫలితాలు వస్తాయి.
ఛైత్ర పూర్ణిమ ప్రాముఖ్యత.
అన్ని పౌర్ణమిల కంటే ఛైత్ర పూర్ణిమకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గగనంలో జాబిల్లి నిండుగా కనిపించడాన్నే పౌర్ణమి అంటారని మనందరికీ తెలిసిందే. అంటే చీకటిపై వెలుగు విజయం సాధించడం అనేది దీనర్థం. చెడుపై మంచి విజయం సాధించడం అని కూడా అంటారు. ఈరోజున విష్ణుమూర్తికి , చంద్రుడికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయని భక్తులు నమ్ముతారు. ఈరోజున పేదలకు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.



0 Response to "Today is Chaitra Poornima, what does it mean? Why is this festival important?"
Post a Comment