Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

FATHER'S DAY

 నాన్నంటే ధైర్యం. నాన్నంటే సంతోషం. నాన్నంటే నమ్మకం. నాన్నంటే సమాజంలో మనల్ని ముందుకు నడిపించే నేస్తం. చెప్పుకుంటూ పోతే జీవితమనే డైరీలో నాన్నకోసం పేజీలెన్నో. మరి అలాంటి తండ్రి గురించి ‘ఫాదర్స్‌ డే’ Franchise ఈ ప్రముఖులు ఏం చెబుతున్నారంటే.

పుస్తకమే రాయొచ్చు.

నారా లోకేశ్‌

నా చిన్నతనంలో నాన్నగారు ఇంట్లో ఉన్న కాసేపు రాజకీయాల గురించే మాట్లాడేవారు. ఆ ప్రభావంతోనే నేనూ రాజకీయాల్లోకి వచ్చా. ఒక్కగానొక్క కొడుకును కాబట్టి గారాబంగా పెంచారని చాలామంది అనుకుంటారు. నాన్నగారు చాలా స్ట్రిక్టు. లోపల ప్రేమ ఉన్నా దాన్ని పైకి కనపడనీయరు. చేసే పనిలో స్వేచ్ఛనిస్తారు. తప్పు జరుగుతుందని తెలిసినా అడ్డుచెప్పరు. దాని ఫలితం వచ్చాక ‘చూశావా అలా చేస్తే ఏమవుతుందో’నని ప్రాక్టికల్‌గా చూపిస్తుంటారు. అలానే ఓటమికి కుంగిపోకుండా పడిన చోటే నిలబడి చూపించాలన్నదీ ఆయన్నుంచే నేర్చుకున్నా. పార్టీలో ప్రతి కార్యకర్తనీ కలుపుకుంటూ వెళతారు. వర్తమాన వ్యవహారాలపై మంచి పట్టున్న నాన్నగారు ఎన్నో విషయాలు చెబుతారు. ఆయన దగ్గర పనిచేస్తున్నప్పుడు దొరికే సంతృప్తి వెలకట్టలేనిది. ఆహారం, ఆరోగ్యం విషయంలో నాన్న అంత కఠినంగా ఎవరూ ఉండరేమో అనిపిస్తుంది. అలానే చేతికి వాచీ పెట్టుకోరు. ధర తక్కువ షూస్‌నే ధరిస్తారు. ఎప్పుడూ ఒకేలాంటి డ్రెస్సింగ్‌ స్టైల్‌. నేను ఆయనలా ఉండటానికి ప్రయత్నిస్తున్నా. మహిళల్ని నాన్న గౌరవంగా చూసే తీరు నచ్చుతుంది. అమ్మ మాటకి ఎంతో విలువ ఇస్తారు.బ్రాహ్మణిని కూతురిలా చూసుకుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే నాన్న గురించి ఓ పుస్తకమే రాయొచ్చు

కలెక్టర్‌గా చూడాలనుకున్నారు

కేటీఆర్‌

చదువంటే నాన్నకు చాలా ఇష్టం.  ‘నీకు నేను ఆస్తులు ఇవ్వకలేకపోవచ్చు. కానీ, ఎంతవరకు కావాలంటే అంత దాకా చదివిస్తా. నీకు తెలివితేటలుంటే రాణిస్తావు. కాదూ అంటే- మా నాన్న నాకిచ్చిన పదెకరాలు నీకిస్తా. దుక్కి దున్నుకొని వ్యవసాయం చేసుకో’ అన్నారు. అందుకే అంతదాకా రానీయకుండా బాగానే చదివేవాణ్ని. క్రమశిక్షణా, ప్రతిరోజూ గంటన్నర పేపరు చదవడం వంటివి నేర్పించారు. లక్ష్యం విషయానికొస్తే- నాన్న నన్ను కలెక్టర్‌గా చూడాలనుకున్నారు. సివిల్స్‌కి ప్రిపేర్‌ అవడం కోసం దిల్లీ జేఎన్‌యూకి కూడా పంపారు. అక్కడ ‘వెన్‌ పాలిటిక్స్‌ డిసైడ్స్‌ యువర్‌ ఫ్యూచర్‌, యు డిసైడ్‌ వాట్‌ యువర్‌ ఫ్యూచర్‌ పాలిటిక్స్‌ షుడ్‌ బి’ అన్న కొటేషన్‌ నన్ను బాగా ఆకర్షించడంతో రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నా. ఆ తరవాత ఉన్నత చదువుకోసం అమెరికా వెళ్లి- అక్కడే కొంత కాలం ఉద్యోగం చేశా. 2006 ఉప ఎన్నికల సమయంలో ఉద్యోగం మానేసి రాజకీయాల్లోకి వచ్చా. ‘నువ్వు పార్టీకోసం పనిచేస్తానంటే నేను ప్రోత్సహించను, అలాగని వద్దనీ చెప్పను. అందరితోపాటే నువ్వు కూడా’ అన్నారు. దాంతో కార్యకర్తలానే పార్టీలో నా జీవితం మొదలుపెట్టా.నేను చేసే పనులూ, తీసుకునే నిర్ణయాలూ ఆయన పేరును చెడగొట్టకుండా చూసుకుంటున్నా. అలానే సభల్లో మాట్లాడుతుంటే ‘కేటీఆర్‌కు వాక్చాతుర్యం ఎక్కువ’ని చాలామంది అంటుంటారు. చిన్నప్పట్నుంచీ నాన్నలా పుస్తకాలు చదవడం, ఆయన మాటలు వింటూ పెరగడం వల్లే- నాకూ ఆ వాగ్ధాటి కొంత అబ్బింది అనిపిస్తుంది.

వీపు మీద ఒక్కటేశారు.

రామ్‌చరణ్‌

నా జీవితంలో గురువు అంటే నాన్నగారే. ఇంటికి పెద్దలు వచ్చినప్పుడు వాళ్ల కాళ్లకి నమస్కరించే సంస్కారం ఆయనే నేర్పించారు. అలానే ఆయన నానమ్మని ఎంత ప్రేమగా చూసుకుంటారో అంతకంటే ఎక్కువ గౌరవిస్తారు. నన్నూ అలానే ఉండమని చెబుతారు. ఒకసారి అమ్మతో ఏదో వాదిస్తుంటే నాన్నగారికి కోపం వచ్చి వీపు మీద గట్టిగా ఒకటేశారు. నేనే కాదు, ఎవరైనా సరే తల్లితో అగౌరవంగా ప్రవర్తిస్తే ఆయనకు నచ్చదు. అలానే మా చిన్నతనంలో ఆయన అందుకున్న అవార్డులను ఇంటికి తీసుకొచ్చేవారు కాదు. వాటన్నింటినీ ఇంటి కింద ఓ గదిలో పెట్టి వచ్చేవారు. ఒక ఫేమస్‌ ఆర్ట్టిస్ట్‌ పెయింటింగ్‌ వేసినా అది కూడా మా వరకూ రాలేదు. ఆయన వృత్తి ప్రభావం ఇంట్లో వాళ్ల మీద పడకూడదన్నది నాన్నగారి అభిప్రాయం. నటుల మధ్య పోటీ ఆరోగ్యకరంగా ఉండాలి కానీ హాని చేసే స్థాయిలో ఉండకూడదని చెబుతుంటారు. అందుకే నాన్నగారు అందరి సినిమాలు చూస్తుంటారు. సినిమా నచ్చితే అందులో నటీనటులు చిన్నవాళ్లా, పెద్దవాళ్లా అని చూడకుండా వాళ్లని ఇంటికి పిలిచి మరీ అభినందిస్తుంటారు. అలానే ఫిట్‌నెస్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే అస్సలు ఊర్కోరు. ఆరోగ్యం విషయంలో ఆయనే నాకు స్ఫూర్తి.

గుండె మండిపోయినా.

రాహుల్‌ గాంధీ

నాన్న రాజీవ్‌గాంధీతో గడిపింది చాలా తక్కువ కాలమే కానీ, నేర్చుకుంది మాత్రం ఎంతో ఉంది.  నాకు క్షమాగుణాన్నీ, సహానుభూతినీ అలవరిచిన నాన్నకి భయం అనేది తెలియదు.  ఆయన్ని చంపేస్తామని బెదిరింపులు వచ్చినా జంకేవారు కాదు. ‘నా చావు నాకు తెలుసు. మీతో ఎక్కువ రోజులు ఉండన’ని చెబుతూనే- మమ్మల్ని మానసికంగా సిద్ధం చేసిన ధీశాలి నాన్న. నానమ్మ మరణానంతరం పైలట్‌ వృత్తిని పక్కన పెట్టేసి, తనకు ఏ మాత్రం ఆసక్తీ, అవగాహనా లేని రాజకీయాల్లోకి వచ్చారు. ప్రతిదీ నేర్చుకుని దేశాన్ని సమర్థంగా పాలించారు. తనకంటే వయసులో పెద్దవారైన నాయకుల్నీ, అధికారుల్నీ ఎంతో గౌరవించేవారు. మెరుగైన పాలనే లక్ష్యంగా ఎంతో కష్టపడేవారు. దురదృష్టవశాత్తూ ఆత్మాహుతి దాడిలో ఆయన దూరమయ్యారు. నాన్న చితిమంటలానే నా గుండె కూడా ఆ క్షణంలో ఎంతో రగిలిపోయింది. చాలాకాలం పాటు అందరి మీదా కోపంగా ఉండేవాడిని. కానీ నాన్న నేర్పిన క్షమాగుణం వల్లే నన్ను నేను శాంతపరుచుకోవడంతోపాటు ఆయనను చంపినవారికి క్షమాభిక్ష పెట్టగలిగా. ఇప్పటికీ ఎన్ని సవాళ్లు ఎదురైనా నాన్న లక్ష్యం కోసమే పోరాటం చేస్తున్నా.

ఆ రోజు ఎంత ఏడ్చానో.

విరాట్‌ కోహ్లీ

నేను క్రికెటర్ని అవుతానని నమ్మిన నాన్న ప్రేమ్‌నాథ్‌ కోహ్లీ నన్ను చిన్నతనంలోనే కోచ్‌ దగ్గర చేర్పించారు. 2006లో నేను దిల్లీ జట్టుకి కెప్టెన్‌ అయ్యాక- నాన్నకి బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చింది. ఆయనకి ఏదీ మధ్యలో వదిలిపెట్టడం, సమస్య వస్తే బాధపడటం ఇష్టం ఉండదు. అందుకే హాస్పిటల్లో నాన్నతో ఉండకుండా ఆటలోనే మునిగిపోయా. ఒకరోజు రాత్రి రెండు గంటలకి నిద్రలోనే శాశ్వతంగా కన్నుమూశారు. ఆరోజు ఎంత ఏడ్చానో... నా ప్రాణమే పోయినట్టు అనిపించింది. క్రికెట్‌ ఆడాలనిపించలేదు. కానీ అలా చేయడం నాన్నకి నచ్చదని నాకు నేను సర్ది చెప్పుకుని మ్యాచ్‌ ఆడి మైదానం నుంచి నేరుగా శ్మశానానికి వెళ్లి- అంత్యక్రియల్లో పాల్గొన్నా. చిన్నతనంలో ‘నిన్ను నువ్వు నమ్ముకోగానీ నీకోసం ఎవరో వచ్చి ఏదో చేస్తారని దేని కోసం ఎదురు చూడక’ని చెప్పేవారు. ఆ మాటల్ని తు.చ.తప్పక పాటిస్తున్నా. నేను ఎత్తు తక్కువని చిన్నతనంలో చాలామంది ఏడిపించేవారు. ఆత్మన్యూనతకు లోనై ఏడ్చేవాడిని. ‘నువ్వు గెలిచి నిలబడితే అందరికీ నీ విజయమే కనిపిస్తుంది. నీ లోపమే చిన్నబోతుంద’ని ధైర్యం చెప్పేవారు. ఆ ధైర్యమే ఇప్పుడు నన్ను నడిపిస్తోంది.

పట్టుదలగల మనిషి.

స్వప్న దత్‌

ఆడపిల్లలు ఉన్న కుటుంబాల్లో... పెద్ద కూతురికి త్వరగా పెళ్లి చేయాలనే ఆలోచన చాలామంది తల్లిదండ్రులకు ఉంటుంది. నాన్న అశ్వనీదత్‌ మాత్రం ‘పెళ్లి ఇవాళ కాకపోతే రేపయినా తప్పదు. ముందు తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకోవాలి’ అనేవారు. చదువుకు ప్రాధాన్యమిస్తూనే మనసుకు నచ్చింది చేయమని ప్రోత్సహించేవారు. అందుకే మగవాళ్లే ఎక్కువగా ఉండే నిర్మాణ రంగంలోకి వస్తానంటే అడ్డు చెప్పకుండా ప్రోత్సహించారు. అలానే విజయం సాధిస్తే పొంగిపోవడం, ఓడిపోతే కుంగిపోవడం నాన్నకు నచ్చవు. కష్టాన్ని నమ్ముకొని పట్టుదలతో పైకి వచ్చిన వ్యక్తి ఆయన. నేనూ ‘వైజయంతీ మూవీస్‌’ బాధ్యతలు తీసుకున్నాక ఆయనలా ఆలోచించడం మొదలుపెట్టా. కొత్త ప్రయోగాలు చేయడానికి వెనకాడట్లేదు. ఒక పని అనుకుంటే దాని ఫలితం ఆశించకుండా- ప్రయత్నలోపం లేకుండా కచ్చితంగా అది పూర్తి చేయాలనుకుంటారు. అందుకే ‘మహానటి’, ‘సీతారామం’ వంటి పెద్ద హిట్లను ప్రేక్షకులకు ఇవ్వగలిగాం. ఇక మీదటా నాన్న ప్రోత్సాహంతో మరిన్ని మంచి సినిమాలు తీయాలనుకుంటున్నా.

విలాసాలు ఇష్టం ఉండవు

ఈషా అంబానీ

రిలయన్స్‌ను మేటి సంస్థగా నిలపడం తాతగారి కోరిక. దాన్ని నెరవేర్చేందుకు నాన్న పడ్డ కష్టాన్ని చూస్తూ పెరిగా. చిన్నతనంలో నన్ను చాలానే గారాబం చేసినా అడిగినంత పాకెట్‌మనీ మాత్రం ఇచ్చేవారు కాదు. ఏం కావాలో అది మాత్రం కొనిచ్చేవారు. రేపటి పనిని కూడా ఇవాళే చేయాలనే ధోరణి ఆయనది. సమయాన్నీ, డబ్బునీ అస్సలు వృథా చేయరు. విలాసవంతంగా గడపడం నాన్నకి నచ్చదు. అందుకే స్టాన్‌ఫోర్డ్‌లో చదివేటప్పుడు పాకెట్‌ మనీకోసం పిల్లలకు ట్యూషన్లు చెప్పి సంపాదించుకునే దాన్ని. అంతేతప్ప ఇంటి నుంచి పంపమని అడిగే దాన్ని కాదు. చదువై ఇండియాకి తిరిగొచ్చాక అన్నయ్యా, తమ్ముడితో సమానంగా నేనూ వ్యాపార బాధ్యతలు తీసుకోవాలని నాన్న కోరుకున్నారు. సంస్థలో కొంత కాలం నేను సాధారణ ఉద్యోగినిగా పనిచేసినప్పుడు కింది స్థాయి సిబ్బందితో నాన్న మర్యాదగా వ్యవహరించిన తీరు నాకెంతో నచ్చింది. పని ప్రదేశంలో అలాంటి వాతావరణం ఉత్పాదకతను పెంచుతుందని అర్థం చేసుకున్నా. ఆఫీసులో నాన్న దగ్గర కూతురిలా కాకుండా సబార్డినేట్‌గానే ఉంటా. ప్రతిదీ ఆయనకు చెప్పే చేస్తుంటా.

నా పేరు వాడుకోకు అన్నారు.

ఆలియా భట్‌

నాన్న మహేశ్‌భట్‌ నా చిన్నతనంలో ఇంట్లో కంటే సెట్‌లోనే ఎక్కువ ఉండేవారు. ఆయన్ని మిస్‌ అవుతున్నానని ఏడిస్తే మధ్యాహ్నం భోజనానికి పిలిచి... కాసేపు కబుర్లు చెప్పి ఆ బెంగ అంతా తీర్చేవారు. ఆయన సినీ రంగంలో ఉన్నా- నేను సినిమాల్లోకి వస్తానంటే ప్రోత్సహించలేదు. ‘ఏ రంగంలో రాణించాలన్నా ప్రతిభ ముఖ్యం. నా కూతురిగా సినిమాల్లోకి రావడం, నా పేరు వాడుకుని అవకాశాలు సంపాదించడం నాకు ఇష్టముండదు’ అన్నారు. నాన్న పేరు వాడుకోనని ఆ క్షణమే మాట ఇచ్చి దాన్ని నిలబెట్టుకున్నా. ‘సక్సెస్‌నీ స్టార్‌డమ్‌నీ ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోవద్ద’ని చెబుతుంటారు. అందుకే సినిమా ఫలితాన్ని పట్టించుకోకుండా నటన మీదే దృష్టి పెడుతుంటా.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "FATHER'S DAY "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0