Is it because fifth graders can't read the second grade curriculum?
రెండో తరగతి పాఠ్యాంశాన్ని అయిదో తరగతి పిల్లలు చదవలేకపోవడమా?
- ఇలాంటి దుస్థితికి సిగ్గుపడాలిమాతృభాష రాకపోతే
- గతంలో సిగ్గుపడేవాళ్లు
- ఇప్పుడేమో తెలుగు రాదని గొప్పగా చెబుతున్నారు
- అమ్మ భాషపై పట్టులేకుంటే నైపుణ్యాల సాధన కష్టం
- లోపాల్ని సరిదిద్దేందుకు ఏంచేస్తారో చెప్పండి
- ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
రెండో తరగతి పాఠ్యాంశాన్ని అయిదో తరగతి, అయిదో తరగతి పాఠాన్ని పదో తరగతి పిల్లలు చదవలేకపోవడం ఏమిటని హైకోర్టు విస్మయం చెందింది. ఇలాంటి దుస్థితికి సిగ్గుపడాలని ఘాటుగా వ్యాఖ్యానించింది. భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దేది ఇలాగేనా అని ప్రశ్నించింది. దేశ భవిష్యత్తు విద్యార్థులతో ముడిపడి ఉందని పేర్కొంది. మాతృభాష రాకపోతే గతంలో సిగ్గుపడేవాళ్లని.. ఇప్పుడేమో తెలుగు రాదని గొప్పగా చెబుతున్నారని వ్యాఖ్యానించింది. ఇలాంటి పరిస్థితులు చూస్తుంటే ఎటుపోతున్నామనే సందేహం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. మాతృభాషపై పట్టు లేకుంటే ఇతర భాషలపై నైపుణ్యం సాధించలేరని అభిప్రాయపడింది. సమాజంలో మేధావులు ఉన్నారని, సమస్యలను అధిగమించేందుకు వారి సలహాలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. లోపాలను సరిదిద్దేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బేస్‌లైన్, టీఏఆర్‌ఎల్ టెస్ట్‌ల ఫలితాలను ఎందుకు ప్రచురించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పూర్తి వివరాలు సమర్పించేందుకు విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వ న్యాయవాది పేర్కొనడంతో అసంతృప్తి వ్యక్తంచేసింది. కౌంటర్ దాఖలుతో సమస్య పరిష్కారం కాదని.. లోపాలను సరిదిద్దుకునేందుకు చర్యలు ప్రారంభించాలని హితవుపలికింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ ఆర్.రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం బుధవారం ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అధ్యయన సామర్థ్యాన్ని పరీక్షించేందుకు విద్యాహక్కు చట్టం, ఎస్‌సీఈఆర్‌టీ(స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్, ట్రైనింగ్) నిబంధనల మేరకు నిర్వహించిన బేస్‌లైన్, టీఏఆర్‌ఎల్ టెస్టుల(టీచింగ్ ఎట్ రైట్ లెవల్ టెస్ట్) ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం బహిర్గతం చేయకపోవడాన్ని సవాలు చేస్తూ గుంటుపల్లి శ్రీనివాస్ హైకోర్టులో పిల్ వేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌బాబు వాదనలు వినిపించారు. విద్యార్థుల పఠన సామర్థ్యం తగ్గిపోతోందన్నారు. రెండో తరగతి పాఠ్యాంశాన్ని అయిదో తరగతి, అయిదో తరగతి పాఠాన్ని పదో తరగతి పిల్లలు ఎక్కువమంది చదవలేకపోతున్నారన్నారు. వార్షిక స్థాయి విద్యా నివేదిక (ఏఎస్‌ఈఆర్)-2022 ఇదే విషయాన్ని చెబుతోందన్నారు. పరిస్థితులు ఇలా ఉంటే పదో తరగతిలో 97 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రభుత్వం గొప్పలు చెబుతోందన్నారు. విద్యా ప్రమాణాలు ఈ విధంగా ఉంటే 97శాతం ఉత్తీర్ణత ఏవిధంగా సాధ్యమన్నారు. సమస్య ఎక్కడుందో ప్రభుత్వం అక్కడ దృష్టిపెట్టడం లేదన్నారు. బేస్‌లైన్, టీఏఆర్‌ఎల్ టెస్టు ఫలితాలను ప్రభుత్వం తల్లిదండ్రులకు ఇవ్వడం లేదన్నారు. ఫలితాలను వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేసి వెంటనే తొలగించారని పేర్కొన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం..పఠన సామర్థ్యం విద్యార్థుల్లో పడిపోవడంపై ఆశ్చర్యం వ్యక్తంచేసింది. తాము చదువుకునే రోజుల్లో పాఠాన్ని విద్యార్థుల ద్వారా గట్టిగా చదివించేవారని గుర్తుచేశారు. ఇప్పుడు అలా జరుగుతోందా అని ప్రశ్నించారు. లోపాలను సరిదిద్దుకునే అంశాలపై దృష్టిపెట్టాలని ప్రభుత్వానికి సూచించారు.
0 Response to "Is it because fifth graders can't read the second grade curriculum?"
Post a Comment