Why is lemon garland given to mother? Why pumpkin as a sacrifice?
అమ్మవారికి నిమ్మకాయ దండలెందుకు వేస్తారు? బలిగా గుమ్మడికాయనే ఎందుకు?
అమ్మవారికి నిమ్మకాయల దండలెందుకు వేస్తారు? గుమ్మడి కాయను ఎందుకు బలి ఇస్తారు?..నిజానికి మాములు రోజుల్లోనే కాదు బోనాలప్పుడూ, కొన్ని ప్రత్యేక పండుగల్లో అమ్మవారికి బలిగా గుమ్మడికాయని సమర్పించడం, నిమ్మకాయల దండలు వేసి అర్చించడం వంటివి చేస్తాం .
ఇలా నిమ్మకాయల దండలు అమ్మవారికి ఎందుకు వేస్తారు ? అసలు ఈ ఆచారం ఎందుకు ప్రారంభం అయ్యింది. మనమొకసారి పరిశీలిస్తే, లక్ష్మీ దేవికి , సరస్వతీ దేవికి ఇలాంటి నిమ్మకాయ దండాలు వేసే ఆచారం కనిపించదు . కానీ శక్తి ఆలయాల్లో, గ్రామదేవతల ఆలయాల్లో ఈ ఆచారం కనిపిస్తుంది.
శక్తి స్వరూపిణి అయినా అమ్మవారు రక్షణ బాధ్యత కలిగినది . నిత్యం శత్రుసంహారాన్ని, లయత్వాన్ని నిర్వహిస్తుంటుంది. లయకారుని శక్తి కదా అమ్మవారు. కాలస్వరూపమై, దుష్టశక్తుల పాలిటి సింహస్వప్నం అయిన దేవికి తామస గుణం ఉంటుంది. దేవి సత్వ స్వరూపమే అయినా సంహార క్రియ నిర్వహించేప్పుడు తామస ప్రవృత్తిని అమ్మ ప్రదర్శిస్తుంది. ఆ దేవీ స్వరూపాలై గ్రామాలకి రక్షణగా కాపలా కాసే గ్రామ దేవతలు కూడా, రాత్రిపూట నగర సంచారం / గ్రామ సంచారం చేస్తూ, దుష్ట శిక్షణ చేస్తారు . అటువంటి వీరత్వాన్ని ప్రతిబింబించేవే ఈ నిమ్మకాయల దండలు.
శిరస్సుకి ప్రతిగానే ఈ కూష్మాండం..
"కూష్మాండో బలిరూపేణ మమ భాగ్యాదవస్థితాః ప్రణమామి తతస్సర్వ రూపిణం బలి రూపిణం". వీరత్వాన్ని ప్రదర్శించాల్సిన దేవికి మాంసాహారం నిషిద్ధం కాదుగా ! రాజులు మాంసాహారాన్ని, బ్రాహ్మణులు సాత్విక ప్రవర్తనతో మెలిగేందుకు శాఖాహారాన్ని తీసుకుంటారు . మరి అమ్మ స్వయంగా శక్తి కాబట్టి ఆమె 'బలిప్రియ'. ఆ బలిగా మనం శిరస్సుని సమర్పించాలి. శిరస్సుకి ప్రతీక కూష్మాండం (గుమ్మడికాయ ). అందుకే మనం దేవికి బలిగా గుమ్మడికాయని సమర్పిస్తూ 'ఓ బలిదానమా ! నా భాగ్యమువలన కూష్మాండ రూపంలో ఉన్నావు (గుమ్మిడికాయ రూపంలో ).
అమ్మవారికి సంతోషాన్ని కలుగజేసి, నా ఆపదలను నశింపజేయి'. అని ప్రార్థిస్తూ గుమ్మడికాయని అమ్మవారికి బలిగా సమర్పించాలని శాస్త్రం సూచిస్తూ ఉంది. అదేవిధంగా నిమ్మకాయ దండలని సమర్పించడము కూడా ! రౌద్ర , తామస స్వరూపిణి అయిన దేవి, ఆమెకి ఇష్టమైన నిమ్మకాయల దండనీ, పులుపుగా ఉండే పులిహోర వంటి నైవేద్యాన్ని స్వీకరించి, శాంతిస్తారని చెబుతారు. అందువలనే అమ్మవారికి నిమ్మకాయల దండలు వేస్తారు.
కానీ ఈ సంప్రదాయాన్ని ఇళ్ళల్లో చేసుకొనే పూజల్లో వినియోగించకూడదని గుర్తుంచుకోవాలి . ఇందులో తాంత్రికపరమైన అర్థాలు కూడా ఉన్నందున ఇలాంటి ఆచారాన్ని ఇంట్లో చేసుకొనే పూజల్లో వాడకపోవడం మంచిది. ఇలా నిమ్మకాయల దండని కావాలనుకుంటే, మీరు తయారు చేసి, గుడిలో ఉన్న దేవతకి సమర్పించి, మీ పేరిట అర్చన చేయించుకొని, అక్కడ చేసిన అర్చనలో నుంచి నిమ్మకాయలు తెచ్చుకొని మీ ద్వారబంధానికి, వాహనానికి కట్టుకోండి. దానివలన దృష్టి దోషాలు తగలకుండా ఉంటాయి. శత్రుపీడలు నివారించబడతాయి. అమ్మ రక్షణలో ఉన్నందువల్ల, దుష్ట శక్తులు దరి చేరకుండా ఉంటాయి . దుష్టశక్తుల పీడని నివారించడానికి వినియోగించే ఈ నిమ్మకాయల దండని కేవలం పరాశక్తికి మాత్రమే వినియోగించాలి.
అంతేగానీ లక్ష్మీ దేవికి, సరస్వతి దేవికి ఈ ఆచారం వర్తించదు.!!
0 Response to "Why is lemon garland given to mother? Why pumpkin as a sacrifice?"
Post a Comment