Sun Mysteries
Sun Mysteries: నాసా చెప్పిన సూర్య రహస్యాలు.. తెలుసుకుంటే ఆశ్చర్యమే!
సూర్యుడి సైజుతో పోల్చితే.. భూమి ఆవగింజంత ఉంటుంది. అలాంటి భూమిలోనే మనకు తెలియని రహస్యాలు చాలా ఉన్నాయి. అలాంటప్పుడు అంత పెద్ద సూర్యుడిలో ఇంకెన్ని ఉంటాయి?
అందుకే ఇస్రో (ISRO) శాస్త్రవేత్తలు ఆదిత్య L1 మిషన్ ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఈ ప్రయాణం అద్భుతం. ఈ మిషన్ ద్వారా శాస్త్రవేత్తలు చెప్పే కొత్త విషయాలు కచ్చితంగా మనలో ఆసక్తిని మరింత పెంచుతాయి. ఈలోగా మనం.. అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా (NASA), సూర్యుడికి సంబంధించి చెప్పిన కొన్ని విచిత్రమైన, ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుందాం.
నాసా ప్రకారం.. మన సౌర వ్యవస్థ ఉన్నది సూర్యుడిలో భాగంగానే. సూర్యుడి బయటివైపు వాతావరణంలోనే మన భూమి, గ్రహాలు, గ్రహశకలాలూ అన్నీ ఉన్నాయి. అందువల్ల సూర్యుడిలో జరిగే ప్రతీ మార్పూ.. మనపై ప్రభావం చూపిస్తుంది. సూర్యుడిని అధ్యయనం చెయ్యడాన్ని హీలియోఫిజిక్స్ (Heliophysics) అంటారు. సూర్యుడిలో ప్రధానంగా ఉన్నది హైడ్రోజన్, హీలియం. వీటితోపాటూ.. మరిన్ని భార లోహాలు కూడా ఉన్నాయి.
సూర్యుడి ఉపరితలమైన కరోనా.. చాలా వేడిగా ఉంటుంది. ఫలితంగా అణువులు.. తమ ఎలక్ట్రాన్స్‌ని కోల్పోతాయి. ఆ అణువులు.. ఎలక్ట్రికల్ ఛార్జ్ కలిగిన అయాన్లుగా మారతాయి. అవి విశ్వంలోకి విసిరేసినట్లుగా సూర్యుడి నుంచి దూసుకెళ్లిపోతాయి. వాటినే మనం ప్లాస్మా, సౌర గాలులు, సౌర తుపాన్లుగా పిలుస్తాం. సూర్యుడిపై ప్రతీ సెకండ్‌కీ కొన్ని మిలియన్ టన్నుల ప్లాస్మా వెళ్లిపోతూ ఉంటుంది. 1994లో అతిపెద్ద సౌర తుపాను వచ్చింది.
సూర్యుడు గుండ్రంగా తనచుట్టూ తాను తిరుగుతూ ఉంటాడు. అందువల్ల సౌర గాలులు చుట్ట (spiral) ఆకారంలో.. అంతరిక్షంలోకి వెళ్తూ ఉంటాయి. ఇవి మన భూమి, గ్రహాలన్నింటినీ దాటి చాలా దూరం వెళ్తాయి. ఐతే.. ఈ సోలార్ అయాన్లు.. విశ్వంలోని ఇతర నక్షత్రాల నుంచి వచ్చే అయాన్లతో కలవవు. పైగా.. ఇవి.. చాలా దూరం ప్రయాణించాక అక్కడ అడ్డుగోడలా, రక్షణ వలయంలా ఏర్పడతాయి. అంటే.. మన సౌర కుటుంబం మొత్తం.. ఓ పెద్ద బంతిలాంటి (bubble-like atmosphere) సౌర అయాన్ల రక్షణలో ఉంది. అందువల్ల మనకు వేరే సూర్యుళ్ల నుంచి వచ్చే సోలార్ రేడియేషన్ ప్రమాదం కలిగించలేదు. 2009లో ఇలాంటి రేడియేషన్, మన సౌరకుటుంబంలోకి రావడానికి ప్రయత్నించింది.
సాసాకి చెందిన విండ్, సోహో, ఏస్.. మిషన్లు... నిరంతరం సూర్యుడి చుట్టూ తిరుగుతూ... సౌర గాలులను పరిశీలిస్తున్నాయి. అలాగే ఐబెక్స్ (IBEX) అనే మరో మిషన్.. ఇతర నక్షత్రాలు, గెలాక్సీ నుంచి వచ్చే రేడియేషన్‌ను పసిగడుతుంది. సౌర గాలుల ద్వారా భూమికి అపాయం ఉంటే.. ఈ స్పేస్ మిషన్లు అలర్ట్ చేస్తాయి. ఇస్రోకి చెందిన ఆదిత్య L1 మిషన్.. ఈ దిశగా మరిన్ని విశేషాలను తెలుసుకునే ఛాన్స్ ఉంది. భూమి కంటే సూర్యుడు 109 రెట్లు పెద్దగా ఉంటాడు. అందువల్ల సూర్యుడిలో 13,00,000 భూ గోళాలు పట్టగలవు. అంత పెద్దది కాబట్టే.. ఇస్రో.. సూర్యుడిపై ఫోకస్ పెట్టింది.
సూర్యుడి గురించి ఎంత తెలుసుకున్నా.. అది చాలా తక్కువే అవుతుంది. సూర్యుడి ఉపరితలంపై వేడి 5,600 డిగ్రీల సెల్సియస్. సూర్యుడి కేంద్రంలో ఉష్ణోగ్రత 1,50,00,000 డిగ్రీల సెల్సియస్. మన పాలపుంత (Milky Way) గెలాక్సీలో సూర్యుడు సెకండ్‌కి 200 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నాడు. అయినప్పటికీ.. పాలపుంతలో ఒక రౌండ్ పూర్తి కావడానికి 23 కోట్ల సంవత్సరాలు పడుతుంది. సూర్యుడు తన చుట్టూ తాను నిమిషానికి 45 కిలోమీటర్లు తిరుగుతూ.. 27 రోజుల్లో ఒక బ్రమణం పూర్తి చేస్తున్నాడు.
సూర్యుడికి సంబంధించి మరో విచిత్రమైన విషయం ఏంటంటే.. సూర్యుడి కేంద్రంలో ఉత్పత్తి అయ్యే ఎనర్జీ.. సూర్యుడి ఉపరితలాన్ని చేరడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. ఈ ప్రయాణంలో.. ఆ ఎనర్జీ ఉష్ణోగ్రత.. 20 లక్షల డిగ్రీల సెల్సియస్ తగ్గిపోతుంది. ఐనప్పటికీ.. సూర్యుడి ఉపరితలంపై ఉండే వేడికి.. వజ్రాలు కూడా కరిగిపోతాయి. ఐతే.. 1869సంవత్సరంలో సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో సూర్యుడి ఉపరితలంపై ఉష్ణోగ్రత 11,11,000 డిగ్రీల సెల్సియస్ పెరిగింది. అంటే ఉపరితలంపై ఉండే ఉష్ణోగ్రత కంటే 200 రెట్లు ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. ఇలా ఎందుకు పెరిగిందో శాస్త్రవేత్తలకు అర్థం కాలేదు. ఇది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.
1869లో సంపూర్ణ సూర్య గ్రహణం వచ్చినప్పుడు సూర్యుడి నుంచి ప్రత్యేకమైన గ్రీన్ స్పెక్ట్రల్ లైన్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ గ్రీన్ కాంతి ఏంటో శాస్త్రవేత్తలకు అర్థం కాలేదు. భూమిపై అలాంటి కాంతి ఎప్పుడూ చూడలేదు. దాంతో.. అది కొత్త మూలకం అయివుంటుందని భావించారు. దానికి కొరొనియం (Coronium) అని పేరు పెట్టారు. ఇప్పటికీ అదేంటన్నది మిస్టరీగానే ఉంది. అసలు ఈ మిస్టరీలను ఛేదించడం సంగతి అలా ఉంచితే.. ఈ విషయాలను ఆలోచిస్తున్నప్పుడు తెరపైకి వచ్చే కొత్త ప్రశ్నలు.. మిస్టరీని మరింత జఠిలం చేస్తున్నాయి. ఇలాంటి ఎన్నో మిస్టరీలు.. క్యూలో ఉన్నాయి. ఇస్రో ప్రయాణం ఇప్పుడే మొదలవుతోంది. భవిష్యత్తులో మనం సమాధానాలను పొందగలం అని ఆశిద్దాం.
0 Response to "Sun Mysteries"
Post a Comment