10 tips from Ayurvedic experts to prevent sudden heart attack ..!
సడెన్ హార్ట్ ఎటాకు రాకుండా ఉండేందుకు ఆయుర్వేద నిపుణులు చెబుతున్న 10 సూచనలు.
బిగ్ బాస్ 13 ఫేమ్ సిద్ధార్థ్ శుక్లా ఆగస్టు 2వ తేదీన హార్ట్ ఎటాక్ కారణంగా చనిపోయిన విషయం విదితమే. అతను చాలా ఫిట్‌గా ఉంటాడు. వ్యాయామం కూడా బాగానే చేస్తాడు.
హార్ట్ ఎటాక్‌లు అనేవి ఒకప్పుడు 55 ఏళ్లు పైబడిన వారికి వచ్చేవి. కానీ మారిన జీవనశైలి కారణంగా 50 ఏళ్ల లోపు వారికి కూడా హార్ట్ ఎటాక్‌లు వస్తున్నాయి. సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల ప్రకారం.. భారతీయులకు ఇతర దేశాలకు చెందిన వారి కన్నా ఎక్కువగా హార్ట్ ఎటాక్‌లు వస్తున్నాయని, వాళ్ల కన్నా మనకు 8-10 ఏళ్లు ముందుగానే హార్ట్ ఎటాక్ లు సంభవిస్తున్నాయని వెల్లడైంది.
మన దేశంలో ప్రతి నలుగురిలో ఒకరి మరణానికి గుండె సంబంధ సమస్యలే కారణమవుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో అనేక సంఖ్యలో మరణాలకు హార్ట్ ఎటాక్ లే కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవడం అనివార్యం అయింది.
అయితే ఆయుర్వేద నిపుణులు చెబుతున్న ప్రకారం కింద తెలిపిన 10 సూచనలు పాటిస్తే దాంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు. వీటిని రోజూ పాటించాల్సి ఉంటుంది. మరి ఆ సూచనలు ఏమిటంటే..
1. మన పెద్దలు, పూర్వీకులు రోజూ రాత్రి త్వరగా నిద్రించేవారు. మరుసటి రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచేవారు. దీంతో వారు చాలా ఆరోగ్యంగా ఉండేవారు. అందువల్ల అలాంటి దినచర్యను అలవాటు చేసుకుంటే మంచిదని, గుండె ఆరోగ్యంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం వల్ల శరీరంలో ద్రవాలు సమతుల్యంలో ఉండడంతోపాటు శరీరానికి ఆక్సిజన్ సరిగ్గా అందుతుంది. దీంతో అనేక వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. గుండెను సురక్షితంగా ఉంచుకోవచ్చు.
2. ఉదయం నిద్ర లేవగానే రెండు గ్లాసుల గోరు వెచ్చని నీటిని తాగాలి. దీంతో శరీరంలోని విష పదార్థాలు, వ్యర్థాలు బయటకు పోతాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. హార్ట్ ఎటాక్ లు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
3. నిత్యం యోగా, ధ్యానం చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు, సెరొటోనిన్ సరిగ్గా విడుదల అవుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గించే హార్మోన్లు. వీటి వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. గుండె వ్యాధులకు ఒత్తిడి కూడా కారణమవుతుంది, కనుక యోగా, ధ్యానం చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు.
4. వారంలో కనీసం ఒకసారి శరీరం మొత్తానికి నువ్వుల నూనెతో మర్దనా చేసి స్నానం చేయాలి. దీని వల్ల రక్త సరఫరా మెరుగు పడుతుంది. రక్తం శుద్ది అవుతుంది. శరీరంలో ఉండే పొడిదనం పోతుంది. కీళ్లు దృఢంగా మారుతాయి. తాజాగా, ఉత్తేజంగా ఉంటారు. ముఖ్యంగా గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.
5. వేళకు భోజనం చేయకపోయినా దాని ప్రభావం మన గుండెపై పడుతుంది. కనుక వేళకు ఆహారం తీసుకోవాలి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ ను 8 గంటల వరకు పూర్తి చేయాలి. మధ్యాహ్నం భోజనాన్ని 12 నుంచి 1 గంట మధ్య చేయాలి. రాత్రి భోజనాన్ని 7 గంటల లోపు పూర్తి చేయాలి. రాత్రి తిన్న తరువాత నిద్రకు కనీసం 2 గంటల వ్యవధి ఉండాలి. ఈ విధంగా భోజన వేళలు పాటించడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
6. గర్భిణీలు, పిల్లలు, వృద్ధులు మాత్రమే మధ్యాహ్నం నిద్రించాలి. ఇతరులు ఎవరైనా సరే మధ్యాహ్నం నిద్ర పోరాదు. లేదంటే నిద్ర సైకిల్‌కు భంగం కలుగుతుంది. రాత్రి నిద్ర పట్టదు. ఇది ఒత్తిడిని పెంచి గుండె వ్యాధులను కలగజేస్తుంది. కాబట్టి మధ్యాహ్నం నిద్రించరాదు.
7. రాత్రి నిద్రకు ముందు గోరు వెచ్చని పాలలో పసుపు కలుపుకుని తాగితే ఎంతో మేలు చేస్తుంది. దీని వల్ల ఇన్‌ఫెక్షన్లు మాత్రమే కాదు, రాత్రి పూట సడెన్ హార్ట్ ఎటాక్‌లు రాకుండా నివారించవచ్చు. పసుపు కలిపిన పాలను తాగితే రక్త నాళాలు ప్రశాంతంగ మారుతాయి. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
8. అతిగా వ్యాయామం కూడా ప్రమాదకరమే. దీని వల్ల శరీరంపై భారం పడుతుంది. గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది హార్ట్ ఎటాక్ ను కలగజేస్తుంది. కనుక అవసరం అయినంత మేర మాత్రమే వ్యాయామం చేయాలి.
9. నిత్యం మనం అనేక సందర్భాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటుంటాం. అలాగే కంప్యూటర్లపై కూర్చుని ఎక్కువగా పనిచేస్తుంటారు. ఇవి రెండూ హానికరమే. ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయడంతోపాటు పని చేసే సమయాల్లో మధ్య మధ్యలో విరామం తీసుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకునేందుకు రోజూ 1 గంట పాటు కంప్యూటర్ గేమ్స్ ఆడడం, పజిల్స్ నింపడం, బుక్స్ చదవడం, ఇష్టమైన సంగీతం వినడం, జోకులను చదవడం లేదా హాస్య సన్నివేశాలను చూడడం, ప్రకృతిలో గడపడం వంటివి చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. దీంతో గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు.
10. కొందరు ఆహారాలను ఎప్పుడో వండినవి తింటారు. అలా చేయరాదు. దీని వల్ల శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతాయి. తాజాగా వండిన ఆహారాలనే తినాలి. వేడిగా ఉన్నప్పుడు ఆహారాలను తీసుకోవాలి. అలాగే సీజనల్ పండ్లను తినాలి. నిత్యం కూరగాయలు, ఆకుకూరలను, నట్స్ వంటి ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు.
0 Response to "10 tips from Ayurvedic experts to prevent sudden heart attack ..!"
Post a Comment