Careers After 12th Class
Careers After 12th Class: ఉన్నత విద్యకు ఈ ఎంట్రన్స్ టెస్టులు రాయాల్సిందే
- ఇంజనీరింగ్ నుంచి లా వరకు పలు ఎంట్రన్స్‌లు
- వీటిలో స్కోర్‌తో సంబంధిత కోర్సుల్లో ప్రవేశం
- ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్‌లో చదువుకునే అవకాశం
- ఉజ్వల భవిష్యత్తుకు మార్గంగా ప్రవేశ పరీక్షలు
- జేఈఈ-మెయిన్
జాతీయ స్థాయిలో..ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇతర టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌లలో బీఈ/బీటెక్, బీఆర్క్, బీప్లానింగ్ తది తర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష జేఈఈ మెయిన్. ఇంటర్ ఎంపీసీ విద్యార్థులు అర్హులు. మొత్తం మూడు విభాగాల్లో(ఫిజిక్స్,మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ) 300 మార్కులకు ఈ ఆన్‌లైన్ టెస్ట్ పరీక్ష ఉంటుంది. జేఈఈ-మెయిన్ పేపర్ 2లో ర్యాంకు ఆధారంగా ఎన్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సులో ప్రవేశాలు లభిస్తాయి. పేపర్ 2లో మ్యాథమెటిక్స్; ఆప్టిట్యూడ్ టెస్ట్, డ్రాయింగ్ టెస్ట్ విభాగాల్లో నైపుణ్యాలను పరీక్షిస్తారు. పేపర్-2బి పేరుతో బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశానికి పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో మ్యాథమెటిక్స్, ఆప్టిట్యూడ్ టెస్ట్, ప్లానింగ్ బేస్డ్ ప్రశ్నలు అడుగుతారు.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://jeemain.nta.nic.in/
జేఈఈ-అడ్వాన్స్‌డ్
దేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్స్ ఐఐటీల్లో బీటెక్, ఇంటిగ్రేటెడ్ బీటెక్+ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష... జేఈఈ అడ్వాన్స్‌డ్. జేఈఈ-మెయిన్ పేపర్-1లో ప్రతిభ ఆధారంగా 2.5 లక్షల మందిని జేఈఈ-అడ్వాన్స్‌డ్‌కు అర్హత కల్పిస్తారు. ఈ పరీక్ష రెండు పేపర్లలో ఉంటుంది.
ఒక్కో పేపర్ పరీక్ష సమయం మూడు గంటలు. ప్రతి పేపర్‌లోనూ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో జరిగే ఈ పరీక్షలో మంచి స్కోర్ ఆధారంగా ఐఐటీలే కాకుండా.. ఐఐఎస్‌టీ, ఐఐఎస్‌సీ తదితర ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లలో కూడా ప్రవేశాలు పొందొచ్చు. జేఈఈ -అడ్వాన్స్‌డ్ -2024ను మే 26న నిర్వహించనున్నారు. ఇందుకోసం దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 21 నుంచి 30 వరకు అందుబాటులో ఉండనుంది.
వివరాలకు వెబ్‌సైట్: https://www.jeeadv.ac.in/
ఈఏపీసెట్
రాష్ట్ర స్థాయిలోని కాలేజ్‌ల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు అందుబాటులో ఉన్న మార్గం.. టీఎస్ ఈఏపీసెట్, ఏపీ ఈఏపీసెట్.
ఆంధ్రప్రదేశ్‌లో ఈఏపీ(ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ)సెట్, తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ ఈఏపీసీసెట్ పేరుతో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. బీటెక్‌లో చేరేందుకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ పేపర్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్ స్ట్రీమ్ పేపర్‌లో ఉత్తీర్ణత ద్వారా బీటెక్‌తోపాటు బీటెక్(అగ్రికల్చర్ ఇంజనీరింగ్)/బీటెక్(డెయిరీ టెక్నాలజీ)/బీటెక్(ఫుడ్ టెక్నాలజీ)/బీటెక్(బయో టెకాలజీ)/బీఫార్మసీ (ఎంపీసీ)/ఫార్మ్-డీ(ఎంపీసీ) కోర్సుల్లోనూ చేరొచ్చు. మొత్తం 160 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. మ్యాథమెటిక్స్‌లో 80 ప్రశ్నలు, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 40 ప్రశ్నలు చొప్పున అడుగుతారు. అగ్రికల్చర్, ఫార్మసీ, మెడిసిన్ విభాగాల్లో బయాలజీ(బోటనీ, జువాలజీ) నుంచి 80 ప్రశ్నలు, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 40 ప్రశ్నలు చొప్పున ఉంటాయి.
నాటా
ఎంపీసీ అర్హతతో ప్రవేశం పొందే అవకాశం ఉన్న మరో కోర్సు.. బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్. నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్(నాటా) పరీక్షలో స్కోర్ ఆధారంగా.. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ గుర్తింపు పొందిన కళాశాలల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్) కోర్సులో అడ్మిషన్ లభిస్తుంది. ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ గ్రూప్ 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు దరఖాస్తుకు అర్హులు. ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే నాటాలో 125 ప్రశ్నలు (200 మార్కులు) ఉంటాయి. డయగ్రమాటిక్ రీజనింగ్, న్యూమరికల్ రీజనింగ్, వెర్బల్ రీజనింగ్, ఇండక్టివ్ రీజనింగ్, సిట్యుయేషనల్ జడ్జ్‌మెంట్, లాజికల్ రీజనింగ్, అబ్‌స్ట్రాక్ట్ రీజనింగ్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రస్తుతం నాటా-2024 దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. తొలి విడత పరీక్ష ఏప్రిల్ 6న నిర్వహించనున్నారు.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.nata.in/
నీట్-యూజీ
ఎంబీబీఎస్, బీడీఎస్.. ఇంటర్మీడియెట్ బైపీసీ విద్యార్థుల కలల కోర్సులు. వీటిలో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నీట్-యూజీ పేరుతో ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ ఎంట్రన్స్‌లో స్కోర్ ఆధారంగా.. దేశ వ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్‌తోపాటు.. ఆయుష్‌గా పేరొందిన హోమియోపతి, ఆయుర్వేద, యునానీ, నేచురోపతి వంటి కోర్సులు పూర్తి చేసుకుని వైద్య వృత్తిలో స్థిరపడొచ్చు. బైపీసీ ఉత్తీర్ణులు ఈ ఎంట్రన్స్‌కు అర్హులు. నీట్-యూజీ పరీక్షను మొత్తం నాలుగు విభాగాల్లో (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ) 720 మార్కులకు నిర్వహిస్తారు. ఒక్కో విభాగం నుంచి 45 ప్రశ్నలు అడుగుతారు. నీట్-2024ను మే 5న నిర్వహించనున్నారు.
వివరాలకు వెబ్‌సైట్: https://neet.nta.nic.in/
నెస్ట్
ఇంటర్మీడియెట్ ఎంపీసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న మరో ప్రత్యామ్నాయం.. నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్(నెస్ట్). ఈ టెస్ట్‌లో స్కోర్ ఆధారంగా.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైసర్)-భువనేశ్వర్, యూనివర్సిటీ ఆఫ్ ముంబై-డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌లలో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీలో ప్రవేశం పొందొచ్చు. మొత్తం నాలుగు సబ్జెక్ట్‌లలో (బయలాజికల్ సైన్సెస్; కెమికల్ సైన్సెస్; మ్యాథమెటిక్స్; ఫిజిక్స్) ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు అందుబాటులో ఉంటాయి. నెస్ట్ ఎంట్రన్స్.. నాలుగు విభాగాల్లో (మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ)లో 200 మార్కులకు ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది.
వివరాలకు వెబ్‌సైట్: https://www.nestexam.in/
హోటల్ మేనేజ్‌మెంట్‌కు ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ
ఇంటర్మీడియెట్ విద్యార్థులు.. చక్కటి ఉపాధి అవకాశాలు అందుకునేందుకు వీలున్న మరో కోర్సు.. హోటల్ మేనేజ్‌మెంట్. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి హాస్పిటాలిటీ, టూరిజం, హోటల్ మేనేజ్‌మెంట్ రంగాల్లో కెరీర్ అవకాశాలు లభిస్తాయి. జాతీయ స్థాయిలో టూరిజం శాఖ పరిధిలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ క్యాంపస్‌లు హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు అందిస్తున్నాయి. వీటిలో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్ష.. నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్-జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఈ ఎంట్రన్స్ అయిదు విభాగాల్లో(న్యూమరికల్ ఎబిలిటీ అండ్ అనలిటికల్ ఆప్టిట్యూడ్; రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్; జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్; ఇంగ్లిష్ లాంగ్వేజ్; ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్) 200 ప్రశ్నలకు ఉంటుంది. ఈ ఎంట్రన్స్‌లో స్కోర్ ఆధారంగా.. టూరిజం డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ క్యాంపస్‌లు, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని ఇన్‌స్టిట్యూట్‌లు, ఇతర ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్‌లలో హాస్పిటాలిటీ, హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://nchmjee.nta.nic.in/
క్లాట్-యూజీ
ఇంటర్మీడియెట్ విద్యార్థులకు అందుబాటులో ఉన్న మరో కోర్సు.. అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ. న్యాయశాస్త్రంలో నైపుణ్యం సొంతం చేసుకుని లా కెరీర్‌లో రాణించాలనుకునే వారికి ఈ కోర్సు ఉపయుక్తంగా ఉంటుంది. దేశ వ్యాప్తంగా ఉన్న నేషనల్ లా యూనివర్సిటీల్లో ప్రవేశానికి క్లాట్-యూజీ పేరుతో ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ (22 నుంచి 26 ప్రశ్నలు); జీకే అండ్ కరెంట్ అఫైర్స్ (28 నుంచి 32 ప్రశ్నలు); లీగల్ రీజనింగ్ (28-32 ప్రశ్నలు); లాజికల్ రీజనింగ్ (22-26 ప్రశ్నలు); క్వాంటిటేటివ్ టెక్నిక్స్ (10 నుంచి 14 ప్రశ్నలు) ఉంటాయి.
వివరాలకు వెబ్‌సైట్: https://consortiumofnlus.ac.in/clat-2024/
సీయూఈటీ-యూజీ
ఇంటర్మీడియెట్ తర్వాత ప్రముఖ విశ్వ విద్యాలయాల్లో, సెంట్రల్ యూనివర్సిటీల్లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో చేరాలనుకునే వారికి అందుబాటులో ఉన్న మార్గం.. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్-యూజీ. ఈ ఎంట్రన్స్‌ను మూడు సెక్షన్లుగా నిర్వహిస్తారు. సెక్షన్-1ఎ(లాంగ్వేజెస్-50 ప్రశ్నలు); సెక్షన్1బి(లాంగ్వేజెస్-50 ప్రశ్నలు); సెక్షన్-2 (డొమైన్ సబ్జెక్ట్స్ 45/50 ప్రశ్నలు); సెక్షన్-3 (జనరల్ టెస్ట్- 60 ప్రశ్నలు) ఉంటాయి. సెక్షన్-1ఎలో అభ్యర్థులు 13 భాషల్లో ఏదో ఒక భాషను ఎంచుకోవచ్చు. సెక్షన్-1బిలో అభ్యర్థులు 20 భాషల్లో ఏదో ఒక భాషను ఎంచుకోవచ్చు. సెక్షన్-2 డొమైన్ సబ్జెక్ట్స్ విభాగంలో మొత్తం 27 డొమైన్ సబ్జెక్ట్స్ అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు తమకు ఆసక్తి ఉన్న సబ్జెక్ట్‌ను, బ్యాచిలర్ డిగ్రీలో తాము చదవాలనుకుంటున్న కోర్సుకు సరితూగే సబ్జెక్ట్‌ను డొమైన్ సబ్జెక్ట్స్‌గా ఎంచుకోవచ్చు. డొమైన్ సబ్జెక్ట్స్ విభాగం నుంచి 45 లేదా 50 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో చాయిస్ విధానం మేరకు అభ్యర్థులు 35 లేదా 40 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. జనరల్ టెస్ట్ విభాగంలో జీకే, కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ రీజనింగ్, లాజికల్ అండ్ అనలిటికల్, రీజనింగ్ అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. సెక్షన్-1ఎ, సెక్షన్-1బి లాంగ్వేజ్ సబ్జెక్ట్‌లకు సంబంధించి ఎన్‌టీఏ నిర్దేశిత జాబితాలోని లాంగ్వేజ్‌లను ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 5 మార్కులు కేటాయిస్తారు.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://cuet.samarth.ac.in/
0 Response to "Careers After 12th Class"
Post a Comment