Did you know there are 5 types of insurance on ATM card... How to claim these benefits?
ఏటీఎం కార్డు మీద 5 రకాల ఇన్సూరెన్స్‌లు ఉంటాయని మీకు తెలుసా... ఈ ప్రయోజనాలను ఎలా క్లెయిమ్ చేసుకోవాలి?
జీవిత బీమా, ప్రమాద బీమా గురించి మనలో చాలా మందికి తెలుసు. వాయిదాల పద్ధతిలో ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రమాదం జరిగినా, లేదంటే మరణించినా మన కుటుంబానికి బీమా సొమ్ము అందుతుంది.
కానీ, కేవలం ఏటీఎం కార్డు ఉంటే చాలు ఈ బీమా సొమ్ము పొందవచ్చని ఎంత మందికి తెలుసు? అందుకు ప్రత్యేకంగా డబ్బులు చెల్లించాల్సిన పని కూడా లేదు. వివరాలను ఈ కథనంలో చూద్దాం.
ఈ డిజిటల్ యుగంలో చాలా వరకూ నగదు లావాదేవీలు ఆన్‌లైన్‌లోనే జరిగిపోతున్నాయి. ఊళ్లో చిన్న చిన్న దుకాణాల నుంచి ప్రపంచ మార్కెట్ల వరకూ డిజిటల్ నగదు లావాదేవీలే కీలకంగా మారాయి. ఏటీఎం కార్డులు.. అందులోనూ డెబిట్ కార్డులే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
భారత్‌లో వందల సంఖ్యలో పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులతో పాటు అంతర్జాతీయ బ్యాంకులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వాటితోపాటు మైక్రో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు కూడా బ్యాంకింగ్ సంబంధిత లావాదేవీలు నిర్వహిస్తున్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత సెప్టెంబర్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం, భారత్‌లో 96.6 కోట్ల ఏటీఎం కార్డులు వినియోగంలో ఉన్నాయి. ఒకటి కంటే ఎక్కువ కార్డులు ఉన్న వారు కూడా ఇందులోకి వస్తారు.
డెబిట్ కార్డు బీమా పథకం అంటే..?
భారత్‌లోని పబ్లిక్, ప్రైవేట్ బ్యాంకులు వాటి నిబంధనలకు అనుగుణంగా వేర్వేరు స్కీమ్‌లను అమలు చేస్తున్నాయి. వాటిలో డెబిట్ - క్రెడిట్ కార్డులు కూడా ఒకటి. వీటినే ఏటీఎం కార్డులుగా వ్యవహరిస్తారు.
వీటితో ఏటీఎం మెషీన్ల ద్వారా నగదు తీసుకోవడం, లేదా ఇతరులకు పంపించడం వంటి లావాదేవీలు చేసే అవకాశం ఉంటుంది.
ఈ కార్డులతో మరో ప్రయోజనం కూడా ఉంది. ''డెబిట్ కార్డ్ కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ కవర్'' ప్లాన్ కింద బీమా సౌకర్యం అందుబాటులో ఉంది. అందుకు నెలవారీ, లేదా వార్షికంగానూ ప్రత్యేకంగా ఎలాంటి చార్జీలు చెల్లించనవసరం లేదు.
దానికి బదులుగా, మీరు వాడుతున్న డెబిట్ కార్డులకు ఏటా చార్జీల కింద బ్యాంకు కొంత మొత్తాన్ని మీ ఖాతా నుంచి కట్ చేసుకుంటుంది. అందులో కొంత మొత్తం వినియోగదారు పేరు మీద బ్యాంకు తరఫున జీవిత బీమా కంపెనీలకు వెళ్తుంది.
ప్రమాదం జరిగినా, లేదంటే మరణం సంభవించినా బీమా సొమ్ము పొందవచ్చు. చాలా మంది వినియోగదారులతోపాటు కొంత మంది బ్యాంకు సిబ్బందికి కూడా ఈ విషయం తెలియదని ఒక బ్యాంకులో క్లర్క్‌గా పనిచేస్తున్న సునీల్ కుమార్ అన్నారు. ఫలితంగా బ్యాంకు ఖాతాదారుల్లో చాలా అరుదుగా ఈ బీమా కోసం దరఖాస్తు చేస్తుంటారు. బ్యాంకులు కూడా ఉద్యోగులకు ఈ విషయంలో శిక్షణ ఇవ్వడం లేదు.
ఇలాంటి బీమా కవరేజ్ ఉన్నట్లు చాలా బ్యాంకులు తమ ఖాతాదారులకు చెప్పవని సునీల్ అభిప్రాయపడ్డారు.
డెబిట్ కార్డ్ బీమా పథకం ఎలా వర్తిస్తుంది?
బ్యాంకులు వివిధ రకాల ఏటీఎం కార్డులను వినియోగదారులకు జారీ చేస్తాయి. అది వార్షిక చార్జీలు, కార్డు వినియోగంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు సిల్వర్, గోల్డ్, ప్లాటినం కార్డులు.
మీకు వచ్చే బీమా సొమ్ము కూడా దీనిపైనే ఆధారపడి ఉంటుంది. ఎక్కువ చార్జీలు వసూలు చేస్తున్న డెబిట్ కార్డు మీరు వాడుతున్నట్లయితే, మీకు బీమా కవరేజీ కూడా ఎక్కువగానే ఉంటుందని మాజీ బ్యాంకర్, బ్యాంకు ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకుడు సీపీ కృష్ణన్ తెలిపారు.
డెబిట్ కార్డ్ కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ కవరేజీ ప్లాన్ అమలు కోసం బ్యాంకులు ప్రభుత్వ, ప్రైవేట్ బీమా కంపెనీలతో భాగస్వామ్యం పెట్టుకుంటాయి.
ఆర్బీఐ నిబంధనల ప్రకారం, అలాంటి ప్రయోజనాలు, నిబంధనలను బ్యాంకులు పాటించాల్సి ఉంటుంది. అందువల్ల దాదాపు అన్ని బ్యాంకుల్లోనూ ఈ బీమా ప్లాన్ అమల్లో ఉంటుంది.
''నాకు తెలిసినంత వరకు దాదాపు 20 ఏళ్లుగా ఈ బీమా ప్లాన్ అమలులో ఉంది'' అని ఆయన చెప్పారు.
ఐదు రకాల బీమా
1.అకౌంట్ నుంచి డబ్బులు చోరీకి గురైనప్పుడు..
బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు చోరీకి గురైనా, లేదా డెబిట్ కార్డు ద్వారా ఎవరైనా దొంగ చెల్లింపులు చేసినా వాటికి ఇన్సూరెన్స్ పొందే అవకాశం ఉంది. అయితే, అది బ్యాంకు నిబంధనలకు లోబడి ఉంటుంది.
2.వ్యక్తిగత ప్రమాద బీమా
డెబిట్ కార్డు వినియోగదారు ప్రమాదానికి గురై మరణం సంభవిస్తే వారిపై ఆధారపడిన వారు (కుటుంబ సభ్యులు) బీమా సొమ్ము కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
నిర్దిష్ట కాలపరిమితిలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కాలపరిమితి వేర్వేరు బ్యాంకులకు వేర్వేరుగా ఉంటుంది.
3.విమాన ప్రమాద బీమా
విమాన ప్రయాణంలో ప్రమాదం జరిగినా, మరణం సంభవించినా ఈ బీమా వర్తిస్తుంది. అయితే, ఆ విమాన ప్రయాణ టికెట్ సదరు డెబిట్ కార్డుతో కొనుగోలు చేయాల్సి ఉంటుందనే నిబంధన చాలా బ్యాంకుల్లో ఉంది.
4.వస్తువుల కొనుగోళ్లకు భద్రత
డెబిట్ కార్డును ఉపయోగించి కొనుగోలు చేసిన వస్తువులు పోయినా, చోరీకి గురైనా బీమా పొందవచ్చు.
5. ప్రయాణంలో వస్తువులు పోయినా, పాడైపోయినా బీమా
ప్రయాణంలో మీ లగేజీ(వస్తువులు) పోయినా, లేదా వాటికి ఏదైనా కారణంతో అవి పాడైపోయినా, ధ్వంసమైనా బీమా పొందే అవకాశం ఉంది. ఇది బ్యాంకును బట్టి మారుతుంది.
వీటన్నింటికీ బీమా సౌకర్యం ఉంటుంది. అయితే, అది బ్యాంకు నిబంధనలను అనుసరించి ఉంటుంది.
బ్యాంకుకు అవసరమైన అన్ని ధ్రువపత్రాలు అందజేయాల్సి ఉంటుంది. బీమా కవరేజీ రూ.50 వేల నుంచి రెండు కోట్ల రూపాయల వరకూ పొందవచ్చు.
బీమా సొమ్ము పొందడమెలా?
డెబిట్ కార్డు ఇన్సూరెన్స్ ప్లాన్ కింద బీమా సొమ్ము పొందడం అంత పెద్ద విషయమేమీ కాదని సునీల్ కుమార్ చెప్పారు.
బ్యాంకుకు వెళ్లి దరఖాస్తు పత్రాలు తీసుకుని, వాటిని సరైన వివరాలతో నింపి అందజేయాల్సి ఉంటుంది. ఆ పత్రాలతో పాటు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు కూడా జత చేయాల్సి ఉంటుంది.
ఆ తర్వాత బ్యాంకులో ఇన్సూరెన్స్ సంబంధిత వ్యవహారాలు చూసే అధికారికి ఆ దరఖాస్తును పంపిస్తారు. ఆయన వాటిని తనిఖీ చేసి ప్రాసెస్ చేస్తారు. దరఖాస్తు ఆమోదం పొందితే లబ్ధిదారుకు బీమా సొమ్ము అందుతుందని ఆయన చెప్పారు.
దరఖాస్తును తిరస్కరించే అవకాశముందా?
బీమా సొమ్ము దరఖాస్తు ఆమోదం పొందకపోవడానికి కారణాల గురించి అడిగినప్పుడు, అది బ్యాంకు నిబంధనలపై ఆధారపడి ఉంటుందని సునీల్ కుమార్ చెప్పారు.
''మొదట బ్యాంక్ అకౌంట్ యాక్టివ్‌లో ఉండాలి. వినియోగదారు లేదా వారి కుటుంబ సభ్యులు ప్రమాదం జరిగిన మూడు నెలల్లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడం ఆలస్యమైతే ఆ దరఖాస్తును తిరస్కరించవచ్చు.
మరణ ధ్రువీకరణ పత్రం, బ్యాంక్ అకౌంట్‌కు సంబంధించిన వివరాలు, ప్రభుత్వం జారీ చేసిన ఐడెంటిటీ కార్డు వివరాలు, ఎఫ్‌ఐఆర్ కాపీ వంటి పత్రాలు దరఖాస్తుతో పాటు అందించాలి. వాటిలో ఏవైనా అందించలేకపోయినా దరఖాస్తును తోసిపుచ్చే అవకాశం ఉంది.
అలాగే, బ్యాంకు ఖాతా వినియోగదారు నిర్దేశించిన సమయంలో కనీసం ఒక్కసారైనా డెబిట్ కార్డును వినియోగించి ఉండాల్సి ఉంటుంది.
ఒకవేళ విమాన ప్రమాదంలో చనిపోతే ఆ టికెట్ డెబిట్ కార్డుతో కొని ఉండాలి. ఈ నిబంధనలు ఒక్కో బ్యాంకుకి ఒక్కోలా ఉంటాయి'' అని సునీల్ వివరించారు.
ప్రమాదం జరిగిన రోజుకు ముందు 90 రోజుల్లో ఒక్కసారైనా డెబిట్ కార్డును ఉపయోగించి ఉండాలనే నిబంధన ఉంది. అయితే, ఇది ఆయా బ్యాంకుల నిబంధనలను అనుసరించి ఉంటుంది.
అందరికీ ఎందుకు తెలియదు?
బీమా కంపెనీల భాగస్వామ్యంతో బ్యాంకులు ఈ డెబిట్ కార్డ్ బీమా కల్పిస్తున్నాయి.
''డెబిట్ కార్డుతో వచ్చే పత్రాలలో ఇంగ్లిష్‌లో ఉండే సమాచారాన్ని జనం చదవరు. బ్యాంకులు కూడా వాటి గురించి తెలియజేసేందుకు ప్రయత్నించవు'' అని ఎల్‌ఐసీ ఉద్యోగి, సౌత్ జోన్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాయింట్ సెక్రటరీ సురేష్ అన్నారు.
బ్యాంకుల విధివిధానాలు, కార్యకలాపాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఆర్బీఐపై ఉంది.
బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల వల్ల కలిగే ఆర్థిక నష్టాలకు బీమా సౌకర్యం ఉంటుందని ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు అటు ప్రభుత్వాలు కానీ, ఇటు రిజర్వ్ బ్యాంకు కానీ శ్రద్ధ చూపడం లేదని సీపీ కృష్ణన్ విమర్శించారు.
బ్యాంకులు వినియోగదారులకు చెల్లించాల్సిన మొత్తం చెల్లించకపోతే ఎవరికి ఫిర్యాదు చేయాల్సి ఉంటుందనే ప్రశ్నకు సునీల్ కుమార్ మాధానమిస్తూ- ''బ్యాంకులు ఆర్బీఐ పరిధిలోకి వస్తాయి. అందువల్ల ఇలాంటి బీమా విషయాల్లోనూ ఆర్బీఐ జోక్యం చేసుకోవచ్చు'' అని చెప్పారు.
''అర్హత ఉన్న వినియోగదారుకు చెల్లింపులు చేసేందుకు బ్యాంకులు నిరాకరిస్తే తమ వద్ద ఉన్న పత్రాలతో ఆర్బీఐని సంప్రదించవచ్చు. అయితే అది ఎంతవరకూ పరిష్కారం అవుతుందనే విషయం నాకు తెలియదు'' అని ఆయన అన్నారు.
క్లెయిమ్ చేయని బీమా సొమ్ము ఏమవుతుంది?
డెబిట్ కార్డు ఇన్సూరెన్స్ గురించి ఎవరూ పెద్దగా అడగరు. అలాంటప్పుడు ఆ సొమ్ము బీమా కంపెనీలకే వెళ్తుంది.
''ఒకవేళ ఆ బీమా కంపెనీ ప్రభుత్వ సంస్థ అయితే అందులో కొంత పన్నుల రూపంలో ప్రభుత్వానికి వెళ్తుంది. ఒకవేళ ప్రైవేట్ కంపెనీ అయితే అదంతా వారికి లాభమే'' అని సీపీ కృష్ణన్ ఆరోపించారు.
ఇదే విషయమై ఒక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉద్యోగితో మాట్లాడినప్పుడు, ''బీమా కంపెనీకి ఏదైనా పథకం కింద ఎంత డబ్బు వచ్చినా దానిని గ్రాస్ రిసీట్‌గా పరిగణిస్తారు.
అలాంటి సందర్భాల్లో వేర్వేరు బీమా పథకాల ద్వారా డబ్బులు వినియోగదారులు క్లెయిమ్ చేసుకున్నప్పుడు ఆ డబ్బుల నుంచి బీమా సొమ్ము పొందుతారు. కాబట్టి, ఆ డబ్బు మా దగ్గర ఉండదు. అది కేవలం ఆదాయం, ఖర్చుగా మాత్రమే పరిగణిస్తారు'' అని ఆయన చెప్పారు.
ఒక్కో బ్యాంకులో ఒక్కోలా..
దాదాపు అన్ని ప్రధాన బ్యాంకులు ఈ బీమా ప్లాన్ గురించి తమ వెబ్‌సైట్‌లో సమాచారం పొందుపరిచి ఉంటాయి. ప్రమాదాలు, లేదా మరణాలు సంభవించినప్పుడు దానికి అనుగుణంగా బీమా సొమ్ము పొందే అవకాశముంది.
అయితే, ఆ నిబంధనలు ఒక్కో బ్యాంకుకు ఒక్కోలా ఉంటాయి. అవి డెబిట్ కార్డు రకం, బ్యాంకు ఖాతా రకంపై కూడా ఆధారపడి ఉంటాయి.
ఉదాహరణకు, సిల్వర్, గోల్డ్, ప్లాటినం కార్డులు, సేవింగ్స్, శాలరీ, కరెంట్ అకౌంట్లు.
ప్రమాదం జరిగినప్పుడు, లేదా మరణం సంభవించినప్పుడు బ్యాంకు నిబంధనలను అనుసరించి మూడు నెలల నుంచి ఆరు నెలల్లోపు వినియోగదారులు, లేదా వారి కుటుంబ సభ్యులు బీమా సొమ్ము కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ కాలపరిమితి కూడా వేర్వేరు బ్యాంకులు, వేర్వేరు డెబిట్ కార్డులను అనుసరించి ఉంటుంది.
మీకు వర్తించే డెబిట్ కార్డ్ ఇన్సూరెన్స్ కవరేజీ ప్లాన్ గురించి పూర్తి వివరాలను మీకు ఖాతా ఉన్న బ్యాంకును సంప్రదించి తెలుసుకోవచ్చు.
0 Response to "Did you know there are 5 types of insurance on ATM card... How to claim these benefits?"
Post a Comment