If you do this, there will be no digestion problems!
ఇలా చేస్తే డైజెషన్ సమస్యలుండవు!
రోజూ శరీరంలో ఎన్నో రకాల ఆహారాలు పడేస్తాం. జీర్ణ వ్యవస్థ వాటన్నింటినీ అరిగించుకుని శరీరానికి శక్తినిస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమై మళ్లీ టైంకి తిరిగి ఆకలేస్తుంటే..
జీర్ణ ప్రక్రియ సజావుగా ఉన్నట్టు. అలా కాకుండా తినకపోతే కడుపులో మంట, అజీర్తి వంటివి వస్తుంటే జీర్ణ వ్యవస్థ సరిగా లేదని అర్థం. అలాంటప్పుడు ఏం చేయాలంటే..
తిన్నతర్వాత ఆహారం అరగడానికి కడుపులో చాలా ప్రాసెస్ జరుగుతుంది. తీసుకున్న ఆహారం నోటి నుంచి మొదలై తర్వాత జీర్ణాశయంలోకి, ఆ తర్వాత పేగుల్లోకి వెళ్లి దశలవారీగా జీర్ణం అవుతుంది. ఈ స్టేజిల్లో ఎక్కడ చిన్న సమస్య వచ్చినా అజీర్ణ సమస్యలు మొదలవుతాయి.
ఇవి వద్దు
అజీర్ణ సమస్యలకు ఆహారపు అలవాట్లే సగం కారణం. సరైన టైంలో ఆహారం తీసుకోకపోవడం, సరిగా వండని ఆహారం తీసుకోవడం, మరీ ఎక్కువ లేదా మరీ తక్కువ ఆహారం తీసుకోవడం, తిన్నది అరగక ముందే మళ్లీ తినడం, రాత్రిపూట హెవీ ఫుడ్ తీసుకోవడం, కొవ్వు పదార్థాలు, ఫ్రై ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తినడం వంటి అలవాట్ల వల్ల జీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తాయి. అలాగే మద్యపానం, ధూమపానం లాంటి అలవాట్లు, కోపం, ఒత్తిడి వంటి తీవ్రమైన ఎమోషన్స్ వల్ల కూడా జీర్ణ వ్వవస్థ దెబ్బ తింటుంది.
చేయొచ్చు
అజీర్ణ సమస్యలకు హోం రెమిడీస్ మంచి మెడిసిన్స్‌గా పనిచేస్తాయి. యాంటాసిడ్స్, గ్యాస్ ట్యాబెట్లకు బదులు ఈ ఫుడ్స్ తీసుకుంటే అజీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు.
అల్లం: అజీర్ణ సమస్యలకు అల్లం చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఇది కడుపులో వికారం, గ్యాస్, కడుపు ఉబ్బరం లాంటి అన్ని రకాల జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. ఒక గ్లాస్ నీళ్లలో కొద్దిగా అల్లం ముక్కలు వేసి ఆ నీళ్లని బాగా మరిగించి తాగాలి. ఇలా చేయడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. అలాగే అల్లం టీ రెగ్యులర్‌గా అలవాటు చేసుకుంటే ఎలాంటి అజీర్ణ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.
బొప్పాయి: ఆహారం అరగడానికి బొప్పాయి బాగా హెల్ప్ అవుతుంది. బొప్పాయిలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఆహారం సరిగా జీర్ణం కానప్పుడు శరీరానికి కావల్సినంత శక్తిని అందిస్తుంది. బొప్పాయిలో ఉండే పెపైన్ అనే ఎంజైమ్ ఆహారం సులభంగా జీర్ణం అవ్వడానికి సాయపడుతుంది.
పుదీనా: కడుపులో వచ్చే మంట నుంచి పుదీనా వెంటనే ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. ఒక కప్పు వేడి నీళ్లలో పుదీనా ఆకులు కలిపి, పది నిముషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత అందులో తేనే కలుపుకుని రోజూ తాగితే అజీర్ణ సమస్యలు తగ్గుతాయి.
దాల్చిన చెక్క: దాల్చిన చెక్క పొట్టలోని కండరాలకు రిలీఫ్ ఇచ్చి, క్రిములను నాశనం చేస్తుంది. దీంతో జీర్ణ క్రియ సులభంగా జరుగుతుంది. ఒక కప్పు వేడి నీళ్లలో రెండు దాల్చిన చెక్కలు వేసి, ఐదు నిముషాలు నానబెట్టిన తర్వాత, కొంచెం తేనె కలిపి తీసుకోవాలి. ఇలా చేస్తే జీర్ణ క్రియ సులభంగా జరుగుతుంది.
అలోవెరా: అలోవెరాలో ఎన్నో విటమిన్లు, ఖనిజాలు, అమైనో యాసిడ్స్ ఉంటాయి. అలోవెరా.. తీసుకున్న ఆహారంలో హాని చేసే పదార్థాలను తొలగిస్తుంది. దీంతో జీర్ణక్రియ వేగం పెరుగుతుంది. అందుకే రోజూ ఒక స్పూన్ కలబంద రసాన్ని ఏదో ఒక రూపంలో తీసుకోవడం మంచిది.
మజ్జిగ: మజ్జిగ జీర్ణక్రియకు బాగా హెల్ప్ అవుతుంది. మజ్జిగలో ఉండే లాక్టిక్ యాసిడ్ కడుపులో మంటను రగిలించే యాసిడ్స్‌ను న్యూట్రల్ చేస్తుంది. అందుకే కడుపులో మంటగా అనిపించినప్పుడు గ్లాసు చల్లని మజ్జిగ తాగితే వెంటనే రిలీఫ్ ఉంటుంది.
బీట్‌రూట్: కడుపు ఉబ్బరం, మలబద్ధకం, కడుపు నొప్పి , వంటి సమస్యల నుంచి బయటపడేందుకు బీట్‌రూట్ బాగా సాయపడుతుంది. బీట్‌రూట్‌లోని మెగ్నీషియం, ఫైబర్, పొటాషియంలు ఎసిడిటీని తగ్గించి, జీర్ణ క్రియ సరిగా జరిగేలా సాయపడతాయి.
అరటి: అరటి పండ్లు డయేరియాకు మంచి మెడిసిన్. ఇందులో ఉండే ఎలక్ట్రోలైట్స్, పొటాషియం అజీర్ణ సమస్యలను తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
పాలు: చల్లని పాలు తాగడం వల్ల కూడా కడుపులో అజీర్ణ సమస్యలు తగ్గుతాయి. పాల వల్ల కడుపులో ఉండే యాసిడ్స్ న్యూట్రల్ అవుతాయి. దీంతో ఆహారం మంచిగా జీర్ణమై, గ్యాస్ రాకుండా ఉంటుంది.
0 Response to "If you do this, there will be no digestion problems!"
Post a Comment