The only temple not eclipsed. The specialty of Srikalahasti is detailed.
గ్రహణం పట్టని ఏకైక దేవాలయం. శ్రీకాళహస్తి ప్రత్యేకత వివరంగా.
గ్రహణం వచ్చినా కూడా మూయని ఒకే ఒక గుడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న శ్రీకాళహస్తి దేవస్థానం.సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం, ఏ గ్రహణమైన ప్రపంచంలోని అన్ని దేవాలయాలు దాదాపు మూసివేస్తారు. కానీ, దక్షిణ కైలాసంగా, వాయులింగేశ్వర క్షేత్రంగా ప్రఖ్యాతిగాంచిన శ్రీకాళహస్తీశ్వరాలయం మాత్రం గ్రహణం పట్టని ఆలయంగా చరిత్రలో నిలిచపోయింది.ఎందుకంటే ఈ ఆలయం ఒక్కటే ఏ గ్రహణం వచ్చినా మూసివేయబడదు.ఏ గ్రహణం ఏ సమయంలో వచ్చినా ఆ సమయంలో ఇక్కడి ఆలయాన్ని తెరిచి ఆలయంలో కొలువైన శ్రీజ్ఞాన ప్రసునాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వరునికి గ్రహణ కాల అభిషేకాలు నిర్వహించడం సంప్రదాయంగా కొనసాగుతోంది.
ఈ పుణ్యే క్షేత్రంలో శ్రీకాళహస్తీశ్వరస్వామి స్వయంభుగా వెలిశారు. అంతేగాక, ధృవమూర్తిగా వెలసిన శివలింగాకృతిపై. శ్రీ(సాలీడు), కాళము(పాము), హస్తి(ఏనుగు)లతో భక్తకన్నప్ప గుర్తులతో స్వయంభు లింగంగా ఆవిర్భవించింది. ఇక్కడ వెలిసిన వాయులింగేశ్వరున్ని సూర్యచంద్రాగ్ని లోచనుడిగా పిలుస్తారు.సూర్యచంద్రాదులతోపాటు అగ్నిభట్టారకునితోపాటు తొమ్మిది గ్రహాలు, 27 నక్షత్రాలను నిక్షిప్తం చేసుకున్న కవచంతో భక్తులకు దర్శనమిస్తున్నాడు. అందువల్ల ఇక్కడి క్షేత్రంలో రాహు, కేతువుల ఆటలు సాగవు.
అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఉండే భక్తులందరూ ఇక్కడి క్షేత్రంలో రాహు, కేతు సర్పదోష నివారణ పూజలను చేయించుకుని వారి దోషాలను నివృత్తి చేసుకుంటున్నారు.సూర్య గ్రహణం అయితే గ్రహణం ప్రారంభమయ్యే సమయంలో, అదే చంద్ర గ్రహణం అయితే విడిచే సమయంలో శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీజ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామి ధృవమూర్తులకు శాంతి అభిషేకాలు నిర్వహించడం సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ సమయంలో దర్శనార్థం వచ్చే భక్తులకు ఆలయంలో అనుమతించడం జరుగుతుంది.
0 Response to "The only temple not eclipsed. The specialty of Srikalahasti is detailed."
Post a Comment