Maha Siva ratri Pagaalamkarana
మల్లన్న పెళ్లికి నేతన్న ‘తలపాగా’ మూడు తరాలుగా పృథ్వీ వంశస్తుల ఆచారం .
శ్రీశైలం మల్లన్న కల్యాణానికి ముహూర్తం ముంచుకొస్తోంది. పెళ్లికోసం తలపాగా సిద్ధమైంది. శివరాత్రి రోజున చీరాల నేతన్న నేసిన తలపాగాను చుట్టిన తర్వాతే పెళ్లితంతు మొదలవుతుంది. ఈ అదృష్టం చీరాల చేనేత కార్మికుడికి దక్కడం ఈ ప్రాంతవాసుల అదృష్టం. ఈ ఆచారం మూడు తరాలుగా వస్తోంది. ఇదీ తంతు.. : ఏటా శివరాత్రి రోజు శ్రీశైలం మల్లన్న కల్యాణం జరుగుతుంది. ఆయనను వరుడిని చేసేందుకు తలపాగాలంకరణ చేస్తారు. శివరాత్రి లింగోద్భవ సమయంలో రాత్రి 10 నుంచి 12 గంటల మధ్య కల్యాణం నిర్వహిస్తారు. ఇందుకు గాను చీరాలలో తయారు చేసిన చేనేత వస్త్రంతో పెళ్లి కుమారుడిగా అలంకరిస్తారు. 150 గజాలు ఉండే ఈ వస్త్రాన్ని ఆలయ శిఖరం నుంచి నవ నందులను కలుపుతూ చుడతారు. (ఈ సమయంలో వస్త్రాన్ని ఇచ్చే భక్తులు ఒంటిపై నూలు పోగు లేకుండా ఉండాలన్నది ఆచారం).చీరాలకు మహద్భాగ్యం : మల్లన్నను పెళ్లి కుమారునిగా అలంకరించే వస్త్రాన్ని నేసే మహద్భాగ్యం చీరాల మండలం దేవాంగపురి గ్రామ పంచాయతీ, హస్తినాపు రంలోని చేనేత కుటుంబానికి చెందిన 'పృథ్వీ ' వంశానికి దక్కింది. ఈ వంశం వారు మూడు తరాలుగా (వందేళ్లకు పైగా) ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం పృథ్వీ వెంకటేశ్వర్లు నలభై ఏళ్లుగా మల్లన్న వస్త్రాన్ని నేస్తూ ప్రతి శివరాత్రి రోజున శ్రీశైలం వెళ్లి మల్లన్నకు అలంకరిస్తారు. ఈ మహద్భాగ్యం తనకు దక్కడం పూర్వ జన్మ సుకృతమని వెంకటేశ్వర్లు చెబుతారు.ఉపవాసం, నియమ, నిష్టలు : మల్లన్నను అలంకరించే ఈ వస్త్రం తయారీకి 365 రోజులు పడుతుంది. రోజుకు ఒక మూర (అడుగున్నర చొప్పున 365 రోజులు ఉపవాసం, నియమ, నిష్టలతో దీనిని నేస్తారు. ఇందులో పృథ్వీ వెంకటే శ్వర్లు కుటుంబ సభ్యులు పాలుపంచుకుంటారు. తలపాగాను తీసుకొని పృథ్వీ వెంకటేశ్వర్లు కుటుంబం ఊరేగింపుగా శ్రీశైలం బయల్దేరుతుంది. పది రోజుల పాటు అక్కడే ఉండి లింగోద్భవ సమయంలో రాత్రి 11 గంటల సమయంలో ఒంటిపై నూలుపోగు లేకుండా గర్భగుడి నుంచి నవనందులను కలుపుతూ శిఖరం చుట్టూ ఈ పాగాతో చుడతారు. ఆ తర్వాతే శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలుమొదలవుతాయి.
0 Response to "Maha Siva ratri Pagaalamkarana"
Post a Comment