We Love Reading Summer Activities
We Love Reading Summer Activities ( Class 6 - 10) 14.05.24
Day-22
Class 6-10 We Love Reading
నేటి ఆణిముత్యం
రాజటధర్మజుండు సురరాజసుతుండట ధన్వి శాత్రవో
ద్వేజకమైన గాండివము విల్లట సారథి సర్వభధ్రసం
యోజకుడైన చక్రి యట యుగ్రగదాధరుడైన భీముడ
య్యాజికి దోడువచ్చునట యాపద గల్గుటిదేమిచోద్యమో !
భావము & వివరణ:
అంపశయ్య పైనున్న భీష్మపితామహులను చూడడానికి పాండవులను తీసుకొని శ్రీ కృష్ణ పరమాత్మ వెళతారు. అప్పటికి ఉప పాండవులను అశ్వథ్థామ సంహరిచేసాడు , మరి పుత్రశోకంతో బాధపడుతున్న పాండవులను పెద్దవాడైన భీష్ముడు పరామర్శించాలి కదా , ఆయన వారితో ఎలా మాట్లాడారో చూడండి.
ధర్మజుడైన యుధిష్ఠరుడు రాజుగా ఉండగా ,ధన్వి,సురరాజ పుత్రుడు ఐన ధనంజయుడు ఈ ధర్మనిష్టా పరాయణుడైన యుధిష్ఠరునకు అండగా ఉండగా, ఆ ధనుంజయుని చేతిలో శత్రు భయంకరమైన గాండివం వంటి విల్లు ఉండగా,సమస్త ప్రపంచానికి రక్షకుడైన శ్రీ కృష్ణ పరమాత్మ వీరికి సారధిగా (జీవన సారధిగా) ఉండగా ,ఉగ్రగదాధరుడైన భీముడు కూడా ఇక్కడే ఉండగా,ఈ పాండవులకు ఇటువంటి ఆపదలు కలిగాయంటే ఇది కాలమహిమ కాక మరేమి . నాయనా,కాలము యొక్క మహత్యము చాలా చాలా విచిత్రమైనది ,ఎంతటి వారైనా కాలము లో కష్టములను అనుభవించక తప్పదు, ఆ సమయంలో భగవంతుని ప్రార్ధిస్తూ వాటిని ఎదుర్కొనే శక్తిని పెంపొందిచుకోవాలి అని తన మనుమలను ఊరడించాడు భీష్మపితామహుడు.పాండవులకే తప్పని కష్టములు మనకి తప్పుతాయా అండీ, మనము కూడా ఆ భీష్మపితామహుల మాటలను మననం చేసుకుంటూ ఆ కాలానుగుణంగా వచ్చే కష్టములను తట్టుకునే శక్తిని మనకు కృప చేయమని ఆ భగవంతుని ప్రార్ధిస్తూ వాటిని ఎదుర్కొనేందుకు సంసిధ్ధులమవ్వాలి .
👬 నేటి చిన్నారి గీతం
నవ్వాలి చిట్టిపాపల్లారా
నవ్వాలి చిట్టిపాపల్లారా
నవ్వాలి ముద్దుగుమ్మల్లారా
మీ నవ్వుల జల్లులలో
ముంగిళ్ళు గుమగుమలాడాలి !
మీ నవ్వుల వెన్నెలలో
చంద్రుడు దోబూచులాడాలి !
మీ నవ్వుల దివ్వెలలో
చుక్కలు మిలమిల మెరవాలి 1
మీ నవ్వుల పొంగుల్లో
సంద్రాలె పన్నీటిస్నానాలు చెయ్యాలి !
మీ నవ్వుల పువ్వులె
మాలలుగా గుచ్చి
గాంధితాత మెడలో వేయండి
పొందండి కోటి దీవెనలు !
🗣నేటి జాతీయం
అడ్డుకట్ట వేయడం
అదుపు చేయడమనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. ఒక ప్రవాహాన్ని ఆపడానికి అడ్డుకట్ట వేయడం అందరికీ తెలిసిందే. ఆ అడ్డుకట్టతో నీటి ప్రవాహాన్ని అదుపుచేసినట్లే ఒకరు మరొకరిని అదుపులో పెట్టే సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. 'వాడి దూకుడుతనానికి వాళ్ల నాన్న అడ్డుకట్ట వేసి ఓ మంచి పనిచేశాడు' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయాన్ని ఉపయోగించడం కనిపిస్తుంది.
🤠 నేటి సామెత
రౌతు మెత్తనయితే గుర్రం మూడు కాళ్ళ మీద పరిగెత్తినట్టు
నేటి సామెత
రౌతు మెత్తనయితే గుర్రం మూడు కాళ్ళ మీద పరిగెత్తినట్టు
రౌతు అనగా గుర్రపు స్వారీ చేసేవాడు. అలాంటి రౌతు మెత్తనివాడైతే గుర్రము అతని ఆదేశాలని సరిగా పాటించదు. అదే విధంగా అధికారంలో ఉన్న వ్యక్తి మెత్తనివాడైతే అతని కింద పని చేసేవాళ్ళు సరిగా పనిచేయరని చెప్పడానికి ఈ సామెతను వాడుతారు.
రౌతు మెత్తగా వుంటే గుర్రం మూడు కాళ్ళ మీద నడుస్తుంది. అనగా నిదానంగా నడుస్తుంది. అదే రౌతు గట్టి వాడైతే... నాలుగు దెబ్బలు తగిలిస్తాడు. దాంతో అది పరుగు అందుకుండుండి. ఏపని చేసేటప్పుడైనా కొంత కఠినంగా వుండాలని ఉద్దేశించినది ఈ సామెత.
✍🏼 నేటి కథ
నిజం దాగదు
మహారాజు ప్రతాప సింహుడికి అందమైన రూపం ఉంది గానీ ఆలోచనాశక్తి తక్కువే. విందులు వినోదాలు విలాసాలలో జీవితాన్ని గడిపేయాలనే నిర్లక్ష్య స్వభావం అతడిది. రాజ్య పరిపాలన విషయంలో ఏమాత్రం శ్రద్ధ కనపరిచేవాడు కాదు. అన్ని విషయాలలోనూ పూర్తి అధికారం మహామంత్రికే ఇచ్చి తాను ఏమీ పట్టించుకునేవాడు కాదు. ఏ సమస్య వచ్చినా ఏ పనికైనా ఇతర మంత్రులతో కూడా తెలిసి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవడం అనే పద్ధతి పాటించే వాడు కాదు. ఇది చాలా అలుసుగా తీసుకునేవాడు మహామంత్రి చంద్రసేనుడు. తాను చేసే పనులుగానీ, తీసుకునే నిర్ణయాలు గానీ మహారాజుకు తెలియవలసిన అవసరం లేదని తనకే పూర్తి అధికారం ఆయన ఇచ్చాడని ఇతర మంత్రులకు చెప్పి ఉండడం వలన వారెవరూ ఏ విషయంలోనూ నోరు మెదిపేవారు కాదు.
తన ఇష్ట ప్రకారం ఎన్నో రెట్లు ఎక్కువగా ప్రజలనుండి పన్నులు వసూలు చేయడమే కాకుండా అడుగుతీసి అడుగు వేస్తే పన్ను కట్టాలి అన్నట్టుగా అవసరం లేని వాటిమీది కూడా పన్నులు విధించేవాడు. వసూలు చేసిన అధిక మొత్తాన్ని తన ఇంట్లో నేలమాళిగలో దాచుకునేవాడు. ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అవుతూ అసహనంతో దిక్కుతోచని వారయ్యారు. కరువు కాటకాలు వచ్చినా పంటలు సరిగ్గా పండకపోయినా తిండిగింజలు కరువై చేసేందుకు పనులు దొరకడమూ కష్టమై ఆదాయం లేక అలమటించి పోయే ప్రజలని ఏమాత్రం పట్టించుకునేవాడు కాదు చంద్రసేనుడు. ఎవరైనా ధైర్యం చేసి రాజుగారికి తమ గోడు చెప్పుకోవాలని వచ్చినా అనుమతి ఇచ్చేవాడు కాదు. పైగా అలాంటి ధైర్యం ఉన్నవారి వలన ఎప్పటికైనా తనకి ముప్పు కలుగుతుందన్న భయంతో రహస్యంగా వాళ్ళని పరలోకానికి పంపించెయ్యమని తన అనుచరులకి పురమాయించేవాడు.
కవులు కళాకరుల రచనలు, నృత్యాలు, నాటికలు అన్నీ కూడా మహారాజుని మహామంత్రిని పొగుడుతూ, రాజ్యం సుభిక్షంగా ఉందని మెచ్చుకుంటూ ఉన్నవే మహారాజు చూసేలా ఏర్పాటు చేస్తాడు. వేరే ఇతరమైన వాటికి అనుమతి ఇవ్వడు. పరిపాలన గురించి ప్రతాపసింహుడికి ఏ అనుమానం రానివ్వడు.
ఆ రోజు వినోద కార్యక్రమలలో ఆఖరి అంశం ఇద్దరు యువకుల కళాప్రదర్శన జరుగుతోంది మహారాజు సమక్షాన. ఒకరు గానం చేస్తుంటే రెండవవారు దానికి తగినట్లుగా నాట్యం చేస్తున్నారు. పూర్తయిన తర్వాత రాజుగారు వారిని అభినందిస్తుంటే ఆ ఇద్దరి ముఖాల్లో ఆనందం కాదు కోపం ప్రజ్వలించింది. ‘ఆపు మహారాజా నీ అభినందనలు’.
రాజు గారితో పాటూ అక్కడున్న అందరూ నివ్వెరపోయి చూశారు. ఇద్దరి యువకులలో పెద్దవాడు అన్నాడు ‘నాగానంలో ఎన్నో అపశృతులు దొర్లాయి. నా తమ్ముడి నాట్యంలో ఎన్నో తప్పులు పొరపాట్లు ఉన్నాయి. మేము కావాలనే ఆ విధంగా కార్యక్రమం చేశాము. ఎందుకంటే ఇక్కడ మేథావులు ఉన్నారు. నాట్యంలోనూ గానంలోనూ మంచి విద్వత్తు గలవారు ఉన్నారు. ఏ ఒక్కరైనా మా తప్పులు పొరపాట్లు చెప్తారేమో చూద్దామని వారికి పరీక్ష పెట్టాము. వాళ్ళ నోళ్ళు ఏనాడో కట్టేశాడు మహామంత్రి. అత్యంత ముఖ్యమైన విషయాలలో కూడా మాట్లాడడానికి వీల్లేని పరిస్థితులలో ఉన్న వీళ్ళు ఈ సందర్భంలో.. రాజునీ మంత్రినీ పొగుడుతూ వారి పరిపాలనని మెచ్చుకుంటూ పాడుతూ ఆడుతుంటే నోరు మెదిపే సాహసం ఎందుకు చేస్తారు? మేము అనుకున్నదే జరిగింది. మహారాజా మిమ్మల్ని వెర్రి వెంగళప్పని చేసి విలాసాలకి బానిసని చేసి తన పబ్బం గడుపుకుంటూ అధికారం ఉందన్న గర్వంతో ప్రజలని నానా ఇబ్బందులూ పెడుతున్న ఈ మహామంత్రి...’ అతని మాట పూర్తి కాకుండానే కత్తి దూసి మీదకి వచ్చాడు మంత్రి చంద్రసేనుడు.
ఊహించని ఈ సంఘటనకి వెలవెల పోయాడు ప్రతాపసింహుడు. కనురెప్పపాటులో చంద్రసేనుడి చేతిలోని కత్తి ఒడుపుగా పట్టి తీసుకున్నాడు చిన్నవాడు. మరు నిమిషంలో యువకులిద్దరూ తమ మారువేషాలు చటుక్కున తీసివేయడంతో ఆసీనులై ఉన్న ఇతర మంత్రులందరూ ఒక్క ఉదుటున సంభ్రమంగా లేచి నిలబడ్డారు. ప్రతాప సింహ మహారాజుకి ఆనందంతో నోట మాటరాలేదు. ఆ యువకులిద్దరూ మరెవరో కాదు... తన సోదరులే..
మూడు నాలుగు సంవత్సరాల కిందట వేటకి వెళ్ళిన వారిద్దరినీ అడవి మృగాలు చంపి తినివేశాయని చెప్పి తనని నమ్మించిన చంద్రసేనుడివైపు కోపంగా చూశాడు.
‘వేటకి వెళ్ళిన మా ఇద్దరినీ హత్య చేయవలసిందిగా చెప్పి నలుగురిని మా వెనక రహస్యంగా పంపించిన ఘనుడు ఈ మహామంత్రి. వాళ్ళు అసలు విషయం మాకు చెప్పడంతో పొరుగు రాజ్యంలో అజ్ఞాతవాసం చేశాము ఇన్నాళ్ళూ. అన్ని విద్యలలోనూ ఆరితేరి వచ్చాము. యుద్ధానికైనా సిద్ధమే. ఇంక ఈ చంద్రసేనుడి ఆటలు సాగనివ్వం. ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుని మీరు పరిపాలన చేసేందుకు మీకు అండగా మేము ఉంటాము.’ సోదరులిద్దరూ ప్రతాపసింహుడికి చెరొక పక్కగా నిలబడ్డారు.
అక్కడ ఉన్న అందరూ జయ జయ ధ్వానాలు చేశారు.
చంద్రసేనుడి తల వొంగిపోయింది.
తెలుసు కుందాం
🟥బారోమీటర్ లోని పాదరసం మట్టం ద్వారా వాతావరణం లోని మార్పులు ఎలా తెలుస్తాయి ?
🟩బారోమీటర్ లోని పాదరసం మట్టం వాతావరణం లో ఉండే గాలి పీడనాన్ని తెలియజేస్తుంది . పాదరసం మట్టం పైకి పోయిందంటే గాలిపీడనం ఎక్కువగా ఉన్నట్లు అర్ధం , ఆ మట్టం కిందకు పడిందంటే గాలి పీడనం తగ్గిందన్నమాట . బారోమీటర్ ని అంతరిక్షం లోకి తీసుకెళితే , ఆ శూన్య ప్రదేశం లో గాలి పీడనమనే ప్రశ్నే ఉండదు కాబట్టి ... పాదరసం మట్టం పూర్తిగా కిందికి పడిపోతుంది .
భూమి ఉపరితలం నుంచి అనేక కిలోమీటర్ల ఎత్తికు వ్యాపించి ఉండే వాతావరణం లోని గాలి గురుత్వాకర్షణ వల్ల ఒత్తిడి (pressure) కలుగజేస్తుంది . భూమి పై వివిధ ప్రదేశాలలో గాలి పీడనం వేరువేరు గా ఉండడమే కాకుండా కాలం తో పాటు మారుతూ ఉంటుంది . చల్లని గాలి కన్నా వేడి గాలి సాంద్రత తక్కువగా ఉంటుంది . అంటే వేడి గాలి , చల్ల గాలి కన్నా తేలిగా ఉంటుంది . అందువల్ల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే ఎడారుల్లో గాలి పీడనం తక్కువగా ఉంటే , మంచు వలన చల్లగా ఉండే ధ్రువ ప్రాంతాల్లో గాలి పీడనం ఎక్కువగా ఉంటుంది .
వాతావరణం లోని గాలి పీడనం హెచ్చు తగ్గులను సూచించే బారోమీటర్ రీడింగులను బట్టి వాతావరణం లో కలుగాబోయే మార్పులను ముందుగానే తెలుసుకోవచ్చు . పీడనం ఎక్కువై బారోమీటర్ లోని పాదరసం మట్టం పైకి పోయిందంటే ఆ ప్రాంతం నిర్మలం గా ఉండబోతున్నట్లు . పీడనం తగ్గి పాదరసం మట్టం తటాలున పడిపోతే ఆ ప్రాంతం మేఘాలతో కూడిన వర్షాలు రాబోతాయని అర్ధం . మట్టం మరీ పడిపోతే తుఫాన్ లాంటి భీబత్సాలకు సూచిక .
0 Response to "We Love Reading Summer Activities"
Post a Comment