What is real SC classification? What is Mandakrishna Madiga's 30-year struggle for? Description
అసలు SC వర్గీకరణ అంటే ఏమిటి? మందకృష్ణ మాదిగ 30 ఏళ్ళ పోరాటం దేనికి? వివరణ.
ఎస్సీ వర్గీకరణ అనే అంశం గురించి తరచూ అందరం వింటుంటాం. అలాంటి ఈ అంశంపై తాజాగా సుప్రీం కోర్టులో సంచలన తీర్పు వెలువడింది. ఎస్సీల వర్గీకరణను రాష్ట్రాలు చేసుకునే అవకాశం ఇస్తూ గురువారం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
ఎస్సీ వర్గీకరణ చెల్లుబాటుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఎస్సీ వర్గీకరణ అంశంపై ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టులో మూడు రోజుల పాటు విచారణ జరిగింది. సుదీర్ఘ వాదనల తర్వాత సుప్రీంకోర్టు నేడు నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే అసలు ఎస్సీ వర్గీకరణ అంటే ఏమిటి? దీని వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఎస్సీ వర్గీకరణ.. ఈ ఉద్యమానికి మూడు దశాబ్దాల చరిత్ర ఉంది. షెడ్యూల్డు కులాలను ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా వర్గీకరించాలనే డిమాండ్‌తో ఈ ఉద్యమం ప్రారంభమై…ఏళ్ల తరబడి కొనసాగుతూ వస్తోంది. ఈ ఉద్యమాన్ని మంద కృష్ణ మాదిగ ముందుండి నడిపించారు. పట్టు వదలని విక్రమార్కుడిలా దాదాపు 30 ఏళ్లుగా మాదిగలకు న్యాయం చేయాల్సిందేనంటూ తన పోరాటం చేసి.. చివరకు విజయం సాధించారు. హిందూ వ్యవస్థల్లో అనేక కులాలు ఉన్నాయి. ఆ కులాల్లోనే మళ్లీ అనేక ఉపకులాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆ ఉపకులాల్లోని కొందరికి తీవ్ర అన్యాయం జరుగుతుందని వారి వాదన. అలాంటి వాదనే ఎస్సీ లో వినిపించింది. ఈ క్రమంలోనే ఎస్సీ వర్గీకరణ అనే ఉద్యమం పుట్టుకొచ్చింది. ఎస్సీల్లో 59 ఉప కులాలు ఉన్నాయి. ప్రధానంగా మాల, మాదిగల జనాభా ఎక్కువ. అందులోనూ మిగతా వారితో పోలిస్తే మాదిగ జనాభా సంఖ్య ఎక్కువ ఉంటుంది.
2011 లెక్కల ప్రకారం.. దేశంలో ఎస్సీ జనాభా మొత్తం 1,38,78,078 ఉంది. వీరిలో మాదిగలు 67 లక్ష2 వేల 609 మంది ఉన్నారు. అలానే మాలలు 55,70,244 మంది. ఈ లెక్కలు చూసినట్లు అయితే మాదిగల సంఖ్య.. మాలల కన్నా దాదాపు 11.3 లక్షలు ఎక్కువ. ఇలా ఎస్సీ జనాభాలో మాదిగలు అధికంగా ఉండడంతో స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి నేటి వరకు.. విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాల్లో మాదిగలకు అన్యాయం జరుగుతుందని అప్పట్లో కొందరు అభిప్రాయపడ్డారు. 70 శాతం ఉన్న మాదిగలు10 శాతం రిజర్వేషన్ ప్రయోజనాలు పొందుతుంటే, 30 శాతం ఉన్న మాలలకు 90 శాతం అందుతున్నాయని అనేది పలువురి అభిప్రాయం. ఈ నేపథ్యంలోనే దళితుల్లోనే ఒక వర్గం మరో వర్గ ప్రయోజనాల్ని సొంతం చేసుకుంటోందని మంద కృష్ణ మాదిగ గొంతెత్తి నినదించి..ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి పునాది వేశారు.
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని (MRPS) మంద కృష్ణ మాదిగ 1994లో స్థాపించారు. విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాల్లో మాదిగలకు దక్కాల్సిన వాటా దక్కాల్సిందేనంటూ మాదిగలను చైతన్య పరిచారు. ఈ నేపథ్యంలోనే ఎస్సీ కులాల వర్గీకరణ డిమాండ్ వచ్చింది. బీసీల్లో ఉన్న ఏ,బి,సి,డి వర్గీకరణ మాదిరిగానే.. ఎస్సీ కులాలను A,B ,C,D గ్రూపులుగా విభజించి ఆయా కులాల జనాభా నిష్పత్తి ప్రకారం 15 శాతం ఉన్న రిజర్వేషన్ కోటాను పెంచాలనే డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ చేసి..అన్ని రకాలుగా నష్టపోతున్న మాదిగలకు న్యాయం చేయాలని మంద కృష్ణ మాదిగ కోరారు. ఆయన ఈ అంశం అమలు కోసం 1972నుంచి మొదలుకుని అనేక విధాలుగా ప్రయత్నాలు చేశారు.
ఈ క్రమంలోనే తాజాగా ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై నేడు సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వర్గీకరణ తప్పనిసరి అని, ఆ అంశంపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అనివార్యమని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం 6:1 నిష్పత్తిలో తుది తీర్పును వెల్లడించింది. దీంతో మూడు దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. సుప్రీంకోర్టు తీర్పుపై మందకృష్ణ మాదిగ సంతోషం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తే.. ఎస్సీల్లోని అన్ని కులాలల న్యాయం జరుగుతుందని పలువురు అభిప్రాయా పడుతున్నారు. ఈ నిర్ణయంతో రాజకీయాల్లో కూడా పలు మార్పులు జరగొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి.. ఈ మొత్తం అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
0 Response to "What is real SC classification? What is Mandakrishna Madiga's 30-year struggle for? Description"
Post a Comment