For business and industry without any guarantee Rs. Mudra loans up to 20 lakhs, application procedure.
ఎలాంటి హామీ లేకుండా వ్యాపారం, పరిశ్రమల కోసం రూ. 20 లక్షల వరకూ ముద్రా రుణాలు, దరఖాస్తు చేసుకొనే విధానం.
కొత్తగా ఏదైనా సూక్ష్మ, చిన్న పరిశ్రమనో, వ్యాపారాన్నో ప్రారంభించాలని అనుకుంటూ ఆర్థిక మద్దతు కోసం చూస్తున్నారా? లేదంటే మీ చిన్న వ్యాపారాన్ని కానీ, పరిశ్రమను కానీ విస్తరించటానికి నిధుల కోసం వెతుకుతున్నారా?
అయితే, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'ప్రధానమంత్రి ముద్రా యోజన' మీ లాంటి వారికోసమే. ఈ పథకం కింద ఎలాంటి పూచీకత్తు, గ్యారెంటీ లేకుండా బ్యాంకుల నుంచి 20 లక్షల రూపాయల వరకూ రుణం తీసుకోవచ్చు.
వ్యాపారం కోసం దేశంలోని సూక్ష్మ, చిన్న తరహా వ్యాపారాలు, పరిశ్రమలకు రుణాలు అందించే పథకం ప్రధానమంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై). ఈ పథకం కింద ఇచ్చే రుణాలనే 'ముద్రా రుణాలు' అని పిలుస్తున్నారు.
MUDRA అంటే.. మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ లిమిటెడ్.
దేశంలో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు, వ్యాపార సంస్థల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం స్థాపించిన ఆర్థిక సంస్థ ఇది. ఈ పరిశ్రమలకు బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, మైక్రోఫైనాన్స్ సంస్థల ద్వారా నిధులు అందించి వాటిని అభివృద్ధి చేయటం ముద్రా లక్ష్యం.
కార్పొరేటేతర, వ్యవసాయేతర సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు, వ్యాపారాల కోసం సులభంగా, ఎలాంటి పూచీకత్తు లేకుండా సూక్ష్మ రుణాలు అందించటం కోసం 2015 ఏప్రిల్‌లో ఈ 'ప్రధానమంత్రి ముద్రా యోజన'ను ప్రారంభించారు.
అప్పుడు ముద్రా రుణాల గరిష్ట పరిమితి రూ. 10 లక్షలుగా ఉండేది. తాజాగా రుణాల పరిమితిని రూ. 20 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 బడ్జెట్‌లో ప్రకటించారు.
ముద్రా పథకం విశిష్టతలు, ప్రయోజనాలు, అర్హతలు, దరఖాస్తు చేసే విధానం తెలుసుకుందాం.
ముద్రా రుణాల విశిష్టతలు, ప్రయోజనాలు ఏమిటి?
హామీ అవసరం లేదు: ముద్రా రుణాలు పొందడానికి రుణ గ్రహీతలు ఎలాంటి పూచీకత్తు (సెక్యూరిటీ) కానీ, థర్డ్ పార్టీ గ్యారంటీలు గానీ ఇవ్వాల్సిన అవసరం లేదు.
ఈజీగా నిధుల వినియోగం: ముద్రా రుణాలను 'ముద్రా కార్డు' ద్వారా సులభంగా వినియోగించుకోవచ్చు.
విస్తృత కవరేజీ: చిరు విక్రేతలు, వ్యాపారులు, సర్వీస్ ప్రొవైడర్లు, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు, ఆటోలు, క్యాబ్‌లు వంటి వాహనాలు కొనుగోలు చేయటం సహా అనేక రకాల వ్యాపారాలకు ఈ రుణాలు పొందవచ్చు.
అందుబాటులో వడ్డీ రేట్లు: ముద్రా రుణాల మీద వడ్డీ రేట్లు అందుబాటులోనే ఉంటాయి. ఈ రుణాలపై వడ్డీ రేట్లను రుణం ఇచ్చే బ్యాంకు నిర్ణయిస్తుంది. అయితే ఆ వడ్డీ రేట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటాయి.
తిరిగి చెల్లింపు సౌలభ్యం: ముద్రా రుణాల తిరిగి చెల్లింపు విధానాన్ని చిన్న పరిశ్రమలు, వ్యాపారాల ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా రూపొందించారు.
రాయితీ నిబంధనలు: ముద్రా రుణాలకు దానికవిగా సబ్సిడీలు (రాయితీలు) ఏవీ లేవు. అయితే ప్రతిపాదిత రుణం మరేదైనా ప్రభుత్వ పెట్టుబడి రాయితీ అందించే పథకంతో ముడిపడి ఉన్నట్లయితే, ఆ రాయితీ ముద్రా రుణాలకు కూడా వర్తిస్తుంది.
ఎవరికి ఇస్తారు?
- పట్టణాల్లో అయినా, గ్రామాల్లో అయినా.. ఎక్కడైనా వ్యాపారాలు, ఉపాధి పరిశ్రమలకు ఈ రుణాలు పొందవచ్చు.
- సొంత యాజమాన్యం అయినా, భాగస్వామ్య యాజమాన్యం అయినా ఈ రుణాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు, వ్యాపారాలు నడిపేవారు, కొత్తగా ప్రారంభించాలనుకునే వారు ఈ రుణాలు తీసుకోవచ్చు.
- వ్యవసాయానికి అనుబంధంగా గల వ్యవసాయేతర కార్యకలాపాలు - తేనెటీగల పెంపకం, కోళ్ల ఫారాలు, చేపల పెంపకం వంటి పరిశ్రమలను ప్రారంభించడానికి గానీ, విస్తరించడానికి గానీ రుణాలు పొందవచ్చు.
- పండ్లు, కూరగాయల విక్రేతలు, టిఫిన్ సెంటర్లు, హోటళ్లు వంటి చిన్న దుకాణాలు నడిపే వ్యాపారులు, విక్రేతలు వ్యాపారం విస్తరించడానికి లేదా ప్రారంభించడానికి పెట్టుబడుల కోసం ముద్రా రుణాలు పొందవచ్చు.
- ట్రక్ ఆపరేటర్లు, క్యాబ్, ఆటో డ్రైవర్లు, రిపేర్ షాపులు, మెషీన్ ఆపరేటర్లు, చేతివృత్తుల పరిశ్రమలకు పరికరాల కొనుగోలు, వాణిజ్య రవాణా వాహనాల కొనుగోలు కోసం ముద్రా రుణాలు తీసుకోవచ్చు.
- టైలరింగ్ షాపులు, బ్యూటీ పార్లర్లు వంటి సేవా రంగంలో ఉపాధి, పరిశ్రమల కోసం కూడా ఈ రుణాలు పొందవచ్చు.
ముద్రా రుణాలు ఎన్ని రకాలు? పరిమితులు ఏంటి?
- ప్రధానమంత్రి ముద్రా యోజన కింద.. లబ్ధిదారు రుణం కోరుతున్న పరిశ్రమ ఏ దశలో ఉన్నదనే దానిని బట్టి శిశు (Shishu), కిశోర్ (Kishor), తరుణ్ (Tarun) అనే మూడు విభాగాలలో రుణాలు అందిస్తారు.
- శిశు విభాగంలో రూ. 50,000 వరకు, కిశోర్ విభాగంలో రూ. 50 వేల నుంచి రూ. 5 లక్షల వరకు, తరుణ్ విభాగం కింద రూ. 5 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు ముద్రా రుణాలు పొందవచ్చు.
- శిశు రుణాలకు 1 నుంచి 12 శాతం వరకు వడ్డీ రేట్లు ఉంటాయి. గ్రామీణ బ్యాంకులు 3.5 శాతం, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు) 6 శాతానికి రుణాలు అందిస్తున్నాయి.
- కిషోర్ రుణాల వడ్డీ శాతం 8.6 నుంచి ప్రారంభం అవుతుంది.
- తరుణ్ రుణాలకు 11.15 శాతం నుంచి 20 శాతం వరకు వడ్డీ రేట్లు ఉంటాయి.
రుణం పొందటానికి అర్హతలు?
- 18 ఏళ్ల వయసు నిండిన భారత పౌరులు ఎవరైనా ముద్రా రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
- వ్యవసాయేతర కార్యకలాపాలైన తయారీ, శుద్ధి, వ్యాపారం, సేవా రంగం వంటి ఉపాధి సృష్టించే ప్రణాళిక ఉన్న వారు ఎవరైనా ముద్రా రుణాలకు అర్హులే.
- దరఖాస్తుదారు ఏ బ్యాంకులోనయినా డిఫాల్టర్ అయి ఉండకూడదు. రుణాల చెల్లింపు చరిత్ర బాగుండాలి.
- ముద్రా రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వ్యాపారం లేదా పరిశ్రమ రంగంలో దరఖాస్తుదారుకు నైపుణ్యం, అనుభవం ఉండాలి.
కావలసిన పత్రాలు
ముద్రా రుణం శిశు విభాగంలో లోన్ కోసం అవసరమయ్యే పత్రాలు:
గుర్తింపు కార్డులు: ప్రభుత్వం జారీ చేసిన ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్‌పోర్టు, మరేదైనా ఫొటో గుర్తింపు కార్డు - వీటిలో ఏదైనా ఒకటి.
అడ్రస్ ప్రూఫ్: ఓటరు ఐడీ, ఆధార్ కార్డు, పాస్‌పోర్టు, బ్యాంక్ పాస్‌బుక్, బ్యాంక్ ఖాతా తాజా స్టేట్‌మెంట్, ఇటీవలి విద్యుత్ బిల్లు, టెలిఫోన్ బిల్లు, ఆస్తి పన్ను రసీదు - వీటిలో ఏదైనా ఒకటి.
ఫొటోలు: ఇటీవల దిగిన పాస్ పోర్టు సైజు కలర్ ఫొటోలు 2 కాపీలు.
కొటేషన్: కొనుగోలు చేయవలసిన యంత్రాలు, పరికరాలకు సంబంధించిన కొటేషన్.
వ్యాపార వివరాలు: వ్యాపార సంస్థ కార్డు, అడ్రస్, సంబంధిత లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు, సంస్థ యాజమాన్యానికి సంబంధించిన ఇతర పత్రాలు, వ్యాపార యూనిట్ చిరునామా.
కిషోర్, తరుణ్ రుణాల కోసం అవసరమయ్యే పత్రాలు:
పైన తెలిపిన గుర్తింపు కార్డు, అడ్రస్ ప్రూఫ్, ఫొటోలు, వ్యాపార వివరాలతో పాటు అదనంగా..
బ్యాంకు లావాదేవీల వివరాలు: గత ఆరు నెలల అకౌంట్ స్టేట్‌మెంట్.
వ్యాపార లావాదేవీల వివరాలు: ఆదాయపు పన్ను, సేల్స్ ట్యాక్స్ రిటర్నులు, గత రెండు సంవత్సరాల బ్యాలెన్స్ షీట్లు (రూ. 2 లక్షలు, అంతకంటే ఎక్కువ రుణాల కోసం)
బిజినెస్ వివరాలు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల వివరాలు.
బిజినెస్ ప్రణాళిక: ప్రాజెక్టు రిపోర్ట్, సాంకేతిక, ఆర్థిక వివరాలు.
ముద్రా రుణాలు ఇచ్చే సంస్థలు ఏవి?
- అర్హత గల మెంబర్ లెండింగ్ ఇన్‌స్టిట్యూషన్ (ఎంఎల్ఐ)లు ఈ ముద్రా రుణాలు అందిస్తాయి. వాటి వివరాలు..
- ప్రభుత్వ రంగ బ్యాంకులు
- ప్రైవేటు రంగ బ్యాంకులు
- ప్రభుత్వ నిర్వహణలోని సహకార బ్యాంకులు
- గ్రామీణ బ్యాంకులు
- మైక్రో ఫైనాన్స్ సంస్థలు
- నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు
- స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు
- ముద్రా లిమిటెడ్ అమోదించిన ఇతర ఫైనాన్షియల్ సంస్థలు
దరఖాస్తు చేయటం ఎలా?
- రుణాలు ఇచ్చే ఏ సంస్థ ద్వారా అయినా ముద్రా రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఆన్‌లైన్‌లో అయితే ఉద్యమిమిత్ర www.udyamimitra.in వెబ్‌సైట్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఈ వెబ్‌సైట్‌లో ముద్ర లోన్ అప్లై మీద క్లిక్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తుదారు పేరు, ఈ-మెయిల్, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి.
- మీ మొబైల్ నంబరుకు OTP వస్తుంది.
- మీ వ్యక్తిగత వివరాలు, వృత్తి, వ్యాపార, పరిశ్రమల వివరాలను ఎంటర్ చేయాలి.
- ప్రాజెక్ట్ ప్రతిపాదనలు సిద్ధం చేయడానికి హ్యాండ్ హోల్డింగ్ ఏజెన్సీని ఎంచుకోవచ్చు. లేదా నేరుగా 'లోన్ అప్లికేషన్ సెంటర్' క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.
- ముద్రా శిశు లేదా ముద్రా కిషోర్ లేదా ముద్రా తరుణ్ ఏ - విభాగంలో రుణం కావాలో ఎంచుకోవాలి.
- దరఖాస్తుదారుల వ్యాపారం, కార్యకలాపాలు ఇతర సమాచారాన్ని నమోదు చేయాలి. తయారీ, సేవ, వ్యాపారం లేదా వ్యవసాయ అనుబంధంగా ఉన్న కార్యకలాపాలలో ఎంచుకోవాలి.
- దరఖాస్తుదారుల పూర్తి వివరాలు, బ్యాంకింగ్/రుణ వివరాలు, ఇతర సమాచారాన్ని ఎంటర్ చేయాలి.
- సంబంధిత ధ్రువపత్రాలు - గుర్తింపు కార్డు, అడ్రస్ ప్రూఫ్, దరఖాస్తుదారుల ఫొటో, సంతకం, వ్యాపార సంస్థ చిరునామా మొదలైన వివరాలకు సంబంధించిన పత్రాలు అటాచ్ చేయాలి.
- అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ నంబర్ జనరేట్ అవుతుంది. భవిష్యత్తు సమాచార సంప్రదింపుల కోసం ఈ నంబరును భద్రపరచుకోవాలి
0 Response to "For business and industry without any guarantee Rs. Mudra loans up to 20 lakhs, application procedure."
Post a Comment